తెలంగాణకు ఉజ్వల భవిత

Mon,June 3, 2019 01:58 AM

-బాలింతలకు భరోసా కేసీఆర్ కిట్
-భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు
-మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ
-అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధి
-రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి తలసాని
(ఖమ్మం, నమస్తే తెలంగాణ):తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి తలసాని అనంతరం వివిధ పోలీస్ దళాలల నుంచి కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, సీపీ తఫ్సీర్ ఇక్బాల్‌లతో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరలకు నివాళులర్పిస్తున్నామని మంత్రి అన్నారు. గతం సృష్టించిన సమస్యల వలయంలో నుంచి బయటపడటమే కాకుండా నిరంతర ప్రగతిశీలా రాష్ట్రంగా తెలంగాణ.. యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. సీఎం కేసీఆర్ రూపొందించిన అనేక పథకాలు దేశం దృష్టిని ఆకర్షింయాని గుర్తుచేశారు. ఇది దశాబ్ద కాలంగా చేసిన పోరాటానికి దక్కిన సార్థకతగా ఆయన అభివర్ణించారు.

రైతుబంధు పేదల ఆత్మబంధు..
రైతు రుణమాఫీ, సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలు అందించడం, వ్యవసాయ రంగానికి 24 గంటల నిరంతర విద్యుత్ అందించడంతో పాటు పంట పెట్టుబడి మద్దతు కింద తొలకరికి ముందే ఏడాదికి ఎకరానికి రూ. 8 వేల చొప్పున పంట పెట్టుబడిని ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామని వివరించారు. జిల్లాలో రైతుబంధు పథకం కింద 2,67,202 మంది రైతులకు రూ.257.75 కోట్లు పెట్టుబడి సహాయాన్ని ఖరీఫ్‌లో అందించామన్నారు.

భూరికార్డుల నవీకరణ..
భూరికార్డుల ప్రక్షాళన అనేది సీఎం కేసీఆర్ సాహాసోపేత నిర్ణయమని మంత్రి పేర్కొన్నారు. దీని వలన జిల్లాలో 9 లక్షల 57 వేల ఎకరాల భూముల రికార్డులు ఆధునికీకరించబడ్డాయన్నారు. రెండు విడతల్లో మొత్తంగా జిల్లాలో 2,71,574 పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించినట్లు వివరించారు.

566 కుటుంబాలకు రైతు బీమా పరిహారం
రైతు కుటుంబాలలో వెలుగులు నింపేందుకు రైతులకు రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. రైతు ఏ కారణంతో మరణించినా బీమా వర్తిస్తుందని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 566 మంది రైతు కుటుంబాలకు బీమా పరిహారం అందినట్లు వివరించారు.

రైతు సంఘటితానికే సమన్వయ సమితులు..
రైతులను ఆర్థికంగా సంఘటిత పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో సంచలన నిర్ణయమే రైతు సమన్వయ సమితులని మంత్రి అభివర్ణించారు. రాష్ట్రంలో రైతులకు పంటసాగు నుంచి మొదలుకుని పంట దిగుబడి వరకు మద్దతు ధర కల్పించేంత వరకు రైతు సమన్వయ సమితులు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు.

బడుగులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు..
బడుగు, బలహీన వర్గాలు సౌకర్యవంతంగా ఆత్మగౌరవంతో జీవించాలనే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ పథకంలో భాగంగా డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించిందన్నారు. ఈ పథకంలో రాష్ట్రంలోనే మన జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లాకు మంజూరైన 14,560 గృహాలకు గాను ఇప్పటికే 6,397 గృహాల పనులు చేపట్టి 2,464 గృహాలను పూర్తి చేసుకున్నామని, 750 గృహాలను లబ్ధిదారులకు అందించామన్నారు.

మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు..
పాలేరు, వైరా సెగ్మెంట్‌ల ద్వారా రూ.1308 కోట్లతో చేపట్టిన పనుల్లో భాగంగా పాలేరు సెగ్మెంట్లో 370 అవాసాలకు, వైరా సెగ్మెంట్‌లో 462 ఆవాసాలకు బల్క్ సైప్లెయ్, 444 గ్రామాలకు రోజువారీ నీటిని అందిస్తున్నామన్నారు.

మిషన్ కాకతీయతో చెరువుల్లో జలకళ..
మిషన్ కాకతీయలో జిల్లాలో మొదటి మూడు విడతల కింద రూ.309.52 కోట్లతో 1882 చెరువులను పునరుద్ధరించినట్లు వివరించారు. నాలుగో విడతలో రూ.29.27 కోట్లతో 117 చెరువుల పనులను చేపట్టామన్నారు. జిల్లాలోని ఎన్‌ఎస్‌పీ కాలువల పునరుద్ధరణ, ఆదునీకరణకు గాను ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయం రూ.572.22 కోట్లతో పనులు చేపట్టామన్నారు. జిల్లాలో ఎన్‌ఎస్పీ ఆయకట్టు కింద 2 లక్షల 54 వేల ఎకరాలు సాగవుతున్నాయన్నారు.

రహదారులకు మహర్దశ..
జిల్లాలో రూ.43 కోట్లతో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రోడ్డు విస్తరణ చేపట్టామన్నారు. రెండు వరుసల రహదారులను నాలుగు వరుసల రహదారులుగా విస్తరించేందుకు రూ.165 కోట్లు ఖర్చు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రహదారుల అభివృద్ధి కోసం రూ.213 కోట్లతో 58 పనులు చేపట్టామని, రూ.120 కోట్లతో 17 వంతెనలు, చెక్ డ్యామ్‌లు నిర్మించామని మంత్రి వివరించారు. రూ.77 కోట్లతో ధంసలాపురం వంతెన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. సీఆర్‌ఎఫ్, ఎస్‌సీఎస్‌డీఎఫ్, ఎస్‌టీఎస్‌డీఎఫ్‌కు సంబంధించిన పనులకు భాగంగా జిల్లాలో రూ.438 కోట్లతో 127 పనులు చేపటడం జరిగిందన్నారు.

పేదలకు మెరుగైన వైద్యం
పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లాలో ఆధునిక పరిజ్ఞానంతో ఆధునాతనమైన వైద్య విధాన సేవలు అందుతున్నాయన్నారు. పుట్టిన బిడ్డ ఆరోగ్య సంరక్షణకు 8,863 కేసీఆర్ కిట్లను ఇప్పటికే అందించామని, దీని ద్వారా ప్రభుత్వ వైద్యశాలల్లో గణనీయంగా ప్రసవాల సంఖ్య పెరిగిందని అన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 150 పడకలతో ప్రారంభించిన మాతా శిశు సంరక్షణ కేంద్రం ద్వారా మాతా శిశుసేవలు, పది పడకలతో ఐసీయూ, 12 పడకలతో డయాలసిస్ సెంటర్ ద్వారా రోగులకు సేవలందిస్తున్నామన్నారు. అదే విధంగా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పాలియోటివ్ కేర్ సేవలను కూడా అందిస్తున్నామన్నారు.

కేజీ టూ పీజీ విద్యా విధానం..
స్వరాష్ట్రం సిద్ధించిన అనంతరం విద్యారంగంలో సమూలమార్పులు చేపట్టాం. ఆంగ్ల మాధ్యమంలో కేజీ టూ పీజీ విద్యావిధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 2019 మార్చిలో ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో 92.43 శాతం ఫలితాలు వచ్చాయన్నారు.

24 గంటల నిరంతర విద్యుత్..
24 గంటల విద్యుత్ అనేది తెలంగాణ చర్రితలోనే గొప్ప విజయమని అన్నారు. లో వోల్టేజీ నివారణకు 2018-19 సంవత్సరంలో రూ.29 కోట్లతో 13 33/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్మిస్తున్నామన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించేందుకు రూ.17.58 కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి రూ.125కే విద్యుత్ కనెక్షన ఇస్తున్నట్లు చెప్పారు. 1500 కుటుంబాలకు ఈ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయన్నారు.

టీఎస్ ఐపాస్‌తో సులువైన పారిశ్రామిక విధానం..
ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఐపాస్ ద్వారా పారిశ్రామిక రంగంలో నూతన అధ్యాయానికి తెరలేపిందని మంత్రి గుర్తుచేశారు. జిల్లాలో 2018-19 సంవత్సరంలో రూ.137 కోట్లతో 71 నూతన పరిశ్రమలు స్థాపించినట్లు చెప్పారు.

గొల్ల, కురమల జీవితాల్లో వెలుగులు..
కుల వృత్తులను ప్రోత్సహించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం కింద జిల్లాలో 332 గొర్రెల పెంపకం సహకార సంఘాలను ఏర్పాటు చేసి 34,258 మంది సభ్యులను నమోదు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 15,357 మంది లబ్ధిదారులకు 75 శాతం రాయితీపై రూ.143.97 కోట్లతో గొర్రెల యూనిట్లను అందించామన్నారు.

మహిళల ఆర్థిక పరిపుష్టికి చర్యలు..
మహిళ ఆర్థిక పరిపుష్టికి జిల్లాలో 3,895 స్వయం సహాయక మహిళా సంఘాలకు 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.1.8 కోట్ల స్త్రీనిధి రుణాలను అందించినట్లు మంత్రి వివరించారు. జీవనోపాదులను మెరుగుపరిచేందుకు 77870 గ్రూపులకు రూ.377.01 కోట్ల బ్యాంకు రుణాలు మంజూరు చేశామన్నారు. ఉపాధి హామీ పథకం కింద రూ.120.47 కోట్లతో 53.42 లక్షల పనిదినాలు కల్పించామన్నారు. రూ.35.22 కోట్లతో 25.16 లక్షల పనిదినాలను కూలీలకు కల్పించడం జరిగిందన్నారు.

సంక్షేమ రంగానికి పెద్దపీట..
సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ ఆర్థిక రుణ సహాయంతోపాటు వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, ఉపకార వేతనాలు, కులాంతర వివాహ ప్రోత్సాహకాలను అందిస్తున్నామని మంత్రి వివరించారు. భూమిలేని నిరుపేద దళితులకు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు భూమి కొనుగోలు పథకం కింద రూ.1469.30 లక్షలతో 231.16 ఎకరాల సాగుభూమిని పంపిణీ చేశామన్నారు. ఆసరా పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు పెంచినట్లు చెప్పారు. స్వయం ఉపాధి పథకం కింద 2017-18లో 1394 మంది లబ్ధిదారులకు రూ.20.74 కోట్లు మంజూరు చేశామన్నారు.

పేదలకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి..
పేదింటి ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఆలోచనతో సీఎం కేసీఆర్ వారి ఇళ్లల్లో పెద్ద దిక్కుగా మారి షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకం కింద వివాహ ఖర్చుకు రూ.75,116 సరిపోవడం లేదని గ్రహించిన ముఖ్యమంత్రి ఆ మొత్తాన్ని రూ.1,00,116కు పెంచినట్లు గుర్తుచేశారను. దీంతో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ఇప్పటి వరకు షాదీముబారక్, కల్యాణలక్ష్మీ పథకాల కింద జిల్లాలో ఇప్పటి వరకు 11,944 మంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ బీసీ లబ్ధిదారులకు రూ.84 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.

రైతు ఉత్పత్తుల విక్రయాలకు మార్కెటింగ్..
రైతులు పండించిన పంటల విక్రయానికి అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించి పంటకు మద్దతు ధర కల్పించడానికి గాను 8 వ్యవసాయ మార్కెట్ కమిటీలను నిర్వహిస్తున్నామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు రూ.36 కోట్లతో 60 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 12 గోదాములను నిర్మించడం జరిగిందన్నారు.

నూతన పంచాయతీరాజ్ చట్టం..
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని, పంచాయతీ పాలకవర్గాలను క్రియాశీలకంగా మార్చేందుకు, అంతేకాకుండా జవాబుదారీగా ఉండేందుకు చూసేందుకు చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు. నూతన చట్టం ప్రకారం ప్రతినెలా గ్రామసభ నిర్వహించి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.

ఈ పాస్ ద్వారా రేషన్ బియ్యం..
రేషన్ పంపిణీ విధానంలో నూతన ఒరవడి సృష్టించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ప్రదేశం నుంచైనా ఏ రేషన్ షాపు నుంచైనా నిత్యావసర వస్తువులు పొందే వెసులుబాటును పోర్టబులిటీ ద్వారా ప్రవేశపెట్టిందని మంత్రి శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు.

కార్మికుల సంక్షేమానికి భరోసా..
భవన, ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి కార్మికుల సంక్షేమానికి జిల్లాలో 1,35,810 మంది భవన నిర్మాణ కార్మికులకు సభ్యత్వం ఇచ్చిందన్నారు. వారి సంక్షేమం కోసం వివిధ పథకాల కింద 1,002 మంది కార్మికులకు రూ.9.97 కోట్లతో లబ్ధి చేకూర్చినట్లు వివరించారు.

జిల్లా పరిషత్..
జిల్లా పరిషత్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో జనరల్, ఎస్‌ఎఫ్‌సీ, ఎన్‌ఎస్‌సీ, పీఎస్‌పీ కింద 1 కోటి 43 లక్షల 84 వేల వ్యయంతో వివిధ పనులు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లా పరిషత్ సాధారణ నిధులు రూ.73.32 లక్షలతో 35 పనులు చేపటడం జరిగిందన్నారు.

నగరాభివృద్ధికి తోడ్పాటు..
ఖమ్మం నగరాభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని మంత్రి గుర్తుచేశారు. 2017-18 సంవత్సరంలో ఖమ్మం నగరంలో దాదాపు రూ.17.65 కోట్లతో వివిధ అభివృద్ధి పనుల పూర్తి చేయడం జరిగిందన్నారు. మరో రూ.101.44 కోట్ల పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయన్నారు. రూ.4 కోట్లతో లకారం సుందరీకరణ పనులు చేపట్టినట్లు చెప్పారు. గోళ్లపాడు ఛానల్ అభివృద్ధికి రూ.56 కోట్లతో పనులు చేపట్టగా పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. రూ.14 కోట్లతో నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణం, రూ.4 కోట్లతో ఆధునిక వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ పనులు చేపడుతున్నామన్నారు. నగరంలోని రోడ్లను మోడల్ రోడ్ల అభివృద్ధికి గాను రూ.24.53 కోట్లు, మంచినీటి సరఫరా అభివృద్ధికి గాను రూ.229 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రూ.40 లక్షలతో నగరంలోని గాంధీపార్కులో లైబ్రరీని ఆధునికీకరించామన్నారు. ఆధునాతన వసతులతో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ రకంగా ఈ ఐదేండ్లలో అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా ఉంచడం జరుగుతుందన్నారు. జిల్లాలో సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథకంలో ముందుకు నడిపేందుకు నిరంతరం కృషి చేస్తున్న కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న సీపీ తఫ్సీర్ ఇక్బాల్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, బ్యాంకర్లు, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజలకు తెలియజేసి చైతన్య పరుస్తూ మీడియా ప్రతినిధులందరికీ మంత్రి తలసాని కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఖమ్మం, వైరా, సత్తుపల్లి శాసన సభ్యులు పువ్వాడ అజయ్‌కుమార్, లావుడ్యా రాములునాయక్, సండ్ర వెంకటవీరయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, పోలీసు కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్, జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి, అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడింబా, ఆదర్శ్ సురభి, జడ్పీ సీఈఓ ప్రియాంక, కేఎంసీ కమిషనర్ శ్రీనివాసరావు, డీఆర్‌ఓ శిరీష, కలెక్టరేట్ ఏఓ మదన్‌గోపాల్, స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ పోరాటయోధులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా ప్రజలు, తదితరులు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

80
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles