పట్టుదలతో ప్రతిష్ట నిలబెట్టిన నాయకత్వం..

Fri,June 7, 2019 06:02 AM

నమస్తే తెలంగాణ సత్తుపల్లి, జూన్ 6 : రాజకీయ రణరంగంలో గెలుపోటములు సహజమే అయినప్పటికీ సంకల్ప బలంతో టీఆర్‌ఎస్ పార్టీ అండదండలతో పోగొట్టుకున్న కాడే రాబట్టుకున్న నాయకులు ప్రతిష్టను నిలబెట్టుకున్న వైనం సత్తుపల్లి మండలంలో చర్చనీయాంశంగా మారింది. వరుస ఎన్నికలతో వేడెక్కిన రాజకీయం కొత్త చరిత్రకు నాంది పలికింది. కాదు పొమ్మన్న స్థానికులతోనే సత్తా చాటి ధీటుగా నిలిచిన ఆ ముగ్గురు ఎంపీటీసీలు మండలంలో హాట్ టాపిక్‌గా మారారు.

జనవరిలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సత్తుపల్లి మండల పరిధిలోని 21 పంచాయతీల్లో టీఆర్‌ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని ధీటుగా నిలిచింది. ఈ క్రమంలోనే రామానగరం పంచాయతీ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థ్ధిగా పోటీచేసిన వేల్పుల కళావతి సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి నాగబత్తిని చంద్రశేఖర్ పై 170 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దీంతో తన ఓటమికి కారణాలను అన్వేషించిన నాగబత్తిని టీఆర్‌ఎస్ పార్టీలో చేరి కారు గుర్తుపై తాజాగా జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసి ప్రజా కూటమి బలపరిచిన గార్ల సురేష్ పై 290 ఓట్ల ఆధిక్యంతో ఎంపీటీసీగా గెలిచి టీఆర్‌ఎస్ సత్తా చాటారు. రామానగరం పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 1530 కాగా సర్పంచ్‌గా తాను నష్టపోయిన 170 ఓట్లకు ఎంపీటీసీగా టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసి 290 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రేజర్ల పంచాయతీ పరిధిలో 2770 ఓట్లు ఉండగా విస్సంపల్లి వెంకటేశ్వరరావు సమీప కాంగ్రెస్ ప్రత్యర్థిపై 43 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమిని చవిచూసి తిరిగి అధిష్ఠానం ఆశీస్సులతో ఎంఎల్‌ఏ సండ్ర వెంకట వీరయ్య సలహాలు, సూచనలు మేరకు ఎంపీటీసీగా బరిలో దిగి కొత్తూరు గ్రామంతో కలిపి 3600 ఓట్లకు 430 ఓట్ల భారీ మెజార్ట్టీని కైవసం చేసుకుని కారు జోరును చూపించారు. ఇదిలా ఉండగా కిష్టారం పంచాయితీ మండలంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నిక. ప్రతి ఎన్నికల్లోనూ స్థానిక నాయకత్వం దృష్టంతా కిష్టారంపైనే ఉంటుంది. ఈ క్రమంలో స్థానిక సంస్థలకు జరిగిన వరుస ఎన్నికల్లో గ్రామపంచాయతీ పరిధిలోని 3150 ఓట్లకు 107 ఓట్ల స్వల్ప వ్యత్యాసంతో పాలకుర్తి సునీత ప్రజాకూటమి బలపరిచిన చెట్టిమాల రేణుకపై ఓటమి పాలైనప్పటికీ ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజాపక్షాన నిలిచి ప్రజల అభిమానాలను చూరగొని అధికార టీఆర్‌ఎస్ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి తిరిగి ఎంపీటీసీగా పోటీచేసి కిష్టారం, కొమ్మేపల్లి గ్రామాలకు చెందిన 3150 మంది ఓటర్ల ఆశీస్సులతో నష్టపోయిన 107 ఓట్ల స్థానంలో 534 ఓట్ల మెజార్టిని కైవసం చేసుకుని టీఆర్‌ఎస్ జెండాన రెపరెపలాడించారు. ఈ విధంగా మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాల్లో సర్పంచ్‌లుగా పోటీచేసి ఓడిపోయి తిరిగి ఎంపీటీసీలుగా గెలుపొందిన ఈ ముగ్గురు అభ్యర్ధులు మండల స్థాయి రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయంగా నిలిచారు. పట్టుదలతో, అంకిత భావంతో నిస్వార్థ ప్రజాసేవకులుగా పడిన చోటే లేచిన కెరటం మాదిరిగా యువ రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles