వేసవిలో వన్యప్రాణులకు తీరిన దాహం

Wed,May 15, 2019 01:07 AM

-ఇల్లెందు సబ్‌ డివిజన్‌లో కృతిమ ఏర్పాట్లు
ఇల్లెందు నమస్తే తెలంగాణ, మే 14 : వేసవిని దృష్టిలో ఉంచుకుని అడవి జంతువుల దాహార్తిని తీర్చేందుకు అటవీశాఖాధికారులు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అడవుల్లో ప్రత్యేక నీటి కుంటలను ఏర్పాటు చేసి జంతువులకు తాగునీరు అందించేందుకు ప్రయత్నాయాలు మొదలుపెట్టిన విషయం అందరికి విధితమే. గతేడాది ప్రారంభించిన ప్రత్యేక నీటి చర్యలు సఫలీకృతమయ్యాయి. జంతువుల రక్షణతో పాటు వాటి దాహార్తిని తీర్చేందుకు అధికారులు తీసుకుంటున్న నిర్ణయం ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుంది. వేసవి కారణంగా అడవుల్లో వాగులు, వంకలు ఎండిపోవడం సహజమే. ఏప్రిల్‌, మేలో అడవి జంతువులు దాహార్తితో అలమటించడం నిజం. దీంతో అటవీశాఖాధికారులు వాటి దాహార్తిని తీర్చేందుకు కీకారణ్యంలో నీటి గోళాలు, కుంటలు, చెలిమలు ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జంతువుల కోసం అడవుల్లో ప్రతీ 250 మీటర్ల చొప్పున కుంటలు, చెలిమలు ఏర్పాటు చేస్తున్నారు. ఇల్లెందు సబ్‌ డివిజన్‌లో 114 నీటి గోళాలు(సిమెంటు రింగులు), పది చెలిమలు, పదిహేను కుంటలు, ఒక సోలార్‌ పంపు ఏర్పాటు చేశారు. నీటి గోళాలను ప్రతీ రోజు ట్యాంకర్ల ద్వారా నింపుతున్నారు.

వర్షాధారపు నీటి ఆధారంగా చెలిమలు, కుంటలను ఏర్పాటు చేశారు. ఇల్లెందు సబ్‌ డివిజన్లో జంతువుల గణనను బట్టి నీటి కృతిమ చర్యలను చేపట్టారు. వాగులు, వంకల వద్ద జంతువుల పాదముద్రలను గుర్తించి వాటి సంఖ్యను బట్టి అడవిలో నీటి గోళాలు, కుంటలు, చెలిమలను ఏర్పాటు చేశారు. 360 రోజులు నిలకడగా పారే నీరు, నిలిచివున్న నీరు వద్ద వచ్చే జంతువుల ఆధారంగా పాదముద్రలను గుర్తిస్తారు. అవి ఎంత దూరం నుండి వస్తున్నాయనేది తెలుసుకుని వచ్చే ప్రాంతంలో గోళాలు, చెలిమలు, కుంటలను ఏర్పాటు చేస్తున్నారు. ఇల్లెందు రేంజ్‌ పూసపల్లి వద్ద సోలార్‌ పంపులు ఏర్పాటు చేశారు. పూసపల్లి, పూబెల్లి, కొమరారం, పోలారం, మాణిక్యారం,ఆళ్ళపల్లి మండలం అడవి రామవరం ప్రాంతాలలో నీటి గోళాలు, కుంటలు, చెలిమలను ఏర్పాటు చేశారు. ఫలితంగా అటవీ జంతువుల దప్పికను తీర్చినట్లయింది. ఇల్లెందు సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఇల్లెందు, కొమరారం రేంజ్‌లలో అటవీ జంతువుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా దున్నలు, కొండగొర్రెలు, దుప్పులు, పందులు వృద్ధి చెందినట్లు తెలిసింది.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles