ట్రాఫిక్‌తో ఇక్కట్లు.. చీకటితో అగచాట్లు

Sun,May 19, 2019 12:44 AM

కొత్తగూడెం క్రైం: పారిశ్రామిక, సింగరేణి ప్రాంతమే కాకుండా జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా మారుతున్న పట్టణంలో పార్కింగ్ స్థలాలు కరువయ్యాయి. పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ సెంటర్, సూపర్ బజార్ ఏరియాల్లో పార్కింగ్ స్థలం లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం-విజయవాడ, కొత్తగూడెం - ఖమ్మం ప్రధాన రహదారులకు కేంద్రంగా ఉన్న బస్టాండ్‌సెంటర్, పోస్టాఫీస్ సెంటర్లలో నిత్యం వాహనాలు రద్దీగా ఉంటాయి. వేసవి వేడిలో సైతం వాహనాలను సుదూర ప్రాంతాల్లో పార్కింగ్ చేసి ఎండలో ఇబ్బందులు పడుతూనే ప్రజలు షాపింగ్ చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక సూపర్ బజార్ ఏరియాలో కార్లు రైల్వేస్టేషన్లో పార్క్ చేసి షాపింగ్‌లకు వెలళ్లే పరిస్థితి. ఇదిలా ఉండగా బస్టాండ్ సెంటర్‌లో నిత్యం బస్సులు, ఇతర వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో రాత్రైతే వాహనదారులతో పాటు, పాదచారులు సైతం అగచాట్లు పడక తప్పడంలేదు. బస్టాండ్ సెంటర్‌లో హైమాస్ట్ లైట్లు ఉన్నప్పటికీ అవి అలంకారప్రాయంగా మిగిలాయి. సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయం కూడా బస్టాండ్ సెంటర్‌కు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ, ఈ ప్రాంతం చీకట్లలో మగ్గడం అధికారుల నిర్లక్ష్యానికి తార్కణం. ఈ ప్రాంతంలో సింగరేణి చిల్డ్రన్స్ పార్క్ సైతం అలంకార ప్రాయంగానే ఉంది. పట్టణ నడిబొడ్డులో ఏకరాల్లో ఉన్న సింగరేణి చిల్డ్రన్స్ పార్క్ అధికారుల పర్యవేక్షణ లోపంతో నిత్యం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఈ పార్క్‌పై సంబంధిత అధికారులు దృష్టి సారించి, ఇక్కడ వృథాగా ఉంటున్న ఖాళీ స్థలంలో బస్టాండ్ సెంటర్‌కు వచ్చే వాహనదారుల కోసం పార్కింగ్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను నివారించడం సులభతరమవుతుంది. అంతేకాకుండా రోడ్డు విస్తరణలో భాగంగా త్వరగా ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరికరిస్తే నియమ నిబంధనలపై వాహనదారులకు అవగాహన సైతం ఏర్పడుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సకాలంలో స్పందించి సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles