సమరోత్సాహం

Wed,April 24, 2019 12:53 AM

-పరిషత్ పోరులో గులాబీదే జోరు..
-కదనరంగంలోకి టీఆర్‌ఎస్ శ్రేణులు
-గెలుపే లక్ష్యంగా సన్నాహాక సమావేశాలు
-నైరాశ్యంలో కాంగ్రెస్ శ్రేణులు
-ఐక్యతారాగం వినిపిస్తున్న వామపక్షాలు
-తెదేపాకు నాయకులు కరువు
ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో మండల, జిల్లా ప్రజా పరిషత్‌ల ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు ఏకపక్షమే కానున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల తరువాత జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో ప్రధాన రాజకీయ ప్రతిపక్ష పార్టీలో స్పందన కనిపించడం లేదు. ఇప్పటివరకూ జరిగిన శాసనసభ, గ్రామ పంచాయతీ, పార్లమెంటు ఎన్నికలలో ప్రతి పక్షాలు పోటీ చేసినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా పార్టీలు అభ్యర్థులను పోటీ చేయించడం కష్టంగానే మారింది. వరుస ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టిస్తోంది. దీంతో ఢీలా పడుతున్న ప్రతిపక్ష పార్టీలు పోటీకి ఆసక్తి చూపించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అన్నీ సిద్ధంగా ఉన్నాయని గత పది రోజుల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటిస్తున్నప్పటికీ ప్రధాన ప్రతిపక్ష పార్టీలలో స్పందన కనిపించడం లేదు. గత శాసన సభ ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి గట్టెక్కిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించారు.

ఆ తరువాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు ఏక పక్షంగా పట్టం కట్టారనే చెప్పవచ్చు. పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని పలు నిఘా సంస్థలు ఇప్పటికే నివేధికలు అందించాయి. జిల్లాలో రాజకీయ పండితులు సైతం పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందని ప్రకటిస్తున్నారు. దీంతో వరుస ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయాల పరంపరా కొనసాగిస్తుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో టీఆర్‌ఎస్ ముందస్తుగానే స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేసింది. జిల్లాలో ప్రస్థుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు ఏక పక్షంగా కొనసాగుతాయనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. జిల్లాలో ప్రధాన ప్రతిపక్షాలు ఇంకా పోటీకి అభ్యర్థుల వెతుకులాట ప్రారంభం కాలేదు. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలకు ప్రకటన రావడం, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్, వామపక్షాలు, తెలుగుదేశం పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. టీఆర్‌ఎస్ మాత్రం వారం రోజుల నుంచే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు శ్రేణులను అప్రమత్తం చేసింది. దీంతో ఇప్పటికే జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం టీఆర్‌ఎస్ కార్యాలయం, క్యాడర్‌లో కనిపిస్తుంది. ప్రతి పక్ష పార్టీల కార్యాలయాలు బోసి పోయి దుమ్ము కొట్టుకుంటున్నాయి.

ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్ శ్రేణులు...
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్ శ్రేణులు దిగి పనులు ప్రారంభించాయి. టీఆర్‌ఎస్ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మార్గదర్శకంలో టీఆర్‌ఎస్ కార్యనిర్వాహణాధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు నాయకత్వంలో జిల్లాకు స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులుగా శ్రావణ్‌కుమార్‌రెడ్డిని నియమించారు. దీంతో టీఆర్‌ఎస్ ఎన్నికల పరిశీలకులుగా నియామకం పొందిన శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే జిల్లాలో నియోజకవవర్గాల వారీగా ప్రధాన నాయకులతో సమావేశాలు నిర్వహించారు. మొదటి విడుత ఎన్నికలకు నామినేషన్ వేయడానికి సోమవారం ఒక్క రోజే సమయం ఉన్నందున నియోజకవర్గాలలో జిల్లా పరిషత్‌కు జడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న అభ్యర్థుల వివరాలు సేకరించి తుది కసరత్తును ప్రారంభించి టీఆర్‌ఎస్ అధినేతకు పంపించనున్నారు. అక్కడ నుంచి అనుమతి లభించిన వెంటనే జడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తారు. ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎంపిక మాత్రం ప్రతి మండలంలో మండల, నియోజకవర్గ, జిల్లా నాయకులతో సమన్వయ కమిటీలో నిర్ణయం తీసుకుని ఎంపీటీసీ అభ్యర్థుల జాబితాలను ప్రకటించనున్నారు.

రాష్ట్ర ఎన్నికల పరిశీలకులతో పాటు జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్, సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎమ్మెల్యేలు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, కొండబాల కోటేశ్వరరావులతో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జీలు పిడమర్తి రవి, లింగాల కమల్‌రాజు, బొమ్మెర రామ్మూర్తిలతో సమన్వయంగా గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ప్రారంభించారు. మొదటి విడుత ఎన్నికలు జరగనున్న ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ముదిగొండ, కామేపల్లి, సింగరేణి మండలాల్లో ప్రధాన నాయకులుతో సమావేశాలు పూర్తిచేశారు. మంగళవారం అన్ని మండలాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించారు. అనంతరం బుధవారం అన్ని మండలాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేసే విధంగా కసరత్తు చేస్తున్నారు.

కాంగ్రెసులో అలుముకున్న నైరాశ్యం...
స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం నైరాశ్యం అలుముకుంది. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి జిల్లాలో హడావిడి చేసిన రేణుకా చౌదరి నాయకులకు, కార్యకర్తలకు ముఖం చూపించడం లేదు. జిల్లా కాంగ్రెస్ నుంచి జిల్లా అధ్యక్షులు సైతం ఎన్నికల్లో పార్టీ పోటీకి సిద్ధం అనే సంకేతాలు ఇవ్వకపోవడంతో ఆసక్తి ఉన్న నాయకులు డైలమాలోపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి ముందస్తు సమావేశాలు, చర్చలు జరగలేదు. ప్రధాన కాంగ్రెస్ నాయకులు ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు కనిపించకుండా పోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో గోసి పెట్టి జబ్బలు చరిచిన నాయకులు ఆ తరువాత జరిగిన గ్రామపంచాయతీ, పార్లమెంటు ఎన్నికల్లో కనుమరుగయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల లేదా అనే స్పష్టత రాకపోవడంతో కాంగ్రెసు నాయకులు దిక్కులు చూస్తున్నారు.

ఐక్యతారాగం అందుకున్న వామపక్షాలు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు ప్రధాన వామపక్షాలు సీపీఎం, సీపీఐలు మరో సారి ఐక్యతా రాగం అందుకున్నాయి. జిల్లాలో సీపీఐ ఎంల్ న్యూడెమోక్రసీలో రెండు వర్గాలు ఉన్నప్పటికీ సీపీఐ, సీపీఎంతో అవి ఎన్నికల పొత్తుకు ఆసక్తి చూపడం లేదు. కేవలం రెండు వామ పక్ష పార్టీలు మాత్రమే ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించాయి. కానీ మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం అయినప్పటికీ ఇప్పటి వరకు ఆ రెండు పార్టీలు కలిసి సమావేశం నిర్వహించి కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయలేదు. కానీ ప్రతికా ప్రకటనల ద్వారా మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించాయి. అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపకంలోనూ రెండు పార్టీలలో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో మొదటి దశ ఎన్నికల్లో వామ పక్షాల పోటీ ఇంకా ఖరారు కాలేదనే చెప్పవచ్చు.

తెలుగుదేశానికి కార్యకర్తలు, నాయకుల కరవు
జిల్లాలో తెలుగుదేశం పార్టీది ఒక విచిత్ర సమస్య. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ పార్టీ ఇక్కడ అవసరం లేదని ప్రజలు వారికి చెంపలు వాయించి చెప్పిన్పటికీ ఇంకా తెలంగాణ ప్రజలపై ఆంధ్రా పార్టీ పెత్తనం చూపించాలని ప్రయత్నిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ పూర్తిస్థాయిలో కనుమరుగైనప్పటికీ ఇంకా ఆంద్రా పెద్దల మూతులు నాకే నాయకులు ఇక్కడ ఉండటంతో ఆ పార్టీ జిల్లాలో అక్కడక్కడ ప్రకటనలతో కాలం వెల్లదీస్తున్నారు. జిల్లాల్లో ఆంధ్రా వారసత్వం ఉన్న వారు మాత్రమే పార్టీలో నాయకులుగా చలామణి అవుతున్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

57
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles