నేడే సార్వత్రిక తీర్పు

Thu,May 23, 2019 12:41 AM

-సర్వం సిద్ధం చేసిన అధికారులు
-ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
-ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో రెండు లోక్‌సభ ఓట్ల లెక్కింపు
-నేడు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
-మధ్యాహ్నం వరకు వెలువడనున్న ఫలితాలు
-జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు
-ఊరేగింపులు నిషేధం.. మద్యం దుకాణాలు బంద్
-కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రాతా చర్యలు
-పాస్ ఉంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి
-ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్..

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కొద్ది గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు నగర సమీపంలోని విజయ ఇంజినీరింగ్ కళాశాలలో, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు మహబూబాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇరు జిల్లాల అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడండెల భద్రతను ఏర్పాటు చేశారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఖమ్మంలో జరుగుతుండగా, మహబూబాబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు మహబూబాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ పార్లమెంట్ పరిధిలోని ఇల్లెందు, పినపాక, భద్రాచలం, ములుగు, మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 6 నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులను ముసివేయనున్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల వ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. కౌంటింగ్ కేంద్రంలోకి వివిధ పార్టీల ఏజెంట్లకు అధికారులు ఇప్పటికే పాస్‌లు జారీ చేసి ఉన్నారు. పాస్ ఉంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఈవీఎంలను తీసుకువచ్చే సమయంలో రాజకీయపార్టీల ఏజెంట్లు, ఎన్నికల పరిశీలకులు, అధికారులు తప్పనిసరిగా ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు.

అభ్యర్థుల్లో ఉత్కంఠ..
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన 23 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో తెలంగాణ రాష్ట్ర సమితి తరుఫున నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ తరుఫున రేణుకాచౌదరి, బీజేపీ వాసుదేవరావులతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్రులు మరో 20 మంది ఉన్నారు. వీరందరి తరుఫున కౌంటింగ్‌లో పాల్గొనే ఏజెంట్లకు అధికారులు ఇప్పటికే పాసులు జారీ చేసివున్నారు. పోలింగ్ జరిగి 43 రోజుల అవుతుండటంతో అభ్యర్థులు వివిధ ప్రాంతాలకు వెళ్లారు. కౌంటింగ్ సమయం దగ్గరవడంతో కొద్దిరోజుల క్రితమే పోటీలో ఉన్న అభ్యర్థులు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. మరి కొద్ది గంటల్లో ఫలితాలు వెల్లడి కానుండటంతో వారిలో ఉత్కంఠ నెలకొంది. విజయం ఎవరిని వరించనుందో కొన్ని గంటల్లో తేలిపోతుంది.

మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడి..
ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ ఫలితాలు మధ్యాహ్నం తరువాత వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగానే తొలుత పోస్టల్ బ్యాలెట్‌లు, సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తరువాత ఈవీఎంలను లెక్కిస్తారు. ఈవీఎంల లెక్కింపు తరువాత నియోజకవర్గంలోని 5 పోలింగ్ కేంద్రాలను లాటరీ ద్వారా ఎంపిక చేసి, వీవీ ప్యాట్‌లను లెక్కిస్తారు. ఈవీఎం, వీవీప్యాట్‌ల ఓట్ల సంఖ్య సరిపోల్చిన తరువాత ఫలితాలు తెలుపుతారు. అంతకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించి సువిధ పోర్టల్‌లో ఫలితాన్ని నమోదు చేశాకే రిటర్నింగ్ అధికారులు స్థానికంగా ఫలితాన్ని బహిర్గతపరుస్తారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 98 టేబుళ్లు, 131 రౌండ్లలో లెక్కింపు పూర్తి అవుతుంది.

నియోజకవర్గ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉదయం 6 నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఊరేగింపులను నిషేధించడంతోపాటు మద్యం దుకాణాలను బంద్ చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు జిల్లాకు కేటాయించిన పరిశీలకులు ఆధ్వర్యంలో కౌంటింగ్ నిర్వహిస్తారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం ఓటర్లు 15,13,094 మంది ఉండగా, 11,37,231 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 5,59,387 మంది, స్త్రీలు 5,77,812 మంది, ఇతరులు 32 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి మధ్యనే పోటీ నెలకొంది. వివిధ ఎగ్జిట్ పోల్స్, రాజకీయ పరిశీలకుల అంచనా ప్రకారం ఖమ్మం పార్లమెంట్ టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని తెలుస్తున్నది.

మొబైల్ ఫోన్లు నిషేధం..
కౌంటింగ్ కేంద్రంలోకి రిటర్నింగ్ అధికారి, అబ్జర్వర్లు తప్ప ఇతరులు ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్స్ అనుమతించబడవు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రారంభిస్తారు. 830 పోస్టల్ బ్యాలెట్‌లు, 431 సర్వీసు ఓటర్ల పోస్టల్ బ్యాలెట్లు అందాయి. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలోని 1798 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల ఓట్ల లెక్కింపునకు నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అత్యధికంగా ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్‌లో 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుండగా, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో 20, మధిర అసెంబ్లీ సెగ్మెంట్‌లో 19, వైరా అసెంబ్లీ సెగ్మెంట్‌లో 17, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 20, కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్‌లో 18, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 127 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్ 128 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 128 మంది మైక్రో అబ్జర్వర్లతో కలిపి 383 మందిని కేటాయించడంతో పాటు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, తహసీల్లాదర్లను కూడా కేటాయించారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో 75.22 శాతం ఓటింగ్ జరిగింది.

భద్రాద్రి జిల్లా పరిధిలో రెండు పార్లమెంట్ సెగ్మెంట్లు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్న ఐదు నియోజకవర్గాలలో రెండు పార్లమెంటు సెగ్మెంట్లు ఉన్నాయి. అందులో కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఉండగా, ఇల్లెందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలు మహబూబాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. కాగా ఖమ్మం పార్లమెంటు స్ధానానికి ప్రధాన, ఇతర పార్టీల నుండి 23 మంది అభ్యర్థులు బరిలో నిలువగా, మహబూబాబాద్ పార్లమెంటు స్ధానానికి ప్రధాన, ఇతర రాజకీయ పార్టీల నుండి 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ స్థ్ధానాల పరిధిలో ఏప్రిల్ 11న తొలివిడతలోనే ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11న జిల్లా ప్రజలు ఓట్లు వేసి అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.

రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడి..
ఖమ్మం పార్లమెంట్ ఓట్ల లెక్కింపు ఫలితాలను రౌండ్ల వారీగా తెలుపనున్నారు. అంతిమ ఫలితం మాత్రం ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని 5 వీవీ ప్యాట్‌ల స్లిప్పులు లెక్కింపు అనంతరం మాత్రమే ప్రకటిస్తారు. 400 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట భద్రత చర్యలను చేపట్టారు. కౌంటింగ్ కేంద్రం ప్రాంగణాన్ని ఆరు సెక్టార్లుగా విభజించి మూడంచెల భద్రత కల్పించారు. ఈ నెల 28 వరకు ఎటువంటి ఊరేగింపులకు అనుమతి లేదు. కౌంటింగ్ కేంద్ర పరిసరాల్లో ఎటువంటి షామియానాలు, మైకులు, వాహనాలను అనుమతించబడవు. కౌంటింగ్ కేంద్రంలోనికి ప్రవేశించేవారు తప్పనిసరిగా గుర్తింపు కార్డు కలిగి ఉండాలని, లేకపోతే అనుమతించబడవు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అమలులో ఉన్న నిషేధాజ్ఞలను తప్పనిసరిగా పాటించి ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles