ఆపరేషన్.. అడ్మిషన్

Sat,May 18, 2019 01:24 AM

ఖమ్మం ఎడ్యుకేషన్: మీ పిల్లలను మా స్కూల్లో చేర్పించండి.. మీ పిల్లల్ని చేర్పించకుంటే మీకు తెలిసిన వారికైన చెప్పండి... మా పాఠశాలల్లో చేర్పిస్తే ఐఐటీయన్లను చేస్తాం.. డాక్టర్‌లుగా తీర్చిదిద్దేందుకు తోడ్పడతాం.. ఇలాంటి మాయ మాటలతో విద్యార్థుల తల్లిదండ్రులకు వల్లె వేస్తున్నారు. కలర్‌ఫుల్ బ్రోచర్లతో కట్టిపడేస్తున్నారు.. జిల్లా కేంద్రంతో పాటు మారుమూలా గ్రామాల్లోనూ చదువుకునే పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు వినిపిస్తున్న మాటలివి. మార్కెటింగ్ ఏజెంట్లుగా మారి అడ్మిషన్ చేస్తేనే జీతాలు అనే సరికి ఇంటింటికి తిరుగుతున్నారు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు. దీనికి తోడు పాఠశాలల మధ్య పోటీతో ఫీజుల్లో రాయితీలు ఇస్తామని చెప్పి అడ్మిషన్ రాయించి, పాఠశాలలో చేరి కొన్ని రోజులు అయ్యాక చెప్పిందొకటి జరిగేదొకటిలా మారిన పరిస్థితులు ఉన్నాయి. జూన్ నెలలో ప్రారంభమయ్యే విద్యాసంవత్సరానికి ఇప్పటి నుంచే అడ్మిషన్ల వేట మొదలైంది. ఈ అడ్మిషన్ల సమయంలో చోటు చేసుకుంటున్న అంశాలపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..

మాయా.. మోసం...
జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ప్రతినిధులు చెప్పిన మాటలు విని ఓ విద్యార్థి తల్లిదండ్రులు రమేష్, లక్ష్మి (పేర్లు మార్చాం) ఆ పాఠశాలలో చేర్పించారు. ఇంటింటికీ క్యాంపెయిన్‌కు వెళ్లిన సమయంలో బస్ ఫీజు, కంప్యూటర్ ఫీజు, స్కూల్ ఫీజు, ఇతరత్రా ఫీజులు అన్ని చెప్పి వీటన్నింటి మీద కొంత మినహాయింపు ఇస్తాం. ఇప్పుడే అడ్మిషన్ చేస్తే ట్యూషన్ ఫీజు ఒక్కటి చెల్లిస్తే చాలు అని సదరు టీచర్ ఆ విద్యార్థి తల్లిదండ్రులకు హమీ ఇచ్చి అడ్మిషన్ పూర్తి చేశారు. పాఠశాల ప్రారంభమైంది, ముందుగా అనుకున్న ప్రకారం పేరెంట్స్ ఫీజు మొత్తం చెల్లించారు. రెండు నెలలు సాఫీగానే సాగింది. తర్వాత మీ బాబుకి సంబంధించిన పెండింగ్ ఫీజును చెల్లించాలని విద్యార్థి డైరీలో రాసి పంపించారు. డైరీ చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఒకవేళ పొరపాటును ఎమైనా వచ్చి ఉంటుందేమోనని సంబంధిత పాఠశాలకు వెళ్లి ఆరా తీయగా, పొరపాటు కాదు మీ బాబు ఫీజు ఇంకా పెండింగ్ ఉందని సమాధానం ఇచ్చారు. ఫీజు మొత్తం చెల్లించినా, ఇంకా చెల్లించాలని చెప్పడంతో పట్టరాని కోపం వచ్చిన తల్లిదండ్రులు స్కూల్ యాజమాని కలిసి మాట్లాడుకున్న ఫీజు వివరాలు తెలియజేశారు. మీరేం మాట్లాడుకున్నారో మాకు సంబంధం లేదు, మీరు పెండింగ్ ఫీజు చెల్లించాల్సిందే అని కరస్పాండెంట్ ఖరాకండిగా తేల్చేశాడు. వాళ్ల ఇంటికి అడ్మిషన్ చేయించిన టీచర్ గురించి వాకబ్ చేయగా వేరే పాఠశాలకు వెళ్లినట్లు తెలుసుకుని మోసపోయామని గ్రహించి నిట్టూర్చారు. జిల్లాలో అడ్మిషన్ సమయంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తల్లింద్రులు తస్మాత్ జాగ్రత్త.

కలర్ పుల్ బ్రోచర్లు...
తమ పాఠశాల ఇంటర్నేషనల్ స్థాయి అని, మా స్కూల్లో చదివిన వారు విదేశాల్లో ఉన్నారని, పూర్తిగా కంప్యూటర్లు, ఆధునాతన భవనాలు అంటూ కలర్‌ఫుల్ బ్రోచర్లు చూపిస్తూ కొన్ని పాఠశాలలు ఆకర్షిస్తున్నాయి. ప్రైమరీ నుంచే స్పోకెన్ ఇంగ్లిష్, 6వ తరగతి నుంచే ఐఐటీ వంటివి, ఇంకా ఊహాకంద నటువంటి మాటలతో తల్లిదండ్రులను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. మేము అడ్మిషన్‌లు చేయాల్సిన అవసరం కూడా లేదు, మంచి పాఠశాలను ఎన్నుకునేందుకు చాలా మందికి అన్ని పాఠశాలలు తెలియదు అని తీయని మాటలతో వివరాలు సేకరిస్తారు. ఆకట్టుకోవడమే లక్ష్యం వారి పదజాలం ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా అందించే పాఠశాల మాది కాకుండా ఇంకా ఏది ఉండదని, వేరే పాఠశాలల్లో చేర్పించి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని ఆత్మీయుల కంటే బలంగా నమ్మిస్తారు. వీరిని నమ్మి పాఠశాలలో చేరాక ఇవేమి కనిపించవు. అప్పుడు ప్రశ్నిస్తే మీకు చదువు కావాలా..? పనికిరాని ప్రచారాలు కావాలా అని బుకాయిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు చేసేది ఏమిలేక విద్యార్థి చదువు కొనసాగిస్తున్నారు.

అడ్మిషన్ చేస్తేనే జీతాలు...
పిల్లలు ఉంటే చదువు ఎవరైనా చెప్తారు.. చదువు చెప్పాలంటే పిల్లలు ఉండాలి.. ముందుగా అడ్మిషన్‌లు తెచ్చిన వారే వచ్చే విద్యాసంవత్సరంలో మంచి జీతంతో కొనసాగుతారు అంటూ యాజమాన్యాలు సున్నితంగా సమావేశం పెట్టి వారి నిర్ణయాలు వెల్లడిస్తాయి. కొందరు ఉద్యోగం కోసం తమ పోరాటాన్ని కొనసాగుస్తుండగా, మరికొందరు మాయ మాటలు ( మేనేజ్‌మెంట్ స్కిల్స్) లేక ఇబ్బంది పడతారు. కొన్ని పాఠశాలలు ఫిబ్రవరి నుంచే ఈ ప్రవేశాల ప్రక్రియను చేస్తుండగా, మరికొన్ని మాత్రం సమ్మర్‌లో అంతా ఇదే వేట సాగిస్తారు. విద్యాసంస్థకు సంబంధించిన బ్రోచర్లు పట్టుకుని తెలిసిన వారినల్లా అడుగుతూ ఇంటింటికి ఆపరేషన్ అడ్మిషన్ ప్రక్రియను సాగిస్తున్నారు. ఈ టీచర్లు క్యాంపెయిన్ చేస్తున్నారా లేదా అని పరిశీలించడానికి మరొకరు సూపర్‌వైజ్ చేస్తుంటారు. వీరికి ఇచ్చిన టార్గెట్లు ప్రకారం ప్రవేశాలు అయితేనే జీతాలు. ఆయా గ్రామాలతో అనుబంధం ఉన్న టీచర్లు అక్కడే ఎలాగోలా అడ్మిషన్లు చేసి జీతాలు సంపాందించుకుంటున్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles