నకిలీ విత్తనాల గుట్టురట్టు..!

Tue,June 4, 2019 01:20 AM

కొత్తగూడెం క్రైం, జూన్ 3: నకిలీ విత్తనాలు రవాణా చేస్తూ.. అన్నదాతలను నట్టేట ముంచుతున్నారు అక్రమార్కులు.. ఆరుగాలం చమటోర్చి శ్రమించి.. పని చేసే రైతులు నకిలీ విత్తనాల ముఠా ఉచ్చులో చిక్కుకుని.. ఎందరో రైతుల జీవితాలు చిధ్రమవుతున్నాయి.. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపింది.. రైతుల కష్టాన్ని కాష్టంగా మారుస్తున్న నకిలీ విత్తనాల ముఠాపై ప్రత్యేక దృష్టి సారించింది.. దీంతో వరుసగా జిల్లాలో పోలీస్, వ్యవసాయశాఖ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులు చేసిన దాడుల్లో రూ.33లక్షల విలువ చేసే 3వేల నకిలీ విత్తనాల ప్యాకెట్లను స్వాధీనపరుచుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. గత నెల 24వ తేదీన ఒక రైతు నకిలీ పత్తి విత్తనాలపై చేసిన ఫిర్యాదు మేరకు టేకులపల్లి పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులతో కలిసి సులానగర్‌కు చెందిన ననబాల భాస్కర్ అనే వ్యక్తి ఇంటిపై దాడులు నిర్వహించి 5 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేశారు.

అనంతరం ఇదే తరహాలో అందిన మరో ఇద్దరు రైతుల ఫిర్యాదు మేరకు కేసును పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో జిల్లాలోని పలు చోట్ల పోలీసు అధికారులు, వ్యవసాయ శాఖ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో టేకులపల్లి మండలం సులానగర్‌లో నిహారిక అగ్రో ఏజెన్సీ నిర్వహిస్తున్న సంగు సురేష్, గంగాపురంలో సాయిబాలాజీ ఎంటర్‌ప్రైజెస్ నిర్వహిస్తున్న ఏలూరి రవి, లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ రామవరానికి చెందిన వినోదరావు సీతారామయ్య, హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ అనూనియ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న వ్యాపారి మన్నెం లక్ష్మీనారాయణ, చెర్ల మండలానికి చెందిన విద్యాసాగర్, బూర్గంపాడు మండలానికి చెందిన చింత వెంకట నాగిరెడ్డి, బూర్గంపాడు మండలం లక్ష్మీపూరానికి చెందిన బాదం నాగిరెడ్డి, దుమ్ముగూడేనికి చెందిన వంకచెర్ల లీలాప్రసాద్‌లను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన మన్నెం లక్ష్మీనారాయణతో కలిసి కారుకొండకు చెందిన సీతారామయ్యా ఈ దందాకు తెరలేపినట్లు ఎస్పీ తెలిపారు. వీరద్దిరినీ ఈ కేసులో ప్రధాన నిందితులుగా పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు.

పోలీస్ట్, వ్యవసాయ అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో కమలానగర్, మన్సూరాబాద్, ఎల్బీనగర్‌లో ఉన్న లక్ష్మీనారాయణ గోదాములపై దాడులు జరిపి వివిధ రకాల కంపెనీలకు చెందిన కాలం చెల్లిన పత్తి విత్తనాల ప్యాకెట్లు, నకిలీ విత్తనాల తయారీకి వినియోగించే రసాయనాలు, సామగ్రి, తపస్యా అగ్రిటెక్, కవర్ ప్యాకింగ్ మెషిన్, కాలీ పత్తివిత్తనాల ప్యాకెట్లను స్వాధీనపరుచుకున్నట్లు ఎస్పీ దృవీకరించారు. దాడుల్లో మోత్తం రూ.33లక్ష విలు చేసే 3వేల నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు స్వాధీనపరుచుకుని, నిందితులపై అండర్ సెక్షన్ 420, 120(బీ) ఐపీసీ సెక్షన్ 19(ఏ) ఆఫ్ సీడ్స్ యాక్ట్, 1966 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఇల్లెందు డీఎస్పీ ప్రకాశరావు, టేకులపల్లి సీఐ నాగరాజు, ఎస్సై ప్రవీణ్ కుమార్, చర్ల ఎస్సై రాజువర్మ, దుమ్ముగూడెం ఎస్సై బాలకృష్ణ, పోలీస్ పీఆర్‌వో దాములూరి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles