ప్రశాంతంగా పరిషత్‌ ఎన్నికలు

Wed,May 15, 2019 01:11 AM

భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో పరిషత్‌ ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా మూడు విడుతల్లో 21 జడ్పీటీసీ స్థానాలకు, 209 ఎంపీటీసీ స్థానాలకు ఎక్కడా చిన్న సంఘటన కూడా లేకుండా జిల్లా యంత్రాంగం ఎన్నికలు నిర్వహించింది. జిల్లా కలెక్టర్‌ రజత్‌కుమార్‌శైనీ మూడు విడుతల్లో జరిగిన ఎన్నికలను పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించి విజయవంతంగా పూర్తి చేశారు. 5,79,978 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు మూడు విడుతల్లో 1204 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చివరి విడుత ఆరు మండలాల్లోని 311 పోలింగ్‌ కేంద్రాల్లో మంగళవారం పోలింగ్‌ ప్రశాంతంగా విజయవంతంగా ముగిసింది. వరుస ఎన్నికలతో గ్రామీణ ఓటర్లలో చైతన్యం మరింత వెల్లివిరిసింది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాలకు అధిక సంఖ్యలో చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తొలిసారి నిర్వహించిన అన్ని విడుతల పరిషత్‌ ఎన్నికల్లో పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. పోలింగ్‌ సమయం ముగిసే వరకు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన వారిని ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. ఆళ్లపల్లి, చుంచుపల్లి, గుండాల, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్‌, ఇల్లెందు మండలాల్లోని ఆరు జడ్పీటీసీ, 56 ఎంపీటీసీ స్థానాలకు అధికారులు పోలింగ్‌ నిర్వహించారు.

నెమ్మదిగా పుంజుకున్న పోలింగ్‌
ఎన్నికల పోలింగ్‌ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైనప్పటికీ తొమ్మిది గంటల వరకు ఆరు మండలాల్లో 19.65 శాతం మాత్రమే ఓట్లు పోలవగా తొమ్మిది గంటల నుంచి 11 గంటల మధ్యలో 47.04 శాతం ఓట్లుపోలయ్యాయి. 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 60.40 శాతం ఓట్లు పోలయ్యాయి. మూడు గంటల నుంచిపోలింగ్‌ ప్రక్రియ ముగిసేంత వరకు 74.35 శాతం ఓట్లు పోలయ్యాయి. తొలుత మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ క్రమక్రమంగా పుంజుకుంది.
ఆరు మండలాల్లోని 311 కేంద్రాల్లో 74.35 శాతం పోలింగ్‌
జిల్లాలోని ఆరు మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 311 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పా టు చేసి ఓటర్లు స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆళ్లపల్లిలో 21, గుండాలలో 24, సుజాతనగర్‌లో 44, లక్ష్మీదేవిపల్లిలో 54, చుంచుపల్లిలో 75, ఇల్లెందులో 93 మొత్తం 311 కేంద్రాలలో 1,48,275 మంది ఓటర్లకు గాను 1,10,247 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. 335 మంది అధికారులు, 335 మంది సహాయ పోలింగ్‌ అధికారులు, 670 మంది ఇతర సిబ్బంది విధులు నిర్వహించారు.
స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరిన బ్యాలెట్‌ బాక్సులు
చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్‌ మండలాల్లోని బ్యాలెట్‌ బాక్సులను కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌కు, ఇల్లెందు, ఆళ్లపల్లి, గుండాల మండలాల్లోని బ్యాలెట్‌ బాక్సులను ట్రైబుల్‌ వెల్ఫేర్‌ బాలికల ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ సుదిమళ్లలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లకు పటిష్ట పోలీసు భద్రత మధ్య తరలించారు.

ఎన్నికల ప్రక్రియ విజయవంతం : కలెక్టర్‌
జిల్లాలో మూడు విడుతలుగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ విజయవంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్‌ రజత్‌కుమార్‌శైనీ తెలిపారు. జిల్లాలో ఉన్న 21 మండలాల్లో ఉన్న 21 జడ్పీటీసీ స్థానాలకు, 209 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడుతలుగా సజావుగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించామన్నారు. మూడు విడుతల్లో జరిగిన ఎన్నికలకు 5,79,978 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 1204 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎక్కడా అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూశామన్నారు. మొదటి విడుత ఈనెల 6న 443 మంది పోలింగ్‌ కేంద్రాల్లో ఏడు జడ్పీటీసీ స్థానాలకు, 71 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించగా 77.33 శాతం పోలింగ్‌ నమోదైందని, అదే విధంగా రెండవ విడుత ఈ నెల 10న ఎనిమిది జడ్పీటీసీ, 82 ఎంపీటీసీ స్థానాలకు 450 కేంద్రాలు ఏర్పాటు చేసి పోలిగ్‌ నిర్వహించగా 76.70 పోలింగ్‌ శాతం నమోదైందన్నారు. చివరి విడుతగా మంగళవారం ఆరు జడ్పీటీసీ, 56 ఎంపీటీసీ స్థానాలకు 311 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్‌ నిర్వహించగా 74.35 శాతం పోలింగ్‌ నమోదైందని కలెక్టర్‌ తెలిపారు. మూడు విడుతల్లో జరిగిన పోలింగ్‌ ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించిన ప్రజలకు, నిర్వహించిన వివిధ శాఖల ఉద్యోగులకు కలెక్టర్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles