కోరం కనకయ్య భద్రాద్రి తొలి జడ్పీ పీఠంపై..

Sun,June 9, 2019 05:53 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా అవతరించిన అనంతరం జరిగిన తొలి జెడ్పీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన టీఆర్‌ఎస్ పార్టీ ఏకగ్రీవంగా జడ్పీ పీఠాన్ని దక్కించుకుంది. గత నెల మూడు విడుతల్లో జరిగిన ఎన్నికల్లో 21 జడ్పీటీసీలకు గాను 16 అత్యధిక జడ్పీటీసీలను గెలుచుకున్న టీఆర్‌ఎస్ శనివారం జరిగిన జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో కో- ఆప్షన్ సభ్యుల నుంచి మొదలుకొని వైస్ చైర్మన్ ఎన్నిక వరకు పోటీయే లేకుండా ఏకగ్రీవంగా దక్కించుకుంది. శనివారం జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ, సీనియర్ ఐఏఎస్ అధికారి కె.నిర్మల సమక్షంలో ఎన్నిక జరిగింది. ఉదయం పది గంటలకు కో- ఆప్షన్ సభ్యులుగా అశ్వాపురం మండలానికి చెందిన మహ్మద్ షర్ఫుద్దీన్, చండ్రుగొండ మండలానికి చెందిన సయ్యద్ రసూల్ నామినేషన్ దాఖలు చేశారు. వీరికి పోటీగా ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఇద్దరు కో- ఆప్టెడ్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ప్రొసీడింగ్ ఆఫీసర్, కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ప్రకటించారు. అనంతరం నిర్వహించిన జడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగింది. జడ్పీ చైర్మన్‌గా కోరం కనకయ్య పేరును సుజాతనగర్ జడ్పీటీసీ సభ్యురాలు లావుడ్యా బిందుచౌహాన్ ప్రతిపాదించగా, మణుగూరు జడ్పీటీసీ సభ్యుడు పోశం నర్సింహారావు బలపర్చారు. జడ్పీ చైర్మన్‌గా ఇతర పార్టీల వారెవరూ పోటీ చేయకపోవడంతో కోరం కనకయ్యను జడ్పీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. అదే విధంగా జడ్పీ వైస్‌చైర్మన్ పదవికి చుంచుపల్లి జడ్పీటీసీ సభ్యుడు కంచర్ల చంద్రశేఖర్‌రావు పేరును దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ప్రతిపాదించగా, దుమ్ముగూడెం జడ్పీటీసీ తెల్లం సీతమ్మ బలపర్చారు. వైస్ చైర్మన్ ఎన్నికకు కూడా ఇతర పార్టీల వారెవరూ పోటీ చేయకపోవడంతో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా కంచర్ల చంద్రశేఖర్‌రావును ఏకగ్రీవంగా ప్రకటించారు. కో- ఆప్టెడ్ సభ్యులు, జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా జరగడంపై కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ అభినందనలు తెలిపారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, రేగా కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీటీసీ సభ్యులకు ఎన్నికైన జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, కో- ఆప్షన్ సభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన జడ్పీటీసీ సభ్యులకు చైర్మన్, వైస్ చైర్మన్లు కృతజ్ఞతలు తెలిపారు.

74
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles