ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు

Tue,May 21, 2019 12:47 AM

-21 మండలాల్లో సిబ్బందికి శిక్షణ
-కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఈవో
-ఈ నెల 27న ఓట్ల లెక్కింపు

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 21 మండలాల్లో కౌంటింగ్‌ సిబ్బందికి ట్రైనర్లు సోమవారం శిక్షణ ఇచ్చారు. డిప్యూటీ సీఈవో పురుషోత్తం పర్యవేక్షణలో శిక్షణ ఏర్పాటు చేశారు. ప్రతీ మండలానికి ఇద్దరు ట్రైనర్లు పాల్గొన్నారు. మండలంలో సూపర్‌వైజర్లు, రిటర్నింగ్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లతో పాటు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో చుంచుపల్లి మండల కౌంటింగ్‌ సిబ్బందికి, మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో లక్ష్మీదేవిపల్లి మండల కౌంటింగ్‌ సిబ్బందికి, సుజాతనగర్‌ మండలానికి ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. శిక్షణలో కౌంటింగ్‌ విధానం, ఏ ఫార్మాట్‌లో తీసుకోవాలనే విధానంపై ట్రైనర్లు డమ్మీ బ్యాలెట్‌ పేపర్లతో కౌంటింగ్‌ చేసి సిబ్బందికి చూపించారు. ఒక్క టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌తో పాటు ఇద్దరు కౌంటింగ్‌ సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక మండలంలో 24 మంది సూపర్‌వైజర్లు ఉంటే 48 మంది కౌంటింగ్‌ సిబ్బంది ఉండాలన్నారు. ఒక్కో మండలానికి కేటాయించిన సూపర్‌వైజర్లకు అధనంగా కౌంటింగ్‌ సిబ్బందిని నియమించారు. వారికి కౌంటింగ్‌ సిబ్బందితో పాటు సహాయకులు కూడా పాల్గొననున్నారు. వీరందరికీ కౌంటింగ్‌ చేసే విధానం, ఏయే రౌండ్‌లో ఎన్ని బ్యాలెట్‌ బాక్సులు ఓపెన్‌ చేయాలి, వాటిని ఏ విధంగా లెక్కించాలి, లెక్కించిన బ్యాలెట్‌ పత్రాల సంఖ్యను ఏ ఫార్మట్‌లో నమోదు చేయాలనేది ఎన్నికల సిబ్బందికి శిక్షణలో తెలిపారు.

పర్యవేక్షించిన డిప్యూటీ సీఈవో
జిల్లా డిప్యూటీ సీఈవో పురుషోత్తం ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో కౌంటింగ్‌ సిబ్బందికి ఇచ్చిన శిక్షణ కేంద్రాలను సందర్శించి సూచనలు చేశారు. కౌంటింగ్‌ చేసేటప్పుడు కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, సిబ్బంది ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై స్పష్టంగా వివరించారు. రాజకీయపార్టీలకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలోనే కౌంటింగ్‌ నిర్వహిస్తారని, అందువల్ల కౌంటింగ్‌లో పాల్గొనే ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచనలు చేశారు. 21మండలాల్లో 40మంది ట్రైనర్లు కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.

ఈ నెల 27న ఓట్ల లెక్కింపు
జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ నెల 27వ తేదీన చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు చేయనున్నందున ఆయా కౌంటింగ్‌ కేంద్రాల్లో టేబుల్స్‌, ట్రేలను, అవసరమైన సామగ్రిని ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీల ఓట్ల లెక్కింపునకు వేర్వేరు డబ్బాలను ఏర్పాటు చేసి కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సంబంధించిన పనులను ఆర్‌వోలు పర్యవేక్షిస్తున్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles