సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

Mon,May 13, 2019 03:18 AM

-పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్
-ఖమ్మంరూరల్, వైరా, స్పెషల్‌బ్రాంచ్ ఏసీపీలతో సమీక్ష సమావేశం
ఖమ్మం క్రైం, మే 12 : ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో జరగబోయే మూడవ దశ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిసారించాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 14న రఘునాథపాలెం, చింతకాని, కొణిజర్ల, వైరా, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో జరగబోయే మూడవ దశ పోలింగ్‌పై ఆయా సబ్‌డివిజన్ ఏసీపీలతో సమీక్ష సమావేశం ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా మూడవదశ పోలింగ్ కేంద్రాలపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూ పోలింగ్ సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలు మరింత కష్టపడి పనిచేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు ఆటంకాలు కలిగించే ట్రబుల్ మాంగర్స్, రౌడీ షీటర్లపై నిఘా పెట్టాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళికలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్ అధికారులు పోలింగ్ కేంద్రాలలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన రెండు
దఫాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అదే తరహాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారిపట్ల కఠినమైన చర్యలు తీసుకోడానికి వెనుకాడొద్దని ఆదేశించారు. ఫ్ల్లయింగ్ స్కాడ్, రూట్ మోబైల్స్, స్టాటిక్ సర్వేలైన్స్ సిబ్బంది వారి యొక్క విధులలో పాటించవలసిన నియమాలపై రోల్ క్లారిటీ ఉండాలన్నారు. పోలింగ్, పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలింగ్ బూత్‌లను ఎస్‌ఐలు విధిగా సందర్శించాలని ఆదేశించారు. పోలింగ్ బూత్ పరిసరాలు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన విషయాలపై సంబంధిత ఎలక్షన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ మురళీధర్, ట్రైనీ ఐపీఎస్ వినీత్, ఏసీపీలు సత్యనారాయణ, రామోజీ రమేష్, ప్రసన్న కుమార్, సీఐలు రమాకాంత్, వేణుమాదవ్, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles