కొనసాగుతున్న రైతు సమగ్ర సర్వే

Wed,April 24, 2019 12:48 AM

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 23: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సర్వే కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లాలో పట్టాదారుపాస్ పుస్తకాలు ఉన్న రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చేందుకు వ్యవసాయ శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఈ నెల ఒకటో తేదీన ప్రారంభించి మే 20వతేదీ కల్లా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మండల స్థాయిలో ఏఈవోలు కొత్తగా వచ్చిన 40 రకాల ఫార్మ్యాట్‌తో సర్వేను కొనసాగిస్తున్నారు. పార్ట్-ఏలో పట్టాదారు పాస్‌పుస్తకం నంబర్, రైతు పేరు, ఆధార్ నంబర్, తండ్రి, ధరణి పోర్టల్‌నుంచి తీసుకున్న ఆధార్, ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, సామాజిక స్థితి, పొలం విస్తీర్ణం, సాగుకు యోగ్యమైన భూమా కాదా, రైతు పొలంలో లోతు స్వభా వం, ఖరీఫ్ సీజన్‌లో పంట వివరాలు, వేసవిలో పంట వివరాలు, వేసవిలో కూరగాయల సాగు, తోటల విస్తీర్ణం, 2019 వానాకాలం నాటికి ప్రతిపాదించిన పంటలు, పంటబీమా, దగ్గరలో ఉన్న వారపు సంతలు, కుటుంబ సభ్యులు స్వయం సహాయక సంఘాల గ్రూపులో ఉన్నారా, లేదా, రైతుకు చెరవాణి ఉందా, లేదా, సేంద్రీయ వ్యవసాయం గురించి వారికి తెలుసా అనే అంశాలను ఈ ఫార్మాట్‌లో పొందుపర్చారు. జిల్లాలోని 23 మండలాల్లో సంబంధిత ఏఈవోలు ఈ సేకరణ చేపట్టారు. ప్రతీ రైతు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చడంతో పాటు వారి ఆధార్ వివరాలను కూడా రైతు డిక్లరేషన్‌తోటే తీసుకొని పాస్‌బుక్ వివరాలను నమోదు చేస్తున్నారు.

గిట్టుబాటు ధర కోసం ప్రాసెసింగ్ యూనిట్లు
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేందుకు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు వ్యవసాయ సమాయత్తమవుతోంది. రైతులు ఎంత పంట పండిస్తున్నారు, మన అవసరాల వినియోగం, ఎగుమతి, దిగుమతుల వివరాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు అధికారులు శ్రీకారం చుడుతున్నారు. వచ్చే ఖరీఫ్ పంటలు పూర్తికాగానే ఈ కార్యాచరణ చేపట్టేందుకు సర్వే చేస్తున్నారు. ఇందుకోసమే రైతు సమగ్ర సర్వేచేపట్టారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడంతో పాటు ఎక్కడా నష్టం జరగకుండా ప్రయ త్నం చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ కమిషన్, ప్రిన్సిపుల్ సెక్రటరీలు ఇందుకు సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు తెలిపారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన ఈ సర్వే మే 15వ తేదీ కల్లా పూర్తి కావాలని ఆదేశించారు.

జిల్లాలో 97వేల మంది రైతుల వివరాలు సేకరణ లక్ష్యం
పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్న రైతులు జిల్లాలో 97 వేల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో పాస్‌బుక్‌లు పంపిణీ చేసిన రైతుల వివరాలను మాత్రమే ఈ సర్వేలో సేకరించేందుకు వ్యవసాయశాఖ నిర్ణయించింది. కొంతమందికి పట్టాదారు పాస్‌పుస్తకాలు రావాల్సి ఉండగా అవి వచ్చిన తరువాత రైతుల వివరాలను ఆన్‌లైన్ చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 97 వేల మంది రైతుల వివరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 23,640 మంది రైతుల వివరాలను ఆన్‌లైన్ చేశారు. మే 20 కల్లా మిగిలిన రైతుల వివరాలను పూర్తి చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు.

119
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles