గాలి దుమారం.....

Mon,May 27, 2019 02:06 AM

-కుప్పకూలిన పలు ఇళ్ళు
-నేలమట్టమైన విద్యుత్ స్తంభాలు
-విద్యుత్ సరఫరాకు అంతరాయం
అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ: అశ్వారావుపేటలో గాలివాన బీభత్సవం సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు గంటన్నర పాటు కురిసిన వర్షంలో వడగండ్లు సైతం పడ్డాయి. వర్షానికి మండలంలోని నారాయణపురం, గుమ్మడవల్లి, కొత్తూరు, నందిపాడు గ్రామాల్లో పలు ఇళ్లు ధ్వంసం కాగా మామిడి తోటల్లో చెట్లు కూడా కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నెలమట్టం కావటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నారాయణపురంలో కూతాటి నారాయణ, బి.శ్రీనివాసరావు, పడాల వెంకటేశ్వరరావు, దేవరశెట్టి సత్యవతిలతో పాటు సుమారు 35 ఇళ్ళు ధ్వంసమయ్యాయి. వీటిలో 7 ఇళ్ళు పూర్తిగా, మరో 28 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇంటి పైకప్పులు కూలిపోవటంతో ఇళ్ళల్లో వంట సామగ్రి చెల్లాచెదురయ్యాయి.

చిన్నంశెట్టి వెంకట నరసింహం పుగాకు బ్యారన్లపై రేకులు ఈదురు గాలులకు లేచిపోయాయి. వర్షంతో పాటు వడగండ్లు కూడా పడటంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అదేవిధంగా ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఇటీవల నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్ల కూలిపోయాయి. మామిడి కాయలు రాలిపోవటమే కాకుండా పలు గ్రామాల్లోని తోటల్లో చెట్లు కూడా నేలకూలాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు అకాల వర్షం ప్రజలను ఆందోళనకు గురి చేసింది. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ వీ.రాఘవరెడ్డి బాధిత గ్రామాల్లో పర్యటించారు. జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నష్టం అంచనాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు.

-అశ్వారావుపేట పట్టణంలో వడగండ్ల వాన
అశ్వారావుపేట టౌన్ పట్టణంలో ఆదివారం సాయంత్రం వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలుతతో కూడిన వర్షం కురవటంతో పాటు వడగండ్లు పడటంతో రైతులు కొంత ఆందోళన చెందారు. అయితే పగలంతా భానుడి భగభగలతో అట్టుడికిన మండలం ఒక్కసారిగా సాయంత్రం పూట వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని చల్లని వాతావరణం ఏర్పడటంతో ప్రజలు కొంత ఉపశమనం పొందారు. ఈదురు గాలితో కూడిన వర్షం పడటంతో విద్యుత్ సరఫరాకు కొంత ఆటంకం ఏర్పడింది.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles