నన్ను గుర్తించండి....


Mon,May 27, 2019 02:07 AM

-నా అలనాపాలన పట్టించుకోవడం లేదు
-అసాంఘిక కార్యకలాపాలకు అడ్డానవుతున్నా..
-పూర్వపు స్థితిని తీసుకురండి
-రైల్వేశాఖకు ఇల్లెందు రైల్వేస్టేషన్ వేడుకోలు..
ఇల్లెందు.. అదేనండి ఒకప్పటి బొగ్గుట్ట..! ఈ పేరు వినగానే అందరికి గుర్తుకొచ్చేది సింగరేణే. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా బొగ్గుగనులకు నిలయంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు ప్రజ్వరిల్లింది. ప్రస్తుతం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భాగమయ్యాను. నాడు బ్రిటీష్ పాలకులు ప్రజల సౌకర్యాలకనుగుణంగా సింగరేణి కాలరీస్ పేరుతో ఇల్లెందు రైల్వే స్టేషన్‌ను అంటే నన్ను ప్రారంభించాలని అనుకున్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు 1929లో రైల్వేస్టేషన్‌కు (నాకు) శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏర్పడక ముందు ఇల్లెందు ప్రాంతం వరంగల్ జిల్లాలో ఉండేది. ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటి రైల్వేస్టేషన్‌గా నన్ను గుర్తించారు. అప్పటి నుంచి ఇల్లెందు ప్రాంత ప్రజలకు అనేక విధాలుగా సేవలందించాను. వ్యాపార, వాణిజ్య రంగాలకు పెద్దపీట వేశాను. ఖరీదైనా నగరాల్లో దొరికే వస్తువులన్నీ ఇల్లెందు పట్టణ దరికి చేర్చాను. ఒక్కప్పుడు ఇల్లెందు డివిజన్‌గా పేరుగాంచిన ఏజెన్సీ ప్రాంతంలోని ఏడు మండలాల ప్రజలతో నాకు వీడదియరాని సంబంధం ఉంది. అందరికి ఉపయోగపడుతూ అనేక విధాలుగా సేవలందిస్తూ వచ్చాను. ఎందుకు ఇల్లెందులో ఏర్పాటు చేశారంటే ఇల్లెందులో అప్పుడు సింగరేణి కాలరీస్ ప్రధాన కార్యాలయం (హెడ్డాఫీస్) ఉండేది. అందుకే ఇల్లెందు పట్టణంలో రైల్వేస్టేషన్ (నన్ను) ఏర్పాటు చేసినట్లు నాడు బ్రిటీష్ అధికారులు ప్రకటించారు.


ఇల్లెందు నుంచి వివిధ ప్రాంతాలకు స్లీపర్‌క్లాస్, ఫస్ట్‌క్లాస్ బోగీలు నడిచేది. 80 సంవత్సరాల వరకు నన్ను అన్ని విధాలుగా ఉపయోగించుకున్నారు. ఆ తరువాత నా సేవలను తగ్గిస్తూ వచ్చారు. ఇతర ప్రాంతాల్లో నావలే రైల్వేస్టేషన్లు కొత్తగా పుట్టుకొచ్చాయి. కాలక్రమేణ ఇల్లెందు పట్టణం నుంచి అన్ని దూరమయ్యాయి. ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉన్న మైన్స్‌లన్నీ కుదించబడ్డాయి. పది నుంచి పదిహేనువేల మధ్య ఉన్న కార్మికులు వివిధ ప్రాంతాలకు తరలిపోయారు. కీలకంగా మారిన సింగరేణి కాలరీస్ ప్రధాన కార్యాలయం వేరే ప్రాంతానికి తరలిపోయింది. అక్కడి నుంచి నా సేవలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. 2005 వరకు నా సేవలు కొనసాగుతునే వచ్చాయి. ఇల్లెందు నుంచి డోర్నకల్ వరకు ప్యాసింజర్ ఏర్పాటు చేశారు. రానురాను ఆ సౌకర్యం కూడా రద్దు చేశారు. రెండు బోగీలతో కూడిన రైలును ఇల్లెందు నుంచి కారేపల్లికి ప్రవేశపెట్టారు. 2006లో ఈ సర్వీసును కూడా పూర్తిగా రద్దు చేశారు. ఇక పూర్తిగా నా సేవలను పక్కన బెట్టారు.

-నా నుంచి ఎనలేని ఆదాయం
బొగ్గుగనులకు పుట్టినిైల్లెన ఇల్లెందుకు బ్రిటీష్ పాలకులు రైల్వే సౌకర్యం కల్పించారు. గతంలో మైన్స్ సంఖ్య ఎక్కువగా ఉండటంతో నా నుంచి బొగ్గు రవాణా ఎక్కువగా జరిగేది. రోజుకి ఇల్లెందు నుంచి పది రేకులు, ఆ తరువాత ఆరు రేకులు బొగ్గు రవాణా జరిగేది. ప్రస్తుతం అంతకాకపోయిన రోజుకు రెండురేకులు రవాణా జరుగుతున్నది. దీని మూలంగా రైల్వేకు సంవత్సరానికి సుమారు రూ. వందల కోట్ల ఆదాయం సమకూరుతుంది. కోట్ల రూపాయాల ఆదాయం పొందుతున్న రైల్వేశాఖ పట్టించుకోకుండా ఇల్లెందు రైల్వేస్టేషన్ (నన్ను) విస్మరిస్తున్నది. కనీసం ఒక ప్యాసింజర్ రైలు సర్వీసును కొనసాగించకపోవడం కేంద్ర ప్రభుత్వం వివక్షకు అద్దం పడుతున్నది.

-రైలు సర్వీసులతోనే అభివృద్ధి
ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే రైలు సర్వీసులతోనే జరుగుతుంది. వాణిజ్య, వ్యాపార రంగాల పరంగా అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుగా ఉండాలి. అందుకే ఇల్లెందు అభివృద్ధిని కాంక్షిస్తున్నాను. ఇక్కడి నుంచి రైలు సర్వీసులు కొనసాగితే అభివృద్ధి పరంగా ఇల్లెందు ముందు వరుసలో ఉంటుంది. వ్యాపారం, వాణిజ్యరంగాల పరంగా ముందడుగు వేస్తున్నది. వ్యాపారస్తులంతా ఇదే కోరుకుంటున్నారు. ఇక్కడి ప్రజలు కూడా నా సేవలు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.

-శిథిలావస్థకు చేరుతున్నా..
శిథిలావస్థకు చేరుకుంటున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. నా ఆలనా పాలన కరువైంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులున్న నా వద్ద సౌకర్యాలు కల్పించాను. ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. చుట్టూ తుమ్మ చెట్లు దట్టమైన అడవిని తలపిస్తున్నాయి. రైల్వే ట్రాకులపై తుమ్మచెట్లు అల్లుకుపోయాయి. స్టేషన్‌లోని తలుపులు, కిటికీలు చోరీకి గురవుతున్నాయి. ప్రయాణికులకు తాగునీరు సరఫరా ఒకప్పుడు మెండుగా ఉండేది. ఇప్పుడు అ న్ని కనుమరుగయ్యాయి. ఇకనైనా నాపై దృష్టి పెట్టిండి. మీకు సేవలిందేంచుకు సిద్ధంగా ఉన్నా.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles