ఖమ్మం జిల్లాలో ఆరు కౌంటింగ్ కేంద్రాలు..

Tue,June 4, 2019 01:20 AM

మామిళ్లగూడెం: జిల్లావ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసిన 881 మంది అభ్యర్థులు, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసిన 105 మంది అభ్యర్థులు నేటి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచుస్తున్నారు. ఈ ఎన్నికల్లో 6,58,121 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అయితే జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకే దాదాపు ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫలితాలను ఎప్పటికప్పుడు వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రజలకు ప్రసారం చేయనున్నారు.

నేడు కౌంటింగ్..
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో నేడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు జరిగిన 289 ఎంపీటీసీ స్థానాలలో 6 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 283 ఎంపీటీసీ స్థానాలకు, 20 జడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్‌ను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తంగా 1615 పోలింగ్ కేంద్రాలలో కౌంటింగ్ చేబడతారు. వీటికిగాను 47 కౌంటింగ్ హాళ్లలో 578 టేబుల్స్‌తో 578 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 1156 మంది కౌంటింగ్ సహాయకులు విధులు నిర్వహించనున్నారు. వీరితో పాటు మరో 126 మంది సూపర్‌వైజర్లు 235 మంది అదనపు సిబ్బందిని అధికారులు అందుబాటులో ఉంచారు.

ఆరు కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు..
స్థానిక సంస్థల ఎన్నికలకు కౌంటింగ్ నిర్వహించేందుకు ఆరు ప్రాంతాలలో కౌంటింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మూడు దశల్లో జరిగిన ఎన్నికలు పూర్తయిన వెంటనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలించారు. బ్యాలెట్ బాక్సుల దగ్గర సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు పోలీస్ భద్రతా బలగాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిఘాను చేపడుతున్నాయి. కౌంటింగ్ ప్రక్రియను వెబ్‌కాస్ట్ చేయనున్నారు. ఫలితాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు, కౌంటింగ్ పారదర్శకంగా ఉండేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles