దేవుని మాన్యం దేవునికే...!


Thu,May 16, 2019 12:57 AM

-జిల్లాలో ఆలయ భూములపై ఆరా
-కదిలిన దేవాదాయశాఖ అధికారులు
-భద్రాద్రి నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభం
-ఆలయ భూముల రక్షణకు అడుగులు
-ఉభయ జిల్లాల్లో ఆక్రమణలో 1984 ఎకరాల దేవుని మాన్యం
భద్రాచలం, నమస్తే తెలంగాణ : దేవుని మాన్యం కాపాడేందుకు దేవాదాయశాఖ కథం తొక్కుతోంది..! ఆలయ భూ ఆక్రమణ దారుల భరతం పట్టేందుకు రంగం సిద్ధమవుతోంది..! భూ ఆక్రమణదారులను గుర్తించి ఆ భూములను తిరిగి దేవస్థానంకు అప్పగించేందుకు పత్రికా ప్రకటనలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి..! దేవస్థానం భూములను గుర్తించి వాటికి సంబంధించి సైన్‌ బోర్డులు, ఫెన్షింగ్‌ ఏర్పాటుకు చర్యలు మొదలయ్యాయి..! దేవాదాయశాఖ సూచనలు పాటించకపోతే ఆక్రమణ దారులపై చట్టపరమైన చర్యలకు దేవాదాయశాఖ ముందడుగు వేస్తోంది..! ఈ క్రమంలో ఇందుకు సంబంధించి స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహించనుండగా, బుధవారం భద్రాచలం నుంచి ప్రారంభించడం జరిగింది...! త్వరలోనే పూర్తి నివేదికలను సిద్ధం చేసి దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు పంపించనున్నారు.


జిల్లాలో ఆలయ భూములపై ఆరా..
దేవాదాయశాఖ పరిధిలో ఉన్న వివిధ ఆలయాల భూములను రక్షించేందుకు ఆశాఖ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈనెల 8వ తేదీన ఇందుకు సంబంధించి జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. దేవాదాయశాఖ సహాయక కమిషనర్‌, పరిశీలకులు, గ్రూప్‌ టెంపుల్స్‌ కార్యనిర్వాహణ అధికారులు, చైర్మన్‌, అర్చకులతో నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించడం జరిగింది. దేవాదాయశాఖ కమిషనర్‌ అత్యవసరంగా ఉత్తర్వులు ఆశాఖ అధికారులకు అందించడం జరిగింది. దీని ప్రకారం దేవస్థానం భూముల నందు ఎవరైనా ఆక్రమణ దారులు ఉన్న యెడల వారిని స్వచ్ఛందంగా సదరు ఆక్రమణలను వదిలి దేవస్థానంకు అప్పగించవల్సిందిగా సూచిస్తూ పత్రికా ప్రకటనలు ఇవ్వాలని, తెలంగాణ,

ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలలో గల వివిధ జిల్లాల్లో దేవస్థానం భూములను గుర్తించి వాటికి సంబంధించిన సైన్‌ బోర్డు, ఫెన్షింగ్‌ ఏర్పాటు చేయాలని దేవస్థానం ఆధీనంలో ఉన్న, ఆక్రమణలో ఉన్న లీజ్‌ పీరియడ్‌ పూర్తి కాబడి తిరిగి వారి ఆధీనంలో ఉన్న భూములను గుర్తించి సైన్‌ బోర్డు ఏర్పాటు చేయుట, కౌలు కాల పరిమితి పూర్తి కాబడి కూడా కొనసాగుతున్న కౌలు దారులను గుర్తించి దేవస్థానం నియమ నిబంధనల ప్రకారం తొలగించుటకు అవసరమైన చర్యలు తీసుకొనుట, భూములు ఆక్రమణ దారులను గుర్తించి వారిని నియమ నిబంధనల ప్రకారం తొలగించుటకు గాను చట్టపరమైన చర్యలు తీసుకొనుట, 43(ఏ) రిజిస్టర్‌ను అప్‌డేట్‌ చేయుట, రిజిస్ట్రేషన్‌ యాక్టు 22 (ఏ) (1) (సీ) ప్రకారం దేవస్థానంకు చెందిన అన్ని భూములను రిజిస్ట్రేషన్‌ చేయుటకు చర్యలు తీసుకొనుట, దేవస్థానంకు చెందిన అన్ని భూములను పట్టాదారు పాస్‌ పుస్తకం ప్రకారం రెవెన్యూశాఖ వారిచే సర్వే చేయించుటకు అవసరమైన చర్యలు తీసుకొనుట,

రెవెన్యూశాఖ వారి సహకారంతో, రెవెన్యూశాఖ వారి రికార్డులు, దేవస్థానం రికార్డుల ప్రకారం భూముల వివరాలను రీ కన్షలేషన్‌ చేయించుట, దేవస్థానం భూముల ఆక్రమణ విషయమై ఎండోమెంట్స్‌ ట్రిబ్యునల్‌ నందు దేవస్థానంకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం అవసరమైన చర్యలు తీసుకొనుట, ఎండోమెంట్‌ ట్రిబ్యునల్‌ నందు దేవస్థానంకు అనుకూలంగా ఉత్తర్వులు రాని సందర్భంలో వెంటనే ఉన్నత న్యాయస్థానం నందు కేసులు దాఖలు చేయుట, పెండింగ్‌ నందు ఉన్న కేసులకు సంబంధించి త్వరితగతిన కౌంటర్‌ ఫైల్స్‌ దాఖలు చేయుటకు చర్యలు తీసుకొనుట, ఖాళీగా గల భూములపై ఆదాయం పెరిగే విధంగా అవసరమైన చర్యల విషయమై పరిశీలించి జోనల్‌ అధికారి వారి దృష్టికి తీసుకొచ్చుట తదితర అంశాలపై చర్యలు తీసుకునేందుకు దేవాదాయశాఖ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు కిందిస్థాయి అధికారులకు జారీ చేశారు.

కదిలిన అధికారులు..
జిల్లాలోని ఆలయ భూముల రక్షణకు తగు గైడ్‌లైన్స్‌ దేవాదాయశాఖ కమిషనర్‌ ఇచ్చిన నేపధ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా పరిధిలోని దేవాదాయశాఖ అధికారులు ఆ దిశగా చర్యలకు ఉపక్రమించారు. ఈ నేపధ్యంలో బుధవారం భద్రాచలం పట్టణంలోని పురుషోత్తపట్నం సమీపంలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి సంబంధించిన భూములపై ఆరా తీశారు. ఆలయ భూ ములు ఎవ్వరెవ్వరి ఆక్రమణలో ఉన్నాయో అందుకు సంబంధించిన వివరాలను ఆలయ సిబ్బంది సేకరించారు. ఫోటోలతో సహా సమాచారాన్ని తీసుకున్నారు. ఇంకా దశల వారీగా పూర్తిస్థాయి వివరాలను సేకరించనున్నారు. భద్రాద్రి రామాలయంకు చెందిన దేవుని మాన్యం భద్రాచలం పరిసర ప్రాంతంతో పాటు ఇరు రాష్ర్టాలలో (తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌) ఉంది. ఇందులో అధికభాగం ఆక్రమణలోనే ఉండటం గమనార్హం. రామాలయం భూములతో పాటు ఉభయ జిల్లాలోని ఇతర దేవస్థానం పరిధిలో ఉన్న ఆలయ భూములకు సంబంధించిన వివరాలను యుద్ధప్రాతిపదికన సేకరించేందుకు దేవాదాయశాఖ సన్నద్ధమవుతోంది.

ఉభయ జిల్లాల్లో ఆక్రమణలో 1984 ఎకరాల దేవుని మాన్యం..
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఉభయ జిల్లాల పరిధిలో 1984 ఎకరాల 7కుంటల దేవుని మాన్యం ఆక్రమణలో ఉండటం గమనార్హం. ఈ ఉభయ జిల్లాల పరిధిలో దేవాదాయశాఖకు చెందిన 219 ఆలయాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 187, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 32 ఆలయాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ఉన్న 187 ఆలయాలకు చెందిన 2093 ఎకరాల 23 కుంటల వ్యవసాయ యోగ్యత మాన్యం, 2626 ఎకరాల 15 కుంటల వ్యవసాయేతర దేవుని మాన్యం ఉంది. మొత్తం ఖమ్మం జిల్లా పరిధిలో వివిధ ఆలయాల దేవుని మాన్యం 4719 ఎకరాలు, 38 కుంటలు ఉంది.

ఇందులో 1324 ఎకరాల 27 కుంటల దేవుని మాన్యం అర్చకుల ఆధ్వర్యంలో ఉండగా, 2,269 ఎకరాల 3 కుంటల దేవుని మాన్యం వ్యవసాయ లీజ్‌లో ఉంది. ఈ లీజ్‌లో ఉన్న వ్యవసాయ భూమి నుంచి దేవాదాయశాఖకు రూ.కోటి రూపాయల 34లక్షల 3,288ల ఆదాయం సమకూరుతోంది. 833 ఎకరాల 2కుంటల దేవుని మాన్యం ఈ ఖమ్మం జిల్లాలో వివిధ ఆక్రమణలో ఉంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దేవాదాయశాఖకు చెందిన 32 ఆలయాలు ఉండగా, 407 ఎకరాల 16 కుంటల వ్యవసాయ భూమి, 9,228 ఎకరాల 26కుంటల వ్యవసాయేతర భూమి మొత్తం 9,636 ఎకరాల 2 కుంటల దేవుని మాన్యం ఉంది. 234 ఎకరాల 31 కుంటల భూమి అర్చకుల ఆధ్వర్యంలో ఉండగా, 7406 ఎకరాల 3 కుంటలు వ్యవసాయ లీజ్‌లో ఉండగా, రూ.54లక్షల 8వేల 673లు లీజ్‌ రూపంలో దేవస్థానంకు ఆదాయం సమకూరుతోంది. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1151 ఎకరాల 5 కుంటల మాన్యం ఆక్రమణలో ఉంది.

చర్యలకు రంగం సిద్ధం..
ఉభయ జిల్లాల్లో ఆలయ భూములు భారీ ఎత్తున ఆక్రమణదారుల ఆధీనంలో ఉన్న నేపధ్యంలో దేవాదాయశాఖ చర్యలకు ఉపక్రమించడంతో భూ ఆక్రమణ దారుల్లో ఆందోళన మొదలైంది. దేవాదాయశాఖ స్పెషల్‌ డ్రైవ్‌ ఆరంభమైన నేపధ్యంలో వారిలో కలవరం నెలకొంది. అతి త్వరగా ఆలయ భూములకు సంబంధించిన లెక్కలు సేకరించి ఆక్రమణ దారులు వెంటనే ఆలయ భూములను అప్పగించాల్సిందిగా కోరుతూ దేవాదాయశాఖ అధికారులు ప్రకటనలు ఇవ్వనున్న నేపధ్యంలో భూ ఆక్రమణ దారులు ప్రత్యామ్నాయ చర్యలవైపు సమాలోచనలు జరుపుతున్నారు. దేవాదాయశాఖ కమిషనర్‌ ఆలయ భూములకు సంబంధించి భూ ఆక్రమణల విషయంలో సీరియస్‌గా ఉన్న నేపధ్యంలో ఆలయ భూ ఆక్రమణ దారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

155
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles