మోగిన పరిషత్ ఎన్నికల నగారా..


Sun,April 21, 2019 12:04 AM

- జిల్లాలో మూడు విడుతల్లో ఎన్నికలు
- బూర్గంపాడు మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాలకు నో ఎలక్షన్స్
- 21 జడ్పీటీసీ, 209 ఎంసీటీపీ స్థానాలకు ఎన్నికలు
- మే 27న లెక్కింపు.. ఫలితాల వెల్లడి


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మండల, జిల్లా ప్రాదేశిక స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. పరిషత్ ఎన్నికలను జిల్లాలో మూడు దఫాలుగా నిర్వహించేందుకు శనివారం ఎన్నికల కమిషనర్ వీ.నాగిరెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. కొద్ది రోజుల క్రితం ఎన్నికల కమిషన్ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లా అధికారులు ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులకు శిక్షణ తరగతులతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు. మండల, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై జిల్లా పరిషత్ అధికారులు ఇప్పటికే పోలింగ్ కేంద్రాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిషత్ ఎన్నికలను జిల్లాలో మూడు విడుతల్లో నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడుత ఎన్నికలకు ఈనెల 22నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది, 28న ఉప సంహరణ పూర్తయిన అనంతరం మే6న ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండవ విడుత ఎన్నికలకు ఈనెల 26నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది, మే2 వ తేదీన ఉప సంహరణ పూర్తైన అనంతరం మే10వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడవ విడుత ఎన్నికలకు ఈనెల 30వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది, మే6వ తేదీన ఉప సంహరణ పూర్తయిన

అనంతరం మే 14నఎన్నికలు నిర్వహించనున్నారు. ఈఎన్నికల నిర్వహణకు జిల్లా యం త్రాంగం పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన అనంతరం కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ నేతృత్వంలో జిల్లా అధికారులు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఆధారంగా పోలింగ్ కేంద్రాల ఎంపిక, సిబ్బందికి శిక్షణ, పూర్తిస్థాయిలో ఎన్నికలకు సమాయత్తమైంది.

ఎన్నికల సిబ్బందికి శిక్షణ
జిల్లాలోని 21 మండలాల్లో ఎన్నికల సిబ్బందికి కొన్ని రోజులుగా శిక్షణ ఇస్తున్నారు. మండల కేంద్రాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో 15,16,17 తేదీల్లో ఎన్నికల అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవోలు, ఏపీవోలకు ఆయా మండల కేంద్రాల్లో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నియమనిబంధనలపై అవగాహన కల్పించారు. ఎన్నికల నియమ, నిబంధనలకు సంబంధించిన కరపదీకలను అందించి విధివిధానాలను, నియమావళికి అనుగుణంగా ప్రతీ ఒక్క ఎన్నికల సిబ్బంది నడుచుకోవాలని సూచించారు. జిల్లాలో 2408 మంది పీవోలు, 2408 మంది ఏపీవోలు, నియమించి వారికి శిక్షణ ఇచ్చారు.

మొదటి విడుతలో..
జిల్లాలోని అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం, ములకలపల్లి, పాల్వంచ, టేకులపల్లి మండలాలకు మొదటి విడుత ఎన్నికలు జరగనున్నాయి. ఈఎన్నికలకు ఈనెల 22 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 24న నామినేషన్ల ఉప సంహరణ, 25న స్క్రూట్నీ అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నారు. 26న ఫిర్యాదులు స్వీకరించనున్నారు. 27న నామినేషన్లలో తప్పులున్నా, తప్పుడు సమాచారం ఇచ్చినా వాటిని తిరస్కరిస్తారు. 28న ఉపసంహరణ అదేరోజు సాయంత్రం తుది జాబితాను ప్రకటిస్తారు. మే6వ తేదీ ఉదయం 7నుంచి సాయంత్రం 5 వరకు మొదటి దశ ఎన్నికలు కొనసాగుతాయి.

రెండో విడుతలో..
జిల్లాలోని కరకగూడెం, మణుగూరు, పినపాక, అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, దమ్మపేట, జూలూరుపాడు మండలాల్లో రెండో విడుత ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశ ఎన్నికలకు గాను ఈ నెల 26 నుంచి 28వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. 29న స్క్రూట్నీ, అనంతరం తుది జాబితా ప్రకటిస్తారు. 30వ తేదీన ఫిర్యాదులు స్వీకరించి మే ఒకటో తేదీన నామినేషన్లలో తప్పులున్నా, తప్పుడు సమాచారం ఇచ్చినా వాటిని తిరస్కరిస్తారు. మే2న ఉపసంహరణ ప్రక్రియ ముగుస్తుంది. అదేరోజు సాయంత్రం తుది జాబితాను ప్రకటిస్తారు. మే 10న రెండో దశ ఎన్నికల పోలింగ్ ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

మూడవ విడుతలో..
జిల్లాలోని ఆళ్లపల్లి, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, గుండాల, సుజాతనగర్, ఇల్లెందు మండలాల్లో మూడవ విడుత ఎన్నికలు జరగనున్నాయి. ఈరెండో దశ ఎన్నికలకు గాను ఈనెల 30 నుంచి మే 2వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. మే3న స్క్రూట్నీ, అనంతరం తుది జాబితా ప్రకటిస్తారు. మే4వ తేదీన ఫిర్యాదులు స్వీకరించి మే 5 తేదీన నామినేషన్లలో తప్పులున్నా, తప్పుడు సమాచారం ఇచ్చినా వాటిని తిరస్కరిస్తారు. మే 6న ఉప సంహరణ ప్రక్రియ ముగుస్తుంది. అదేరోజు సాయంత్రం తుదిజాబితాను ప్రకటిస్తారు. మే14న మూడవ దశ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

జిల్లాలో మొదటి విడుత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏడు జడ్పీటీసీ స్థానాలకు, 71 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

రెండవ విడుత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో 8జడ్పీటీసీ స్థానాలకు, 82 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

మూడవ విడుతలో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో 6 జడ్పీటీసీ స్థానాలకు, 56 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడు విడుతల్లో మొత్తం 21 జడ్పీటీసీ స్థానాలకు, 20 ఎంపీపీ, 209 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 27న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.

11 ఎంపీటీసీ స్థానాలకు నో ఎలక్షన్స్
జిల్లాలో మూడు విడుతల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బూర్గంపాడు మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ఈఎంపీటీసీ స్థానాలు వచ్చే ఏడాది జూలైతో ముగుస్తున్నందున వాటికి ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల కమిషనర్ వీ.నాగిరెడ్డి తెలిపారు. సర్పంచ్, వార్డు మెంబర్లు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, అయితే ఫలితాల అనంతరం వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.

207
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles