ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా జరగాలి

Fri,May 17, 2019 12:51 AM

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం కొత్తగూడెం క్లబ్‌లో ఈ నెల 27వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపుపై ఎంపీడీవోలు, ఆర్వోలు, ఏఆర్వోలు, ట్రైనర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జేసీ పాల్గొని మాట్లాడుతూ... ఈ నెల 26వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. 27వ తేదీ ఉదయం 6 గంటల వరకు విధులు కేటాయించిన సిబ్బంది లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన తరువాత ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. మొదటిగా పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ఉంటుందని, తరువాత బ్యాలెట్‌ బాక్సుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించాలన్నారు. బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమై ఉన్న ఓట్లను 25 బండిల్స్‌గా తయారు చేసి బ్యాలెట్‌తో సరిపోల్చిన తరువాత ఏర్పాటు చేసిన డ్రమ్ముల్లో వేయాలని సూచించారు. డ్రమ్ముల్లో వేసిన తరువాత ముందుగా ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు పార్రంభించాలని, ఇందుకు రెండు రౌండ్లు ఏర్పాటు చేసి, ప్రతీ రౌండుకు వేయి ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు.

26వ తేదీన నిర్వహించే ర్యాండమైజేషన్‌ ప్రక్రియలో సిబ్బంది కేటాయింపు చేస్తామన్నారు. ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు 2 టేబుళ్లు ఏర్పాటు చేయాలని, ప్రతీ టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌తో పాటు ఇద్దరు సిబ్బంది ఉంటారన్నారు. ముందుగా ఎంపీటీసీ ఓట్లు లెక్కింపును ప్రారంభించాలని, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు పూర్తైన తరువాతనే జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ నెల 20వ తేదీన అన్ని మండలాలలో ఓట్ల లెక్కింపుపై సమావేశాలు నిర్వహించి సిబ్బందికి అవగాహన కల్పించాలని, ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే ఏజెంట్లు జాబితాను ముందుగానే తీసుకొని పాసులు జారీ చేయాలని, పాస్‌లు లేనిదే ఎవరినీ లెక్కింపు కేంద్రంలోనికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పార్టీల ఏజెంట్లు సమక్షంలో బాక్సులు తెరిచి వారి నుంచి సంతకాలు తీసుకోవాలని, ఓట్ల లెక్కింపు అనంతరం మెజార్టీ వచ్చిన అభ్యర్థికి సంబంధించి అన్ని సక్రమంగా ఉన్నట్లు నిర్ధారణ చేసుకున్న తరువాతనే రిటర్నింగ్‌ అధికారులు ఫలితాలను ప్రకటించాలని ఆయన సూచించారు. అనంతరం పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో చేయాల్సిన విధులతో పాటు వాలీడ్‌ ఓట్లు, ఇన్‌ వాలీడ్‌ ఓట్లు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో స్వర్ణలత, డిప్యూటీ సీఈవో పురుషోత్తం, మాస్టర్‌ ట్రైనర్‌ నరసింహకుమార్‌, అన్ని మండలాల ఎంపీడీవోలు, రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, ట్రైనర్లు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles