ఖమ్మంలో భారీ వర్షం

Fri,June 7, 2019 06:03 AM

(ఖమ్మం వ్యవసాయం):ఒక వైపు బలమైన గాలి దుమారం, మరోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం.. దీంతో తొలుత భయపడిన నగర వాసులు తరువాత వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. భారీ వర్షం కురిసిన ప్రాంతాల్లో మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలకు వరదనీరు చేరడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. రఘునాథపాలెం మండలంలో వడగండ్ల వాన కురవడంతో ఆ మండల వాసులు సాయంత్రం వర్షాన్ని ఆస్వాదించారు. అయితే గురువారం ఉదయం నుంచీ తీవ్రమైన ఎండతోపాటు ఉక్కపోత కూడా ఉంది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో నగరవాసులు ఉపశమనం పొందారు.
అయితే తొలుత బలమైన గాలుల కారణంగా నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికులతో పాటు నగరవాసుల సైతం అసౌకర్యానికి గురయ్యారు. నెలరోజుల నుంచి వేసవి తాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులు, జిల్లా వాసులు.. గురువారం సాయంత్రం వేళ చల్లబడిన వాతావరణంతో ఉపశమనం పొందారు. మరో వారం రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేసిన విషయం విదితమే. గురువారం సాయంత్రం 4 గంటల తరువాత దాదాపు 30 నిమిషాల పాటు గాలిదుమారం వీచడంతో నగరంలో అన్ని ప్రాంతాలకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనంతరం ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభం కావడంతో నగరంలో ఒక్కసారిగా జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. దీంతో వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన నగరవాసులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షం కారణంగా మయూరిసెంటర్, బస్టాండ్ సెంటర్, కమాన్‌బజార్, త్రీటౌన్ ప్రాంతంలోని పీఎస్‌ఆర్ రోడ్‌తోపాటు ఆయా కాలనీలలోని వీధులలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. 30 నిమిషాలపాటు కురిసిన వర్షానికి నగరవాసులు, ప్రయాణికులు స్పల్ప ఇబ్బందులకు గురైనప్పటికీ వేసవితాపం నుంచి తాత్కాలికంగా కొంత ఊరట చెందారు. ఖమ్మంనగరంతో పాటు శివారు మండలాలు అయిన ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, కూసుమంచి తదితర మండలాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles