భూమి కోల్పోయిన రైతుకి నష్టపరిహారం చెల్లిస్తాం

Thu,May 16, 2019 12:54 AM

-భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్‌
పర్ణశాల, మే 15 : బ్రిడ్జి నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతుకి నష్టపరిహారం చెల్లిస్తామని భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్‌ అన్నారు. బుధవారం దుమ్ముగూడెం మండలంలో గౌరారం-కేలక్ష్మీపురం గ్రామాల మధ్య రూ.3కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని పీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మండలంలోని నల్లబల్లి గ్రామానికి చెందిన రైతు పూసం గణపతి తన స్థలంలో బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని దాన్ని ఆపాలని కోర్టులో కేసు వేశాడని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న స్థలాన్ని పరిశీలించినట్లు పీవో పేర్కొన్నారు. అనంతరం పీవో రెవెన్యూ, పంచాయతీ రాజ్‌శాఖ అధికారులతో భూ స్థలాన్ని సర్వే చేయించారు. ఆ సర్వేలో రైతుకు సంబంధించిన భూమి 30నుంచి 50సెంట్ల వరకు కోల్పోయిందని అధికారులు పీవోకు వివరించారు.

భూ సేకరణ చట్ట ప్రకారం భూమికి నష్టపరిహారం ఇప్పిస్తామని పీవో రైతుకు హామీ ఇచ్చారు. అనంతరం పీవో గుబ్బలమంగి ప్రాజెక్టును సందర్శించారు. ఆయకట్టు రైతుల ఫిర్యాదు మేరకు చెరువును మరింత లోతుగా తవ్వాలని అధికారులకు సూచించారు. రూ.5కోట్ల 25లక్షలతో గుబ్బలమంగి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని, ఏమైనా సమస్యలు తలెత్తితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని పీవో రైతులకు వివరించారు. ఇదిలా ఉండగా గౌరారం-లక్ష్మీపురం గ్రామాల మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు ఆగిపోయాయని, పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని గౌరారం గ్రామస్తులు, సర్పంచ్‌, ఎంపీటీసీలు పీవోకు విన్నవించారు. ఈ పర్యటనలో దుమ్ముగూడెం తహసీల్దార్‌ మంగీలాల్‌, సర్వేయర్‌ నర్సయ్య, పంచాయతీరాజ్‌ ఈఈ హిమామ్‌, డీఈ రాజేశ్వర్‌, జేఈ వంశీ, ఆర్‌అండ్‌బీశాఖ డీఈ హరిలాల్‌, ఇరిగేషన్‌ నీటిపారుదలశాఖ డీఈ మల్లిఖార్జున్‌రావు, ఏఈ రాజుసహాజ్‌, గౌరారం సర్పంచ్‌ సోడే జ్యోతి, ఎంపీటీసీ రేసు లక్ష్మీ, పెద్దనల్లబల్లి సర్పంచ్‌ శివాజీ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles