ట్రాఫికర్

Sat,May 18, 2019 01:22 AM

నగర నడి బొడ్డు.. అసలే ఇరుకు రోడ్డు.. వాహనాల రద్దీ.. ఆటోవాలాల ఆరాటం.. చివరికి ట్రాఫిక్‌జామ్. కనురెప్పపాటులో ఏం జరుగుతుందో తెలియని వైనం. ఇంటినుంచి అడుగుబయట పెట్టిన దగ్గర్నుంచి క్షణక్షణం భయం. బజారుకు వెళ్ళి క్షేమంగా ఇంటికి చేరుకుంటామా లేదా అన్న ఆందోళన. వీటన్నింటి మధ్యన నగర ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ఖమ్మం నగర పరిధి నానాటికీ విస్తరిస్తోంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మారిన తర్వాత మరింత వేగం పుంజుకుంటుంది. విద్యా, వైద్య, వ్యాపార రంగాల అభివృద్ధి వేగవంతమైంది. ఈ క్రమంలో ఖమ్మానికి రవాణా సౌకర్యం కూడా మెరుగుపడింది. అనేక ప్రాంతాల నుంచి వివిధ మార్గాల రాకపోకలు ఇప్పుడు ఎక్కువయ్యాయి. దీంతో ఎటుచూసినా వాహనాలే కన్పిస్తున్నాయి. గడిచిన ఐదేళ్లతో పోల్చుకుంటే బైకులు, ఆటోలు, కార్లు ఎన్నో రెట్లు పెరిగాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా రహదారుల విస్తరణ సరిగా జరగకపోవడం, ట్రాఫిక్ పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం వంటి కారణాలతో ఈ ప్రభావం ట్రాఫిక్‌పై తీవ్రంగా చూపిస్తుంది. నగరం కూడా వాణిజ్యపరంగా ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ, ఏపీల్లోని పలు జిల్లాల నుంచి ఖమ్మానికి వచ్చిపోయే వారి సంఖ్య భారీగానే పెరుగుతోంది. ప్రతి రోజూ అంచనాలకు మించి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు రోడ్లపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో విపరీతంగా ట్రాఫిక్ పెరుగుతూ ఏ కూడలిలో ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలియని పరిస్థితి.

బైలైన్‌లలో కనిపించని ఆటోలు..
ఖమ్మం నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు గతంలో వినూత్న పద్ధతులు చేపట్టారు. రోడ్లపై ఆటోలు ఇష్టారాజ్యంగా నిలపడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతోందని గమనించిన పోలీసు అధికారులు కూడళ్లలో రోడ్డుకు ఇరువైపులా ఆటోలకు బైలైన్లను ఏర్పాటు చేశారు. ఈ బైలైన్‌లలో ఆటోలను నిలపుకొని ప్రయాణికులను ఎక్కించుకునే విధంగా చర్యలు చేపట్టారు. అదే లైన్‌లో ఆటోలు వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. కానీ ఈ వ్యవస్థ మూడున్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. నగరంలోని ప్రధాన కూడళ్లలో బైలైన్లలో ఆటోలు వెళ్లకుండా రోడ్లపై ఇష్టారాజ్యంగా ఆపి ట్రాఫిక్‌కు అంతరాయాన్ని కలిగిస్తున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఆటోలు బైలైన్లలో వెళ్లే విధంగా చర్యలు తీసుకుకోకుండా వాహనాల ఫొటోలు తీస్తూ ఈ చాలాన్ విధులకే సమయం మొత్తం కేటాయిస్తున్నారు.
రైతుబజార్ వద్ద ఎప్పుడూ ట్రాఫిక్ జామే..
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న పెవిలియన్‌గ్రౌండ్ రైతుబజార్ వద్ద ఎప్పుడూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఎన్నెస్టీ రోడ్డుకు వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు రోడ్డుకు మధ్యలో బారీకేడ్స్‌లను ఏర్పాటు చేసి సింగిల్ వేలను ఏర్పాటు చేశారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆటోలు, తోపుడు బండ్లు ఇష్టారాజ్యంగా రోడ్డుకు ఇరువైపులా ఉండటంతో ఆ రోడ్డున వెళ్లే కార్లకు, బైకులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ట్రాఫిక్ జామై గంటల కొద్దీ వేచిచూసే పరిస్థితి నెలకొంటోంది. రైతుబజార్‌కు వచ్చే రైతులు, వినియోగదారులు; వివిధ జబ్బులతో ఆసుపత్రులకు వచ్చే రోగులతో ఈ కూడలి నిత్యం రద్దీగా ఉంటోంది.

డీమార్ట్ వద్ద ఇష్టారాజ్యంగా పార్కింగ్
త్రీటౌన్ ప్రాంతంలో డీమార్ట్ సూపర్‌మార్కెట్‌ను ఏర్పాటుచేశారు. తమ వద్దకు వచ్చే వినియోగదారుల కోసం డీమార్ట్ తన సెల్లార్‌లో పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ సరిపోకపోవడంతో కొందరు వినియోగదారులకు డీమార్ట్ ఎదుట రోడ్డుపైనే తమ వాహనాలను నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం కలుగుతోంది.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles