పరిషత్ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు..

Mon,April 22, 2019 12:54 AM

-ఏడు మండలాల్లో తొలి విడుత ఎన్నికలు
-బూర్గంపాడులో జడ్పీటీసీ స్థానానికే ఎన్నికలు
-ఈ నెల 28న ఉపసంహరణ..
-జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎంపికకు కసరత్తు చేస్తున్న టీఆర్‌ఎస్
-సమావేశంలో పాల్గొన్న పార్టీ జిల్లా ఎన్నికల ఇన్‌చార్జ్ సత్యవతి రాథోడ్
కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : జిల్లా పరిషత్ ఎన్నికలకు సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. తొలివిడతలో జిల్లాలో ఏడు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం, ములకలపల్లి, పాల్వంచ, టేకులపల్లి, మండలాల్లో ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. బూర్గంపాడు మండలంలో ఎంపీటీసీల ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున కేవలం ఒక జడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఎన్నికలు జరగనుంది. అధికార యంత్రాంగం ఇందుకోసం ముందస్తుగా ఏర్పాట్లు చేసి ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణకు మండల పరిషత్ కార్యాలయాల్లో ఉద్యోగులకు విధులు కేటాయించారు. అశ్వాపురంలో 12 ఎంపీటీసీలు, చర్లలో 12, దుమ్ముగూడెంలో 13, పాల్వంచలో 10, ములకలపల్లిలో 10 టేకులపల్లిలో 14 ఎంపీటీసీలతో పాటు ఏడు మండలాల్లోని (బూర్గంపాడు జడ్పీటీసీ స్థానం) జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కొత్తగూడెం, భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలో నిర్వహించే తొలి విడత ఎన్నికలకు అభ్యర్థుల పరిశీలన కార్యక్రమాన్ని నాయకులు చేపడుతున్నారు.

నామినేషన్ల స్వీకరణ
జిల్లాలో తొలివిడుత జరిగే ఏడు మండలాల్లో పరిషత్ ఎన్నికలకు సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా, ఈ నెల 28వ తేదీన ఉపసంహరణలు జరగనున్నాయి. 24న నామినేషన్లు స్వీకరణ ముగింపు, 25న స్క్రూట్నీ, 26న అభ్యంతరాల స్వీకరణ, 27న తిరస్కరణలు, 28న ఉపసంహరణ, బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. వచ్చే నెల మే 6వ తేదీన ఉదయం ఏడు నుంచి సాయంత్రం 5గంటల వరకు మొదటి దశ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. తొలిదశ పోలింగ్ కోసం అధికారులు ఆయా మండల పరిధిలోని గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. అశ్వాపురం మండలంలో 40 పోలింగ్ కేంద్రాలు, బూర్గంపాడులో 55, చర్లలో 36, దుమ్ముగూడెంలో 40, పాల్వంచలో 89, ములకలపల్లిలో 34, టేకులపల్లిలో 44 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇప్పటికే ఓటర్ల జాబితాను ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు.

స్వీకరణ ఇలా..
పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పాటు నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు మండల పరిషత్ కార్యాలయంలోనే కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా పోటీ చేయాలంటే అభ్యర్థి కనీస వయస్సు 25సంవత్సరాలు ఉండాలి. 1995 తర్వాత పుట్టినవారు ఇద్దరు పిల్లలు మాత్రమే కలిగి ఉండాలి. జడ్పీటీసీగా పోటీ చేసే అభ్యర్థి సంబంధిత జిల్లాలో ఓటరై ఉండాలి. వారిని ప్రతిపాదించేవారు మండల ఓటరై ఉండాలి. ఎంపీటీసీలుగా పోటీ చేసే అభ్యర్థులకు మండలంలోనే ఓటు హక్కు కలిగి ఉండాలి. వారు ప్రతిపాదించేవారు ఎంపీటీసీ నియోజకవర్గంలో ఓటరై ఉండాలి. జడ్పీటీసీగా పోటీచేసే అభ్యర్థులు జనరల్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు రూ.5వేలు డిపాజిట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే రూ.2,500 డిపాజిట్ చెల్లించాలి.

జడ్పీటీసీ, ఎంపీటీసీ
సభ్యుల ఎంపికకు టీఆర్‌ఎస్ కసరత్తు
పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నందున టీఆర్‌ఎస్ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించింది. పార్టీ జిల్లా ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ జిల్లాలో ఇప్పటికే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆదివారం సారపాకలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో కలిసి అభ్యర్థుల ఎంపిక గురించి దిశా నిర్ధేశం చేశారు. పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాసంలో టీఆర్‌ఎస్ నాయకులు వనమా రాఘవేందర్‌రావు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ గురించి సమీక్షలు చేశారు. సమావేశంలో కొత్తగూడెం, పాల్వంచ నాయకులు పాల్గొన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles