కౌంటింగ్‌లో ఏజెంట్ల పాత్ర కీలకం..

Thu,May 23, 2019 12:39 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఎన్నికల్లో కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర కీలకమైనదని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, ఆపార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఖమ్మంలోని టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన పోలింగ్ ఏజెంట్లు, ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు రాష్ట్రం మొత్తం ఖమ్మం పార్లమెంట్ వైపే చూస్తుందన్నారు. అధికారులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అశీర్వదించి టికెట్ ఇచ్చారని, ప్రజలు ఓట్లు వేసి ఆశీర్వదించారన్నారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న టీఆర్‌ఎస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లకు నేడు స్థానిక తెలంగాణ భవన్‌లో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఏజెంట్లు ఉదయం 5.30 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని, అలాగే కౌంటింగ్ జరిగేటప్పుడు అప్రమత్తతో ఉండి కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించాలని, క్రమశిక్షణతో ఓపికతో అధికారులకు సహకరించాలని, కౌంటింగ్ త్వరితగతిన పూర్తి చేసుకునే దానిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతు సమన్వయ సమితి ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వరరావు, మధిర నియోజకవర్గ ఇన్‌చార్జీ లింగాల కమల్‌రాజు, బొమ్మెర రామ్మూర్తి, ఆర్‌జేసీ కృష్ణ, ఖమ్మం నగర అధ్యక్షుడు కమర్తపు మురళీ, మద్దినేని బేబీ స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles