‘పది’లో పసలేని ప్రభుత్వ పాఠశాలలు...

Thu,May 16, 2019 12:55 AM

-20 పాఠశాలల్లో 60 శాతంలోపు ఉత్తీర్ణత
-మసకబారుతున్న విద్యాశాఖ ప్రతిష్ట
కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, మే 15 : ఏ రంగంలో స్థిరపడాలన్నా... ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నా... ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు పాఠశాలల్లో అభ్యసించే విద్యపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యలో భాగంగా విద్యార్థులకు ఏటా సుమారు రూ.45 వేలు వెచ్చిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తోంది. విద్యతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతీ పాఠశాలలో సన్నబియ్యంతో భోజనం అందిస్తోంది. ప్రభుత్వం ఇంత చేస్తున్నా కొంతమంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్యను అందించడంలో విఫలమవుతున్నారు. దీంతో విద్యార్థులు పది పాస్‌ కావడానికి నానాతంటాలు పడుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా గత ఏడాది కంటే 13 శాతం ఉత్తీర్ణత పెరిగినప్పటికీ రాష్ట్రస్థాయి ఉత్తీర్ణతతో పోల్చుకుంటే జిల్లా వెనుకబడి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాలు ఉంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 29వ స్థానానికి పరిమితం కావడానికి ఈ కొన్ని పాఠశాలలు మాత్రమే కారణం. మిగతా పాఠశాలల్లో ఉపాధ్యాయులు తమ విధులను సక్రమంగా నిర్వహించి విద్యార్థుల ఉత్తీర్ణతలో తమదైన ముద్ర వేసుకున్నప్పటికీ ఈ కొన్ని పాఠశాలలు మాత్రం గతమూడు సంవత్సరాల నుంచి ఇదే పోకడ కొనసాగిస్తున్నారు.

ఉపాధ్యాయుల నిర్లక్ష్యం
- విద్యార్థులకు శాపం...
జిల్లాలో ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి ఉత్తీర్ణత శాతం అనుకున్న స్థాయిలో రాకపోవడానికి గత మూడేళ్లుగా కొన్ని పాఠశాలలు కారణం అవుతున్నాయి. నెలకు టంచన్‌గా వేలకు వేలు జీతాలు తీసుకుంటూ విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తూ తమవ్యక్తిగత పనులకు, ఇతర వ్యాపకాలకు సమయాన్ని కేటాయిస్తూ కేవలం ధనార్జన పైనే దృష్టి సారిస్తూ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఇందుకు ఉదాహరణే రామవరం నేతాజీ ఉన్నత పాఠశాల. కొత్తగూడెం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ పాఠశాలలో పట్టుమని పదిహేను మంది విద్యార్థులు కూడా పదవ తరగతిలో లేరు. ఆ పదిహేను మంది విద్యార్థులు సోమవారం వెలువడిన పది ఫలితాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేదు. విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనపై దృష్టి సారించకుండా కేవలం రాకపోకలకు మాత్రమే పరిమితమయ్యారు.

ఫలించని విద్యాశాఖ కృషి...
పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులకు అన్ని రకాల శిక్షణలు అందించేందుకు విద్యాశాఖ చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరైంది. 2018 విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే జిల్లా విద్యాశాఖ సిలబస్‌ను పూర్తిచేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంది. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి గ్రూపులుగా విభజించి వారిపై ప్రత్యేకశ్రద్ధ కనపర్చేందుకు ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసింది. ఏడాదిలో మూడు సార్లు సమీక్ష సమావేశాలను నిర్వహించి పదవ తరగతి ఫలితాలపై ప్రత్యేక శ్రద్ధ కనపర్చింది. గణితం, ఫిజిక్స్‌ బోధించే ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహించింది. విద్యార్థులకు సీసీఏ పద్ధతిలో బోధించడం ఎలానో ఉపాధ్యాయులకు అవగాహన తరగతులను ఏర్పాటు చేసింది. ముందస్తుగానే పదవ తరగతి విద్యార్థులకు ఆగష్టు నుంచి ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేసింది. ఒకపక్క స్పెషల్‌ టెస్టులు నిర్వహిస్తూనే ఎఫ్‌ఏ1, ఎఫ్‌ఏ2 పరీక్షల్లో విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంది. అయినప్పటికీ ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు అన్యాయం జరిగింది.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles