టీఎస్ -ఐపాస్ పథకం అద్భుతం..!

Wed,April 24, 2019 12:48 AM

-ప్రభుత్వ చొరవతో పారిశ్రామిక వేత్తలుగా యువత
-స్వయం ఉపాధితో ఆర్థికంగా ముందడుగు
-ప్రభుత్వం, పరిశ్రమలశాఖ ప్రోత్సాహంతో రాణింపు
-నేటి వరకు 380 యూనిట్లకు రూ.35కోట్లు మంజూరు
-వెయ్యిమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు
కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 23: ఒక పరిశ్రమ నెలకొల్పాలంటే సవాలక్ష ఆంక్షలు, అనుమతులు, నియమ, నిబంధనల కోసం నెలల తరబడి వేచిచూడాల్సిన వచ్చేది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30రోజుల్లోనే పరిశ్రమలకు కావాల్సిన అన్నీ రకాల అనుమతులు ఇచ్చి సులభతర వాణిజ్య విధానానికి తెరలేపింది. ధృవీకరణపత్రాలన్నీ సక్రమంగా ఉంటే నెలరోజుల్లోనే అనుమతులను ఇచ్చి పరిశ్రమలను నెలకొల్పేందుకు టీఎస్-ఐపాస్‌ను ఏర్పాటు చేసింది. ఇలా చట్టబద్దమైన హక్కును కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలో మరెక్కడ ఇటువంటి విధానం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇతర రాష్ర్టాల ఎంటర్‌ప్రెన్యూర్‌లు, దేశ, విదేశాల పారిశ్రామికవేత్తలు టీఎస్-ఐపాస్‌లో తమ పేర్లను నమోదు చేసుకొని కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

పారిశ్రామికవేత్తలుగా యువకులు
దేశ, విదేశ పారిశ్రామికవేత్తలకు కంపెనీలు నెలకొల్పేందుకు అవకాశాలు ఇస్తూనే మరోవైపు రాష్ట్రంలోని యువత కోసం పారిశ్రామికరంగంలో సైతం రిజర్వేషన్ల ప్రాతిపదికన వారికి ప్రొత్సహించేందుకు టీ-ఐడియా, టీ-ప్రైడ్ లాంటి పథకాలు ప్రవేశపెట్టింది. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నెలకొల్పేవారికి 75లక్షల లోపు ఉన్న పరిశ్రమలకు 35శాతం సబ్సిడీ, మహిళా పారిశ్రామికవేత్తలు నెలకొల్పేవారికి 10లక్షలలోపు ఉంటే 10శాతం రాయితీ, పరిశ్రమల కోసం కొనుగోలు చేసే భూములు, లీజు, భవనాలు, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీపై 100శాతం తిరిగి రాయితీ పొందే అవకాశాన్ని కల్పించింది. విద్యుత్, సేల్స్ టాక్స్, బ్యాంకు నుంచి తీసుకున్న రుణంపై వడ్డీ చెల్లింపు తదితర వాటిపై సైతం ప్రత్యేక రాయితీలను అందిస్తుంది.

ఎంట్రప్రెన్యూర్‌లుగా ఎదిగిన యువత
తెలంగాణ ప్రభుత్వం, జిల్లా పరిశ్రమలశాఖ సహకారంతో ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని అనేకమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లోని యువత ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా ఎదిగారు. ఈపథకాలను సద్వినియోగం చేసుకొని తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా పేపర్ కన్వర్షన్ కంపెనీ, ఎగ్ ట్రేలు, ైఫ్లెయాష్ బ్రిక్స్, రైస్‌మిల్స్, అట్టల ఫ్యాక్టరీ, రబ్బర్ టైర్ రీ ప్రాసెసింగ్ యూనిట్, ఆక్సిజన్ ప్లాంట్స్, ట్రాన్స్‌పోర్టు కస్టమర్ ఎక్విప్‌మెంట్, ఎర్త్‌మూవర్స్, ప్యాకింగ్ కంపెనీ, వాషింగ్ పౌడర్ తదితర సంస్థల నెలకొల్పి రాణిస్తున్నారు. వాటి కోసం రుణాలు తీసుకొని విజయవంతంగా నిర్వహిస్తూ, కంపెనీలో మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు.

380యూనిట్లు మంజూరు, వెయ్యిమందికి ఉపాధి
జిల్లాలో ఇప్పటి వరకు చిన్న, పెద్ద కంపెనీలన్నీ దాదాపుగా 380యూనిట్లను ఏర్పాటు చేశారు. బీసీ, మైనారిటీ, ఇతరత్రా వర్గాల వారు, ఎస్సీ, ఎస్టీలు యూనిట్లు ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు చేసుకోగా మొత్తంగా రాష్ట్రస్థాయిలో రూ.25లక్షలకు పైగా నిధులతో ఏర్పాటుచేసే యూనిట్లకు రాష్ట్రస్థాయిలో అనుమతులు పొందాలి. ఇలా ఈ అనుమతుల కోసం బీసీ, మైనారిటీ, ఇతరులు 76, ఎస్సీలు 75, ఎస్టీలు 65 మొత్తం 216యూనిట్లు, ఇక రూ.25లక్షల లోపు రుణాలతో ఏర్పాటు చేసే యూనిట్లకు జిల్లా స్థాయిలో ఎస్సీలు 65, ఎస్టీలు 99మంది యూనిట్లకు దరఖాస్తు చేసుకోగా అన్నీ యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. సుమారు రూ.35కోట్ల నిధులను దరఖాస్తుదారులకు రుణాలను మంజూరు చేసింది. దీంతో దాదాపు వెయ్యిమందికి పైగా ఈ యూనిట్ల ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు.

పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యం :
ప్రభుత్వం పారదర్శకంగా అనుమతులు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తోంది. పరిశ్రమలు నెలకొల్పాలనుకునే వారు ఆన్‌లైన్‌లోనే తమ ప్రాజెక్టు రిపోర్టును, ప్రభుత్వం అడిగిన ధ్రువీకరణ పత్రాలు అందజేస్తే అన్నీ సక్రమంగా ఉంటే నెలరోజుల్లోనే అనుమతులు వస్తాయి. ప్రభుత్వం టీఎస్-ఐపాస్ రూపొందించి పెద్ద, చిన్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది. పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు ఉత్సాహం ఉన్నవారు ఈ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మరికొంత మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రభుత్వం, పరిశ్రమలశాఖ ద్వారా తాము అన్నీ రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాము. యువత ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఎంట్రప్రెన్యూర్‌లుగా రాణించాలి.
- టీ సీతారాంనాయక్ జిల్లా పరిశ్రమలశాఖ అడిషనల్ డైరెక్టర్

36
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles