రాములోరికి పట్టాభిషేకం..!

Sun,May 12, 2019 12:25 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలోని బేడా మండపంలో రాములోరి పట్టాభిషేకం శనివారం వైభవంగా నిర్వహించారు. పుష్యమీ నక్షత్రాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ వేడుకలో ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యఃవచనం జరిపారు. రాములోరికి రాజదండం, రాజముద్రిక, చక్రం తదితర రాజలాంఛనాలతో అందంగా అలంకరింప చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి సమస్త నదీ తీర్ధాలతో సంప్రోక్షణ నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రామయ్యకు నిత్యకల్యాణం
పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయంలో శనివారం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకం, ఆరాధన, అర్చన, సేవాకాలం తదితర పూజలు గావించారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు రామాలయానికి చేరుకున్నారు. రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియాన్ని సందర్శించారు. సీతమ్మవారి నగలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం బేడా మండపంలో రామయ్యస్వామికి నిత్యకల్యాణం నిర్వహించారు.

రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదు...
దమ్మపేట: ఎప్పటికైనా రాజకీయం, పదవులనేవి శాశ్వతం కాదని ప్రజల అభిమానంతోనే నేతలు ముందుకు సాగాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం దమ్మపేట మండలంలో ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసిన అభ్యర్థులు మండలంలోని గండుగులపల్లిలోగల తుమ్మల నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి తుమ్మల మాట్లాడుతూ ఎప్పటికైనా ప్రజల ఆశీర్వాదం అవసరమని, వారికి మనం చేసే మంచి పనులే మనల్ని గెలిపించేందుకు వారి సహాయ, సహకారాలు అందుతాయని, నేతల మంచితనానికి ప్రజల ఆశీర్వాదమే బలమన్నారు. భవిష్యత్‌లో మండలాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ నిధులతో పాటు మంచి నేతగా ప్రజల్లో నిలిచిపోవాలని అప్పుడే ప్రజాభిమానం మనకు దక్కుతుందని ప్రతి నాయకుడు గుర్తుంచుకోవాలన్నారు. ఏ స్థాయిలో ఉన్నా ప్రజలను మాత్రం మరిచిపోవద్దని, వారే మనకు రాజకీయ భిక్ష పెట్టిన దేవుళ్లన్నారు. మాజీ మంత్రి తుమ్మలను కలిసిన వారిలో డీసీసీబీ డైరెక్టర్ ఆలపాటి రామచంద్రప్రసాద్, జడ్పీటీసీ అభ్యర్ధి పైడి వెంకటేశ్వరరావు, మండల రైతు సమన్వయ సమితి సభ్యులు దొడ్డాకుల రాజేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ అభ్యర్ధులతో పాటు నాయకులు కోటగిరి బుజ్జిబాబు, తుమ్మల శేషు, కాసాని నాగప్రసాద్, ఎర్రా వసంతరావు, ఎల్లిన రాఘవరావు తదితరులు ఉన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles