నిబంధనలకు నీళ్లు..!

Wed,May 22, 2019 02:18 AM

-పేరుకు ఒక వ్యాపారం.. సీన్‌లో మరొకటి
-ప్రభుత్వ స్థలం..అద్దె ఇతరులకు..
-రూ.లక్షల్లో దండుకుంటున్న వైనం
-అనుమతులు లేకుండానే సొంత నిర్మాణాలు
-నోటీసులు ఇచ్చినా ఫలితం సున్నా
-ఇండస్ట్రియల్ పార్క్‌లో నిబంధనలు బేఖాతర్
-పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు

భద్రాచలం, నమస్తే తెలంగాణ : భద్రాచలం పట్టణంలో చర్ల రోడ్డులో ఇండస్ట్రియల్ పార్కు ఉంది. గత 25 ఏళ్లక్రితం ఈ ఇండస్ట్రియల్ పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఆనాడు చిరు వ్యాపారులను పారిశ్రామిక వేత్తలుగా మార్చాలనే సదాశయంతో ఈ పార్కు ఏర్పాటు చేసింది. సుమారు 17 ఎకరాల స్థలాన్ని వారికి కేటాయించింది. ఇందు కోసం 41 ప్లాట్లుగా విభజించి కేటాయింపులు చేసింది. ఇందులో సేల్ లీడ్ ప్లాట్లు 5 వరకు ఉండగా, మిగిలినవి సేల్ అగ్రిమెంటు ప్లాట్లుగా ఉన్నాయి. అయితే స్థలాలు దక్కించుకున్న వ్యాపారులు అనుమతులు పొందే సమయంలో, రిజిస్టర్లో నమోదు చేసిన వ్యాపారాలు ప్రస్తుతం ఇక్కడ ఏమీ సాగడం లేదు. ఒకరిద్దరు వ్యాపారాలు మినహాయించి మిగిలినవన్నీ ఇతర వ్యాపారాలే కొనసాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండానే కొందరి ప్లాట్లలో ఏం చక్కా పక్కా భవన నిర్మాణాలు వెలిశాయి. అంతేకాదు వాటిని ఇతరులకు అద్దెలకివ్వడం గమనార్హం. ఇండస్ట్రియల్ పార్కులో కొన్ని భవనాలను ఏకంగా తునికాకు గోడౌన్లుగా మార్చేశారు.

పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి తనకు కేటాయించిన స్థలంలో గోడౌన్లను కట్టి వాటిని తునికాకు గోడౌన్లగా మార్చేశాడు. తునికాకు గుత్తేదారులకు అద్దెకిచ్చేయడం జరిగింది. మరో వ్యాపారి కూడా ఇదే చేశాడు. మరికొన్ని షెడ్లను వివిధ వస్తువుల తయారీ దారులకు కేటాయించేశారు. ఆయా భవనాలలో కూలర్లు, ఫ్రిజ్‌లు తయారు చేస్తుండటం గమనార్హం. పట్టణంలోని కొందరు వ్యాపారస్తులకు చెందిన తమ వస్తువులను భద్రపరుచుకునేందుకు ఇండస్ట్రియల్ పార్క్ బిల్డింగ్‌ను తీసుకొని అద్దెలు చెల్లిస్తుండటం గమనార్హం. స్టోర్ రూములుగా వీటిని వాడుకుంటున్నారు. ఇంజనీరింగు పార్కుల పేరుతో ఉన్న కొన్ని షెడ్లలో పాత ఇనుప సామాన్లు దుకాణాలు వెలియడం జరిగింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ వ్యక్తికి కేటాయించిన స్థలంలో భవన నిర్మాణం వెలసి అక్కడ ప్రమాదకరమైన టపాసులు దాచి పెట్టడం గమనార్హం. కాగా కొందరు తమ తమ ప్లాట్లలో బిల్డింగులను ఏర్పాటు చేసి రూములుగా వాటిని తయారు చేసి భారీ ఎత్తున వ్యాపారాలకు అద్దెకిస్తున్నారు. ఒక్కొ రూముకు రూ.3 నుంచి రూ.4 వేల వరకు నెల నెల అద్దెలు తీసుకుంటున్నారు. భారీ గోడౌన్ల నుంచి లక్షల్లోనే సొమ్ములు వీరికి అద్దె రూపంలో అందుతున్నాయి. కొన్ని బిల్డింగులను తమ ప్రైవేటు కార్యకలాపాలకు వినియోగిస్తుండటం గమనార్హం. ఇండస్ట్రియల్ పార్కుకు కేటాయించిన స్థలంలో ఎటువంటి కొత్త భవన నిర్మాణాలు చేపట్టినా సంబంధిత అధికారుల అనుమతులు పొందాల్సి ఉంది. కాని కొందరు వ్యాపారులు ఎటువంటి అనుమతులు లేకుండానే భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఇటీవల ఇండస్ట్రియల్ పార్కు రోడ్డులో చివర వైన్ షాపునకు వెళ్లే ప్రాంతంలో ఎటువంటి అనుమతులు లేకుండానే ఓ వ్యాపారి భవన నిర్మాణం చేపట్టేశాడు. అదే ప్రాంతంలో గతంలో మరో రెండు కొత్త భవనాలు నిర్మాణం జరిగాయి. ఈ విషయం తెలిసి సంబంధిత టీఎస్‌ఐఐసీ జిల్లా అధికారులు వీరికి నోటీసులు అందజేసినట్లు తెలిసింది. ఈ నోటీసులను ఏ మాత్రం పట్టించుకోకుండా సంబంధిత వ్యాపారులు ఇక్కడ భవన నిర్మాణాలు చేపట్టేశారు. నిబంధనలు ఉల్లంఘించినా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలకు ఉపక్రమించడం లేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బినామీలే కొనసాగిస్తున్న వ్యాపారాలు
ఇండస్ట్రియల్ పార్కులో బినామీలదే హవా కొనసాగుతోంది. టీఎస్‌ఐఐసీ(తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) స్టేట్ లెవల్ కమిటీ ద్వార 41 ప్లాట్లు ఏర్పాటు చేసి వ్యాపారులకు అప్పగించగా వీటిలో దాదాపు బినామీలే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో భూములు దక్కించుకున్న వారి పేర్లు కనిపిస్తుండగా, క్షేత్రస్థాయిలో కొద్దిమంది తప్ప అధిక శాతం ప్లాట్లల్లో వేరే వ్యక్తుల ఆధ్వర్యంలో ఇతర వ్యాపారాలే కొనసాగుతున్నాయి. సంవత్సరానికి రూ.5 లక్షలకు పైగానే టీఎస్‌ఎస్‌ఐఐసీకి ట్యాక్సు రూపంలో ఇండస్ట్రియల్ పార్కు నుంచి నిధులు సమకూరుతున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఈ ట్యాక్సులు రూ.కోటికిపైగా ఆ శాఖ వద్ద ఉన్నట్లు వినికిడి. ఈ నిధులన్ని ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ ఆశాఖ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాంతంలో డ్రైనేజీలు, వీధిలైట్లు, రోడ్లు ఏర్పాటుకు నోచుకోకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండస్ట్రియల్ పార్కు నిర్వహణ వ్యవహారంపై టీఎస్‌ఐఐసీ జోనల్ మేనేజరు పవన్‌కుమార్‌ను వివరణ కోరగా అన్ని విషయాలు పరిశీలిస్తామని తెలిపారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles