బ్యాలెట్ బాక్సుల్లో భవితవ్యం..!

Sat,May 18, 2019 01:26 AM

- 289 ఎంపీటీసీ, 20 జడ్పీటీసీ స్థానాలలో ముగిసిన ఎన్నికలు
-జిల్లాలో చిన్నచిన్న సంఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతం
-ఓటమి భయంతో అక్కడక్కడ ప్రతిపక్షాల లొల్లి
-మూడు దశల్లో 6,58,121 మంది ఓటర్లు ఓటేశారు
-మూడు దశల్లో 84.82 శాతం పోలింగ్ నమోదు
-ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు
-జడ్పీటీసీకి 105 మంది ఎంపీటీసీలకు 881 మంది పోటీ
- కౌంటింగ్ ఏర్పాట్లలో అధికారులు
మామిళ్లగూడెం, మే 17: నెల రోజుల ఎన్నికల ప్రచార హోరు ముగిసి తమ భవిష్యత్ బ్యాలెట్ బాక్సుల్లో భద్రం కావడంతో అభ్యర్థులు గెలుపు, ఓటములపై అంచనాలు వేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు మాత్రం గెలుపుపై దీమాతో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనాయకులు పాల్గొని అభ్యర్థుల గెలుపుకు తీవ్ర కృషి చేశారు. ప్రతిపక్ష పార్టీల ప్రధాన నాయకులెవరూ ప్రచారంలో పాల్గొనకపోవడంతో నిరాశచెందారు. ఏకగ్రీవమైన ఎంపీటీసీ స్థానాలలో టీఆర్‌ఎస్‌కు ఓటింగ్ ఏకపక్షంగా జరిగిందని చెప్పవచ్చు. ఎన్నికల పోటీలలో అభ్యర్థులు గెలుపోటముల కోసం ఎత్తుకు పైఎత్తు వేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష పార్టీల కూటమిలో అంతర్గత కుమ్ములాటలు, కొన్ని గ్రామాలలో ప్రతిపక్ష పార్టీలలోని కొన్ని పార్టీల కమిటీలు టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చారు. దీంతో టీఆర్‌ఎస్ గెలుపునకు డోకాలేదని చెప్పవచ్చు. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మరో 10 రోజుల్లో పోటీ చేసిన అభ్యర్థుల రాజకీయ భవితవ్యం బయటపడనుంది.

జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో అధికారులు చేపట్టిన ఎన్నికల పటిష్ట బందోబస్త్, ఎలాంటి అవకతవకలు లేకుండా ఎన్నికలు నిర్వహించడంతో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మూడు విడతలో 84.82 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 3,81,692 మంది పురుషులు ఓటర్లు ఉండగా, వారిలో 3,23,730 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలాగే 3,94,205 మహిళ ఓటర్లు ఉన్నారు. వారిలో 3,34,391 మంది మహిళలు ఓటు వేశారు. అన్ని విడతల్లోను మహిళలే ఎక్కువ శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో 16 మంది ట్రాన్స్‌జండర్‌లు ఓటర్లుగా ఉన్నప్పటికి ఏ ఒక్కరూ ఓటు వేయలేదు. మొత్తంగా 7,75,913 మంది ఓటర్లలో 6,58,121 మంది తమ ఓటుహక్కు సద్వినియోగం చేసుకున్నారు. అలాగే ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా అధికార యంత్రాంగానికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కాయి. మొత్తంగా జిల్లాలో చిన్నచిన్న సంఘటనలు తప్ప ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు లేకుండానే పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించారు. ప్రతిపక్షాలు ఓటమి భయంతో కొంత మేరకు గొడవలు చేసే ప్రయత్నం చేసినప్పటికి అధికారులు సమన్వయంతో వాటిని నిలువరించారు. వేసవికాలం కావడంతో ఓటర్లు ఉదయమే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మధ్యాహ్నం కాస్త మందగించినప్పటికి సాయంత్రం 4 గంటల తరువాత ఓటర్లు మరోసారి పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల వరకే ముగించాల్సిన పోలింగ్ ప్రక్రియను అధికారులు పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్ల అందరికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు ప్రత్యేక వీడియోగ్రాఫర్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అక్కడక్కడ చిన్నిచిన్న సంఘటనలు జరిగినప్పటికి పోలీస్‌లు అప్రమత్తంతో వాటిని నివారించారు. దీంతో రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లా అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు.

ఏకగ్రీవ ఎంపీటీసీ స్థానాలు ఇవే....
మొదటి విడతలో ముదిగొండ మండలంలో వల్లభి-1 ఎంపీటీసీ స్థానం టీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవం కాగా వల్లభి-2 ఎంపీటీసీ స్థానం కాంగ్రెస్‌కు ఏకగ్రీవమైంది. రెండవ విడతలో మూడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కల్లూరు మండలంలో ఎర్రబోయినపల్లి, సత్తుపల్లి మండలంలో బుగ్గపాడు, వేంసూరు మండలంలో బీమవరం ఎంపీటీసీ స్థానాలు టీఆర్‌ఎస్ ఏకగ్రీవంగా దక్కించుకుంది. మూడవ విడతలో ఎర్రుపాలెం మండలం జమలాపురం ఎంపీటీసీ స్థానం టీఆర్‌ఎస్ ఖాతాలో చేరింది. దీంతో ఈ గ్రామాలలో ఓటర్లు కేవలం జడ్పీటీసీకే వేశారు.

కౌంటింగ్ కేంద్రాలు ఇవే...
జిల్లాలో స్థానిక సంస్థలు జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు ముగియడంతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరిచారు. కట్టుదిట్టమైన భద్రతా, సీసీ కెమెరాల పర్యవేక్షణలో బ్యాలెట్ బాక్సులు ఆయా కౌంటింగ్ కేంద్రాలలో భద్రంగా ఉన్నాయి. ఈ నెల 27న జరగనున్న కౌంటింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలను చేపడుతున్నారు.
- మొదటి విడత కామేపల్లి, తిరుమలాయపాలెం, సింగరేణి మండలాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్‌ను ఖమ్మం రూరల్ మండలంలోని బారుగూడెం గ్రామం వద్దనున్న మహ్మదీయ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో నిర్వహించనున్నారు.
-ఖమ్మం రూరల్, కూసుమంచి ముదిగొండ, నేలకొండపల్లి మండలాలకు సంబంధించిన కౌంటింగ్‌ను ఖమ్మంరూరల్ మండలంలోని తల్లంపాడు వద్ద ఉన్న కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తారు.
-మండలంలోని రెడ్డిగూడెం గ్రామం వద్దనున్న క్రీస్తుజ్యోతి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలలో నిర్వహించనున్నారు.
-పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాలకు సంబంధించిన కౌంటింగ్‌ను సత్తుపల్లి మండలంలోని మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలో చేపడతారు.
-మూడవ విడత బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాలకు సంబంధించిన కౌంటింగ్ మధిర పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించనున్నారు.
-చింతకాని, కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా మండలాలకు సంబంధించిన కౌంటింగ్ కొణిజర్ల మండలంలోని తణికెళ్ల వద్ద ఉన్న గ్రేస్ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles