నేడే ప్రాదేశిక తీర్పు..

Tue,June 4, 2019 01:21 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.. మూడు విడుతల్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల కళ్లు కాయలు కాసేలా ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నారు.. 20 రోజుల క్రితం స్ట్రాంగ్‌రూముల్లో పటిష్ట భద్రత మధ్య ఉన్న బ్యాలెట్ బాక్సులు నేడు తెరుచుకోనున్నాయి.. దీంతో బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మధ్యాహ్నం రెండు, మూడు గంటల్లోపే ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అన్ని పార్టీల అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది గంటల్లో ఫలితాలు వెలువడనుండటంతో తమ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందోనని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా మూడు విడుతల్లో నిర్వహించిన ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. జిల్లాలోని 21 జెడ్పీటీసీ, 209 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడుతల్లో ఎన్నికలు జరిగాయి. మే 6, 10, 14 తేదీల్లో మూడు విడుతలుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఎన్నికల కమిషన్ విడుతల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 27వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి ఉన్నా వివిధ రాజకీయ పార్టీలు అభ్యర్థనల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ ఫలితాల తేదీని వాయిదా వేస్తూ ఈ నెల 4వ తేదీకి మార్పు చేసింది. అందుకు అనుగుణంగా జిల్లావ్యాప్తంగా ఉన్న ఏడు కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రత కల్పించింది. నేడు ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఫలితాలను వెల్లడించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్, ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో జిల్లాలో ఉన్న ఏడు కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. వంద మీటర్ల దూరంలో పోలీస్ అవుట్‌పోస్టును ఏర్పాటు చేసి పాస్‌లు ఉన్నవారిని, కౌంటింగ్ ఏజెంట్లను, అభ్యర్థులను మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించనున్నారు.

మూడు విడుతల్లో 962 మంది బరిలో..
జిల్లా ప్రాదేశిక స్థానాలకు మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 21 జెడ్పీటీసీ, 209 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 962 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 21 జెడ్పీటీసీ స్థానాలకు 121 మంది, 209 ఎంపీటీసీ స్థానాలకు 841 మంది పోటీ పడ్డారు. మొదటి విడుతలో 7 జెడ్పీటీసీ స్థానాలకు 41 మంది, 71 ఎంపీటీసీ స్థానాలకు 303 మంది అభ్యర్థులు, రెండవ విడుతలో 8 జెడ్పీటీసీ స్థానాలకు 52 మంది, 82 ఎంపీటీసీ స్థానాలకు 295 మంది అభ్యర్థులు, మూడవ విడుతలో ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 28 మంది, 56 ఎంపీటీసీ స్థానాలకు 243 మంది మొత్తం 962 మంది అభ్యర్థులు పోటీలో నిలిచి తమ బలాబలాలను నిరూపించుకోనున్నారు. బూర్గంపాడు మండలం మినహా అన్ని మండలాల్లో ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బూర్గంపాడు మండల జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరిగి నేడు ఫలితం వెలువడనుంది.

టేబుళ్ల వారీగా ఓట్ల లెక్కింపు..
మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు టేబుళ్ల వారీగా జరగనుంది. ప్రతీ ఎంపీటీసీ స్థానానికి రెండు టేబుళ్లు ఉంటాయి. ఒక టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను నియమించారు. ఉదయం 8 గంటల నుంచి 8.30 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరగనుంది. 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న బండిల్స్‌గా తయారు చేస్తారు. జెడ్పీటీసీకి ఒక బాక్సును, ఎంపీటీసీకి ఒక బాక్సును ఏర్పాటు చేస్తారు. ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు సరిగ్గా 11 గంటలకు ప్రారంభం చేస్తారు. టేబుల్‌కు వెయ్యి ఓట్ల చొప్పున లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12.30 గంటల కల్లా ఎంపీటీసీ కౌంటింగ్ పూర్తి కానుంది. మధ్యాహ్నం ఒంటిగంట తరువాత జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. మూడు నుంచి 4 గంటల మధ్యలో జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపును కూడా పూర్తి చేస్తారు. 209 ఎంపీటీసీ స్థానాలు, 21 జెడ్పీటీసీ స్థానాలకు జిల్లాలోని ఏడు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. 1524 మంది సిబ్బంది ఈ కౌంటింగ్‌లో పాల్గొంటున్నారు. ఎంపీటీసీలకు 78 మంది ఆర్‌వోలు, జెడ్పీటీసీలకు 21 మంది ఆర్‌వోలు, ఇతర సిబ్బంది కౌంటింగ్‌లో పాల్గొంటున్నారు.

కౌంటింగ్ కేంద్రాల వివరాలు..
అశ్వాపురం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని బ్యాలెట్ బాక్సులను భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్ట్రాంగ్‌రూంలో భద్రపర్చారు. అక్కడే ఓట్ల లెక్కింపు జరగనుంది. ములకలపల్లి, పాల్వంచ, టేకులపల్లి మండలాల్లోని బ్యాలెట్ బాక్సులను పాల్వంచలోని అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపర్చి అదే కళాశాలలో కౌంటింగ్ జరగనుంది. అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, జూలూరుపాడు మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను సుజాతనగర్ మండలంలోని వేపలగడ్డలో ఉన్న అబ్దుల్‌కలాం ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. అదే కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అశ్వారావుపేట మండల బ్యాలెట్ బాక్సులను అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల స్ట్రాంగ్‌రూంకు తరలించారు. కరకగూడెం, మణుగూరు, పినపాక మండలాల్లోని బ్యాలెట్ బాక్సులను మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల స్ట్రాంగ్‌రూంకు తరలించారు. ఆళ్లపల్లి, ఇల్లెందు, గుండాల మండలాల బ్యాలెట బాక్సులను ట్రైబల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కాలేజ్, ఇల్లెందు సుదిమళ్ల లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాల బ్యాలెట్ బాక్సులను కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాల స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు.

7న ఎంపీపీ, 8న జెడ్పీ చైర్మన్ ఎన్నికలు
నేడు ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడనున్నాయి. అనంతరం ఈ నెల 7న మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగనుంది. మరుసటి రోజు 8వ తేదీన జిల్లా పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏ పార్టీకి మండలాల వారీగా ఎన్ని ఎంపీటీసీ స్థానాలు గెలుస్తాయో, ఏ పార్టీ వారు ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులను చేజిక్కించుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మండలంలో ఎక్కువ ఎంపీటీసీ స్థానాలను గెలిచిన రాజకీయ పార్టీ అభ్యర్థులు ఎంపీపీని, వైస్ ఎంపీపీని ఎన్నుకోనున్నారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా అత్యధిక జెడ్పీటీసీ స్థానాలు దక్కించుకున్న పార్టీ జెడ్పీ చైర్మన్, వైస్‌చైర్మన్ పీఠాన్ని అధిష్టించనుంది. ఒకవేళ 7,8 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలకు కోరం పూర్తికాకపోతే జిల్లా అధికారులు మరుసటి రోజు ఎన్నిక నిర్వహించనున్నారు.

ప్రాదేశికంలోనూ కారుదే జోరు..
జిల్లావ్యాప్తంగా మూడు విడుతల్లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కారు జోరు స్పష్టంగా కనపడింది. ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుంచి అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఉపసంహరణల వరకు స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జులు విస్తృతంగా పర్యటించి బలమైన అభ్యర్థులను బరిలో నిలిపారు. దీంతో మూడు విడుతల్లోనూ టీఆర్‌ఎస్‌పార్టీ అభ్యర్థుల హవా కొనసాగినట్లు తెలుస్తుంది. ప్రచారం నుంచి ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో టీఆర్‌ఎస్ పార్టీ సఫలీకృతమైంది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు ప్రచారం నిర్వహించే నాథుడే కరువయ్యాడు. ఎవరికి వారే యమునాతీరే అన్న చందానా వారికివారే ప్రచారం నిర్వహించుకొని ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరుమీద నడకే కానుంది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల ఇంచార్జులకు, రాష్ట్ర కార్యవర్గానికి జెడ్పీ ఎన్నికల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేస్తూ జిల్లాకు ఎన్నికల ఇంచార్జులను నియమించి సమన్వయ బాధ్యతలను అప్పగించారు. జిల్లా ఎన్నికల ఇంచార్జి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ బరిలో ఉన్న అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం నిర్వహించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని, నియోజకవర్గ ఇంచార్జి తెల్లం వెంకట్రావ్, అశ్వారావుపేట నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపునకు మార్గం సుగమమైంది.

75
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles