తాగునీటి సమస్యను పరిష్కరించండి..

Tue,May 14, 2019 04:50 AM

-మిషన్ భగీరథ పనులను పూర్తి చేయండి
-గిరిజన గ్రామాల్లో నీటి సమస్యలు ఉండొద్దు..
-వాటర్ ట్యాంకులకు మరమ్మతులు చేయండి
-ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆదేశం
కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: గుండాల, ఆళ్లపల్లి, పినపాక వంటి మారుమూల మండలాల్లో తాగునీటి సమస్యలుంటే తక్షణం పరిష్కరించాలని కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో తాగునీటి సరఫరా అధికారులతో మిషన్ భగీరథ, తాగునీటి సౌకర్యాలు, బోర్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు మిషన్ భగీరథ పనులు వివరిస్తూ 763 కొత్త ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణం చేపట్టి 533 పూర్తి చేశామన్నారు. అలాగే పాత ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులు 672 ఉండగా 521 వాటికి మరమ్మతులు పూర్తి చేశామని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల ఆళ్లపల్లి మండలాన్ని తాను సందర్శించినప్పుడు మంచినీటి సమస్య ఉన్నట్లు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. వీటిపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వివరణ ఇస్తూ పైప్‌లైన్ పనిచేయకపోవడంతో కొత్త పప్‌లైన్‌ను వేసి నెల రోజుల్లోగా నీరందిస్తామన్నారు. అంతేకాకుండా వ్యవసాయ బోర్లు వేయడంతో గ్రామంలోని బోర్లలోని నీటి ఊట తగ్గిపోతోందని, సోలార్ పంపులతో తాగునీరు సరిపోవడం లేదని అన్నారు.

కలెక్టర్ స్పందిస్తూ గ్రామ పంచాయతీల పరిధిలోని బోర్లను తక్షణం మరమ్మతులు చేయించాలని, వాటికయ్యే మరమ్మతులకు నిధులు చెల్లిస్తామన్నారు. గొత్తికోయ హ్యాబిటేషన్లకు అవసరమైతే ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేయాలన్నారు. పెద్ద వెంకటాపురంలోని బోర్లను రీబోర్ చేయించి ప్రజల ఇబ్బందులు తొలగించాలన్నారు. గ్రామాల్లోని ప్రైవేటు బోర్ల ద్వారా కూడా తాగునీరందించాలన్నారు. సాధ్యమైనంత వరకు మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలని, అత్యధికంగా బల్క్ వాటర్ గ్రామాలకు సరఫరా చేసేందుకు రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ సదాశివరావు, డీఈ నళిని, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

మరుగుదొడ్లు, అంగన్‌వాడీ కేంద్రాల ప్రగతి పెరగాలి..
జిల్లాలో మరుగుదొడ్లు, అంగన్‌వాడీ కేంద్రాల ప్రగతి లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ నివేదించారు. సోమవారం హైదరాబాద్ నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి జిల్లాలో నిర్మిస్తున్న మరుగుదొడ్లు, అంగన్‌వాడీ భవనాలపై కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరుగుదొడ్ల ప్రగతిని వివరించారు. మొత్తం 91 వేల మరుగుదొడ్లు చేపట్టి 40వేలు పూర్తి చేశామన్నారు. ప్రతీ రోజు 40 మరుగుదొడ్లు నిర్మిస్తూ అందుకు కావాల్సిన సామగ్రిని కూడా అందజేస్తున్నామన్నారు. మూడు నెలల్లో లక్ష్యాలు పూర్తవుతాయని నివేదించగా జూన్ రెండవ తేదీ నాటికి మరుగుదొడ్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలపై నివేదిస్తూ జిల్లాలో 2060 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని, వీటికి గాను 333 ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ భవనాలు ఉన్నాయని, 369 పాఠశాలల్లో కొనసాగుతున్నట్లు వివరించారు. ప్రతీ అంగన్‌వాడీ కేంద్రంలో ఐదు నుంచి 20 మంది పిల్లలు ఉంటున్నారన్నారు. అంగన్‌వాడీ కేంద్రంలోనే ఎల్‌కేజీ, యూకేజీ నిర్వహిస్తే ఒకటో తరగతిలో అదే స్కూల్‌లో విద్యనభ్యసించేందుకు వీలుంటుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ పీవో వీపీగౌతమ్, డీఆర్‌డీఏ పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, పీఆర్‌ఈఈ సుధాకర్‌లు పాల్గొన్నారు.

ప్రజల సమస్యలను తప్పని సరిగా పరిష్కరిస్తాం..ప్రజల సమస్యలను సంబంధిత అధికారులకు పంపి తప్పని సరిగా పరిష్కరిస్తామని కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌డేలో ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. పలువురు ఛెందించిన వినతిపత్రాలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.

పారిశుధ్యంపై ప్రత్యేక
గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ గ్రామ పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం జిల్లా పంచాయతీ అధికారికి గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుధ్య కార్యక్రమాల పర్యవేక్షణకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రతీ వారంలో మూడు రోజుల పాటు ఏడు గంటలకు ఆయా గ్రామాల్లో పర్యటించి పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షణ చేయడంతో పాటు పరిసరాలు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు వారంలో మూడురోజుల పాటు ఉదయం ఏడు గంటలకు గ్రామాల్లో పర్యటించే విధంగా ప్రొసీడింగ్ జారీ చేయాలని డీపీవోకు సూచించారు.

గ్రామ పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, అందుకు తగు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రానున్న సీజన్‌లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున గ్రామాల్లో పేరుకుపోయిన వ్యర్థాలకు ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో వ్యర్థాలకు ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో వ్యర్థాలు పేరుకుపోవడం వలన క్రిమికీటకాలు వ్యాప్తి చెంది దుర్వాసనలు రావడంతో పాటు వర్షాకాలంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల నుంచి వచ్చే వ్యర్థాలను నిర్దేశించిన డంపింగ్ యార్డుల్లో మాత్రమే వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles