జడ్పీపీఠంపై గులాబీ గురి..!

Mon,April 22, 2019 11:39 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికలకు టీఆర్‌ఎస్ శ్రేణులు సమాయత్తమయ్యాయి. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవడంతో గ్రామాల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అసెంబ్లీ, పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు వరుసగా రావడంతో విజయవంతంగా పాల్గొన్న టీఆర్‌ఎస్ శ్రేణులు పరిషత్ పోరుకు రెట్టించిన ఉత్సాహంతో సంసిద్ధమవుతున్నారు. ఈ నెల 20న పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పల్లెల్లో పరిషత్ సంగ్రామ సందడి నెలకొంది. ఈ ఎన్నికలు పార్టీ గుర్తుపై పోటీ చేసే ఎన్నికలు కావడం, వరుస ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు విజయఢంకా మోగిస్తుండటంతో పల్లెల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ టిక్కెట్లు ఆశించేవారు భారీగా పెరిగారు. ఒక్కో గ్రామం నుంచి ముగ్గురు నుంచి పది మంది వరకు ఆశావాహులు టిక్కెట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తున్నారు. జిల్లాలో మూడు విడతలుగా జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యారు. తొలి విడతలో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఏడు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం, ములకలపల్లి, పాల్వంచ, టేకులపల్లి, మండలాల్లో ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. బూర్గంపాడు మండలంలో ఎంపీటీసీల ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున కేవలం ఒక జడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఎన్నిక జరగనుంది. అశ్వాపురంలో 12 ఎంపీటీసీలు, చర్లలో 12, దుమ్ముగూడెంలో 13, పాల్వంచలో 10, ములకలపల్లిలో 10 టేకులపల్లిలో 14 ఎంపీటీసీలతో పాటు ఏడు మండలాలల్లోని (బూర్గంపాడు జడ్పీటీసీ స్థానం) జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

గెలిచే అభ్యర్థులకే టిక్కెట్లు
వరుస ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తుండటంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదు నియోజకవర్గాల్లో భారీస్థాయిలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో పాటు, గత ఎన్నికల్లో కంటే టీఆర్‌ఎస్ పార్టీ బలం మరింత పెరగడం అధికార పార్టీ తరుపున పోటీ చేసేందుకు పలువురు టిక్కెట్లు దక్కించుకోవడం కోసం పోటీ పడుతున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కష్టతరంగా మారింది. సీఎం కేసీఆర్ ఇటీవల హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పరిషత్ ఎన్నికలపై ఎలా నడుచుకోవాలి, ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ముందుకు నడవాలని, రాష్ట్ర కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు దిశానిర్దేశం చేసి, అన్ని జిల్లాలకు పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లను నియమించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎన్నికల ఇన్‌చార్జ్‌గా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్‌ను నియమించడంతో ఆమె ఇప్పటికే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, అన్నీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఎవరికి జడ్పీటీసీ టిక్కెట్ ఇస్తే బాగుంటుంది, ఎవరైతే అలవోకగా గెలుస్తారనే అంశంపై చర్చించి అభ్యర్థుల ఎంపిక వడపోత కార్యక్రమాన్ని చేపట్టారు. తొలి విడత ఎన్నికలకు రేపటితో నామినేషన్ల ఘట్టం ముగుస్తుండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది.

ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకే బీ-ఫారంల బాధ్యత
నియోజకవర్గ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల చేతులమీదుగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బీ ఫారంలను అందజేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేసేవారికి బీ-ఫారం ఇచ్చే అధికారాన్ని నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు, ఇన్‌చార్జ్‌లకు ఫారం-ఏ రూపంలో అందజేసి, బీ-ఫారం కాపీలను అధికారికంగా అందజేశారు. తొలివిడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నేడో, రేపో బీ-ఫారంలను అందజేయనున్నారు. బీ-ఫారం అందజేత ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార సరళి, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి గెలుపే అంతిమ లక్ష్యంగా పనిచేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.

నాయకులను సమన్వయం చేస్తున్న ఇన్‌చార్జ్ సత్యవతి రాథోడ్
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ శ్రేణులు ముందుకుసాగుతున్నాయి. జిల్లాలో ఉన్న నేతలందరినీ సమన్వయం చేస్తూ జడ్పీ పీఠంపై గులాబీ జెండాను ఎగుర వేసేందుకు గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ భవన్‌లో రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ జిల్లా ఎన్నికల సమన్వయ కర్తగా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ను నియమించారు. ఆమె ఇప్పటికే జిల్లాకు చేరుకొని పలుమార్లు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ద్వితీయ శ్రేణి నాయకులతో, ఆశావాహులతో సమావేశాలు నిర్వహించి అందరినీ సమన్వయం చేసే బాధ్యతను తీసుకున్నారు. అసంతృప్తవాదులను బుజ్జగించి, గెలిచే అభ్యర్థుల విజయావకాశాలను అంచనా వేసి టిక్కెట్లు ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా ఎన్నికల ఇన్‌చార్జ్ రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డితో కలిసి కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాసంలో సత్యవతి రాథోడ్ సమావేశమయ్యారు. రేపటితో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుండటంతో త్వరితగతిన బీ-ఫారంల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని ఎమ్మెల్యే వనమాకు సూచించారు.

ప్రతిపక్షాలకు అభ్యర్థుల కరువు
పరిషత్ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు ఇతర పార్టీల నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి రావడంతో అటు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎంలు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల కోసం వెతుకులాటలో ఉన్నారు. గతంలో కూటమిగా ఉన్న పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి రావడంతో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎంలకు బలమైన క్యాడర్ లేకపోవడంతో పోటీ చేసే అభ్యర్థుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే బలమైన పార్టీగా ఎదిగిన టీఆర్‌ఎస్ గెలుపుదిశగా అభ్యర్థులను పోటీలో దించుతుంది. జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసేందుకు అధికారపార్టీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. జిల్లా ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన సత్యవతి రాథోడ్ గత వారం రోజుల నుంచి జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు.

70
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles