లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆంకురారోపణ

Fri,May 17, 2019 01:02 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం అనుబంధ ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీయోగానంద లక్ష్మీనృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురారోపణ జరిగింది. నృసింహస్వామి ఆలయంలో అర్చకులు ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6.30నిమిషాలకు విశ్వక్సేన పూజ, పుణ్యఃవచనం చేపట్టారు. తర్వా రుత్విగ్వరణం, మృత్యుంగ్రహణం, అంకురారోపణం, వాస్తుహోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అంకురారోపణ పూజలో పాల్గొన్నారు. శనివారం నృసింహ జయంతిని పురస్కరించుకొని అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, గరుడవాహనంపై తిరువీధిసేవ, 18న యోగానంద శ్రీలక్ష్మీనృసింహస్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 19న రథోత్సవం, 20న మహదాశీర్వచనం, గోదావరిలో తెప్పోత్సవం, దొంగల దోపు ఉత్సవం, 21న వసంతోత్సవం, తీర్థోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

రామయ్య నిత్యకల్యాణం
పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయంలో గురువారం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి సుప్రభాత సేవ నిర్వహించారు. గోదావరి నది నుంచి తీర్థబిందె తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేశారు. అర్చన, సేవాకాలం, పుణ్యఃవచనం తదితర పూజలు గావించారు. భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. రుష్యమూక మ్యూజియాన్ని సందర్శించారు. సీతమ్మవారి నగలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామయ్యస్వామికి నిత్యకల్యాణం నిర్వహించారు.

బెల్లం ప్రసాదాలకు భలే గిరాకీ..!
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం నుంచి బెల్లంతో తయారు చేసిన లడ్డూ, పొంగలి, రవ్వకేసరిని విక్రయిస్తున్నారు. పంచదారతో చేసిన ప్రసాదాలతో పాటు బెల్లంతో తయారు చేసిన ప్రసాదాలను కూడా భక్తులకు అందుబాటులో ఉంచడంతో వీటికి భాగా గిరాకీ పెరుగుతోంది. తొలి రోజు బుధవారం 1200 లడ్డూలు తయారు చేయగా 1200 లడ్డూలు, 3కేజీల పొంగలి, రవ్వకేసరి తయారు చేయగా గంటలోపే వీటిని భక్తులు కొనుగోలు చేశారు. వీటి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని గురువారం దేవస్థానం స్వల్పంగా వాటి తయారీని పెంచగా, అవి కూడా అతికొద్ది సమయంలోనే అమ్ముడుపోయాయి. ఈ బెల్లం ప్రసాదాలు భక్తులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. రుచితో పాటు నాణ్యత కూడా ఉండటంతో వీటిని భక్తులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం లేకపోవడంతో కొద్ది మొత్తంలోనే తయారు చేసి భక్తులకు విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో వీటి తయారీ మోతాదును పెంచనున్నట్లు దేవస్థానం ఈవో తాళ్లూరి రమేష్‌బాబు తెలిపారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles