కుల ధ్రువీకరణకు రెవెన్యూ కొర్రీలు

Tue,June 11, 2019 01:26 AM

కొణిజర్ల: మీది ఎస్సీ సామాజిక వర్గమా..? మీరు చర్చికి వెళతారా...? అయితే, మీరు ఎస్సీ కానట్టే...! మీకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వరుగాక ఇవ్వరు...!! మన లౌకిక వ్యవస్థలో ఎవరైనా.. ఏ మత విశ్వాసాలనైనా పాటించొచ్చు. దానికీ, దీనికీ సంబంధమేమిటి..? అని ప్రశ్నిస్తున్నారా...?! ఇవన్నీ నాకు తెలియదు. చర్చికి వెళ్లే ఎస్సీలకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చేది లేదు అని నిక్కచ్చిగా చెబుతున్నారు.. కొణిజర్ల తహసీల్దార్.కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు మండల రెవెన్యూ అధికారులు కొర్రీలు పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వ్యక్తి మతం మారవచ్చు. కానీ కులం మారలేరు. ఒక కులంలో పుట్టిన వ్యక్తి చివరి వరకు అదే రిజర్వేషన్‌లో కొనసాగుతారు అని, సుప్రీం కోర్టు గతంలో తీర్పునిచ్చింది. దీని ప్రకారంగా హరిజనులను ఎస్సీలుగా, గిరిజనులను ఎస్టీలుగా, వెనుకబడిన తరగతులను బీసీలుగా, ఉన్నత వర్గాలను ఓసీలుగా గుర్తించాలి. కానీ, దరఖాస్తు చేసిన ఎస్సీలకు కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇక్కడి తహసీల్దార్ ఎస్‌వీఎన్ మూర్తి ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. చర్చికి వెళ్లే ఎస్సీలకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వబోమని చెబుతున్నారు.మీ ఇళ్లలో క్రిస్టియానిటీకు సంబంధించిన బొమ్మలు ఉన్నాయా...? మీరు చర్చికి వెళ్తారట కదా...! మిమ్మల్ని ఎస్సీగా పరిగణించలేం అని, ఆయన చెబుతున్నారని ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఇతర మండలాల్లో ఇలాంటి పరిస్థితి లేదని, ఇక్కడ మాత్రమే ఇలా కొర్రీలు పెడుతున్నారని ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో విద్యార్థుల తదుపరి/ఉన్నత చదువులకు ఇబ్బందేర్పడుతోంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని ఇక్కడి ఎస్సీలు వేడుకుంటున్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles