గిరిజన గూడేల్లో తునికాకు పండుగ..

Mon,May 20, 2019 04:10 AM

-ఆకుల సేకరణలో మన్నెంవాసులు బిజీ..బిజీ
-వేసవి పంటగా ఎంతో ఉపయుక్తం
-ఈ ఏడాది10 వేల 300 స్టాండర్డ్ బ్యాగుల లక్ష్యం
-ఏజెన్సీలో 130 తునికాకు కల్లాలు ఏర్పాటు
భద్రాచలం, నమస్తేతెలంగాణ: తునికాకు సేకరణతో మన్నెం బిడ్డలు బిజీ అయ్యారు. వేసవికాలం వచ్చిందంటే గిరిజనులకు తునికాకు సేకరణ ఎంతగానో ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఈ ఏడాది తునికాకు సేకరణ ప్రారంభమైంది. దీంతో గిరిజనులు ఆకు సేకరణపై దృష్టి నిలిపారు. వేకువజామునే గిరిజనులు కుటుంబ సభ్యులందరూ.. ఈ ఆకు సేకరణకు అడవివి వెళ్తారు. అనంతరం వాటిని ఇళ్లలోకి చేర్చి కట్టలుగా కడుతున్నారు. ప్రతీ ఆదివారం తమతమ పరిధిలో ఉన్న తునికాకు కల్లంకు వెళ్లి ఆకుల కట్టలను కల్లేదారుకు అందజేస్తున్నారు. వీటికి రావల్సిన సొమ్ముల వివరాలను కల్లేదారు వద్ద నమోదు చేయించుకుంటున్నారు. వృద్ధుల నుంచి, పిల్లలు వరకు ఈ తునికాకు సేకరణలో నిమగ్నమయ్యారు. తునికాకు కార్మికునికి తునికాకు సీజన్‌లో రూ.15వేలకు పైగా ముట్టే అవకాశం ఉంది. వేసవి పంటగా తునికాకు సేకరణ గిరిజనులకు ఆసరాగా నిలుస్తోంది. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో తునికాకు కార్మికులు అడవి జంతువులు, విష సర్పాల బారినపడి కూడా తమ ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటున్నారు.

ఈ ఏడాది10వేల 300 స్టాండర్డ్ బ్యాగుల లక్ష్యం..
భద్రాచలం డివిజన్ పరిధిలో ఈ ఏడాది మొత్తం 130 తునికాకు కల్లాలను ఏర్పాటు చేశారు. ఆర్లగుడెంలో 42, కొమ్మనాపల్లి 8, చర్ల 31, దేవరపల్లి 13, దుమ్ముగుడెం 36 కల్లాలను ఏర్పాటు చేశారు. ఆర్లగుడెం నుంచి 3వేల స్టాండర్ల బ్యాగులు, కొమ్మనాపల్లి 1200, చర్ల 1100, దేవరాపల్లి 3100, దుమ్ముగుడెం 1900 బ్యాగులు మొత్తం భద్రాచలం 10,300 స్టాండర్డ్ బ్యాగుల లక్ష్యాన్ని ఈ ఏడాది పెట్టుకున్నారు. అయితే వారంరోజుల నుంచి తునికాకు సేకరణ ప్రారంభం కాగా, ఈ నెల 18 నాటికి 7,429 స్టాండర్డ్ బ్యాగుల తునికాకును సేకరించారు. గత ఏడాది తునికాకు కట్టకు రూ.1.55 గుత్తేదారులు చెల్లించగా, ఈ ఏడాది కట్టకు రూ.1.80 చెల్లించేందుకు గుత్తేదారులు తునికాకు కార్మికులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. భద్రాచలం అటవీ రేంజి పరిధిలో ఆర్లగూడెం, కొమ్మనాపల్లి , చర్ల అటవీ రేంజి పరిధిలోని దేవరపల్లి, దుమ్ముగూడెం తదితర ఐదు యూనిట్ల పరిధిలో ఈ తునికాకు సేకరణ ముమ్మరంగా సాగుతోంది. స్థానిక అటవీశాఖ అధికారులు తునికాకు సేకరణను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా తునికాకు సేకరించి వాటిని బస్తాల్లో పేర్చి గోడౌన్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదుగురు గుత్తేదారులు ఈ ఏడాది ఈ తునికాకును సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా తునికాకు బోనసు కార్మికులకు 2014 నుంచి అందాల్సి ఉండటం గమనార్హం. అంతకు ముందు రెండేళ్లు కూడా ఇంకా కొంత మందికి బోనసు చెల్లించాల్సి ఉందని సమాచారం.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles