జూన్‌ చివరి నాటికి భూ సమస్యలు పరిష్కారం : జేసీ

Thu,May 16, 2019 12:55 AM

జూలూరుపాడు: అర్హులైన రైతులందరికీ రెవెన్యూ గ్రామసభల ద్వారా జూన్‌ నెలాఖరు నాటికి భూ సమస్యలు పరిష్కరించి పట్టా పాసుపుస్తకాలు అందజేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ కే.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మండలంలోని గుండెపుడి గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ గ్రామసభకు ఆయన బుధవారం హాజరై రికార్డులను పరిశీలించారు. గుండెపుడి రెవెన్యూ పరిధిలోని భూ సమస్యల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అర్హులైన వారందరికీ గ్రామసభల ద్వారా న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని చెప్పారు. జిల్లాలో 1,44,303 ఖాతాలు ఉన్నాయని, వాటిలో 43 వేల 493 ఖాతాలకు పట్టాలు లేకుండా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో 6 వేల ఖాతాలను పూర్తి స్థాయిలో విచారించి సమస్యలు పరిష్కరించి పట్టాలు అందించామని గుర్తు చేశారు. 2005 డిసెంబర్‌13 కంటే ముందు నుంచి అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులను ఆర్‌వో ఎఫ్‌ఆర్‌ చట్టం ప్రకారం గ్రామసభల ద్వారా రైతులను గుర్తించి వారికి హక్కుపత్రాలు అందించేందుకు సంబంధిత అధికారులకు నివేదిక అందించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో రైతుల సంఖ్య భూముల విస్తీర్ణంలో వ్యత్యాసాలు ఉన్నాయని, వాటన్నింటినీ సర్వేయర్ల ద్వారా సర్వే చేసి సరి చేస్తానమని చెప్పారు. నేరుగా గ్రామాల్లో రెవెన్యూ గ్రామసభలు నిర్వహించి అక్కడిక్కడే రైతుల సమస్యలు పరిష్కరించేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్‌ చిట్టోజు రమేష్‌, డిప్యూటీ తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఆర్‌ఐలు వీరభద్రం, రవి, వీఆర్‌వోలు కృష్ణ, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles