ముగిసిన తుది విడత ప్రచారం

Mon,May 13, 2019 03:21 AM

- 91 ఎంపీటీసీ, 7 జడ్పీటీసీ స్థానాలకు రేపు ఎన్నికలు
- మండల కేంద్రాలకు చేరిన ఎన్నికల సామగ్రి
- నేడు మండల కేంద్రాల్లో సిబ్బందికి సామగ్రి పంపిణీ
మామిళ్లగూడెం, మే 12: జిల్లా, మండల ప్రజా పరిషత్ మూడోవ విడత ఎన్నికలకు ఆదివారంతో ప్రచారం ముగిసింది. మూడోవ విడత స్థానిక సంస్థ ఎన్నికలకు పది రోజుల పాటు అభ్యర్థులు ఆయా గ్రామాలు, మండల పరిధిలో హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రత్యేకంగా కలిసి తమను గెలిపించేందుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. గెలిచిన తరువాత గ్రామాల అభివృద్ధికి పని చేస్తానని ఓటర్లకు హామీలిచ్చారు. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు తమ అనుకూలమైనటువంటి వారి వద్ద ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు తెర వెనుక రాజకీయాలను ప్రారంభించారు. మూడోవ విడత ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పత్రాలను అధికారులు ఇప్పటికే మండల కేంద్రాలకు తరలించారు. ఎంపీటీసీ స్థానికి గులాబీ రంగు బ్యాలెట్ పత్రం, జడ్పీటీసీ స్థానికి తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను వినియోగించనున్నారు. మూడోవ విడత ఎన్నికల్లో వైరా, కొణిజర్ల, రఘునాథపాలెం, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో 92 ఎంపీటీసీ, ఏడు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ విడతలో ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం ఎంపీటీసీ స్థానం టీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవమయింది. 91 ఎంపీటీసీ స్థానాలకు 259 మంది అభ్యర్థులు తమ అదృష్టాలను పరీక్షించుకోనున్నారు. ఏడు జడ్పీటీసీ స్థానాలకు 30 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. 14వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పోలీస్ అధికారులు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. బ్యాలెట్ బాక్సులు మండల కేంద్రాలలోని స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. ఎన్నికల సిబ్బందికి 13వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆయా మండల కేంద్రాలలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయనున్నారు. ఎన్నికల విధులకు హాజరుకానున్న ఉద్యోగులు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు.

78
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles