జడ్పీ పీఠంపై గులాబీ జెండా ఎగురవేస్తాం..!

Sat,April 20, 2019 12:12 AM

- 21 జడ్పీటీసీలు, 220 ఎంపీటీసీ స్థానాల గెలుపే లక్ష్యం
- ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్‌చార్జులకు బాధ్యతలు అప్పగింత
- బలమైన అభ్యర్థుల కోసంకసరత్తు
- జిల్లా ఇన్‌చార్జీగా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్

భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక మండల, జిల్లా ప్రాదేశిక స్థానాలే లక్ష్యంగా టీఆర్‌ఎస్ పార్టీ ముందుకు సాగుతోంది. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి జెడ్పీ పీఠమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఇంచార్జులను నియమించారు. దీంతో పార్టీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు గెలుపు బాధ్యతలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. 2018 డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహాత విజయం నమోదు చేసుకున్న టీఆర్‌ఎస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో పంచాయతీ ఎన్నికలలో అత్యధిక సర్పంచ్ స్థానాలను, వార్డు మెంబర్లను కైవసం చేసుకుంది. ఆవెంటనే పార్లమెంట్‌కు ఎన్నికలు రావడంతో పార్టీ శ్రేణులు, అన్ని గ్రూపులు ఒక్కతాటిపైకి వచ్చి పార్లమెంట్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేశాయి. ఈనెల 20వ తేదీన స్థానిక సంస్థల సంగ్రామానికి తెరలేవనుండటంతో అధినేత ఆదేశాలతో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి.

21 జడ్పీటీసీ స్థానాల గెలుపే లక్ష్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 220 ఎంపీటీసీ స్థానాలు, 21 జెడ్పీటీసీ స్థానాల్లో అత్యధిక స్థానాలు గెలిచి జడ్పీ పీఠమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ శ్రేణులు పనిచేస్తున్నాయి. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు గెలుపుగుర్రాలను వెతికే పనిలో ఉన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పూర్తిస్థాయిలో గెలిచే అవకాశాలున్న వ్యక్తులకే ప్రాధాన్యం ఇస్తూ జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకం కావడంతో ఎమ్మెల్యేలు ప్రజాభిమానం, ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉన్న వారిని ఎంపిక చేస్తున్నారు. జిల్లాకు నియమించిన ఇన్‌చార్జి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌తో చర్చించి అభ్యర్థుల జాబితాను నోటిఫికేషన్ రాగానే విడుదల చేసే అవకాశాలున్నాయి. గెలుపే అంతిమ లక్ష్యంగా పనిచేయాలని సీఎం కేసీఆర్ సూచించిన నేపథ్యంలో ప్రతీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను ఎంపిక చేసే ప్రక్రియ అత్యంత కీలకంగా మారనుంది.

బలమైన అభ్యర్థులను నిలిపేందుకు కసరత్తు
ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలిపి అత్యధిక ఎంపీపీ స్థానాలతో పాటు జడ్పీ పీఠంపై గులాబీ జెండా ఎగురవేసేందుకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో మూడు విడుతలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో మొదటి విడుత ఎన్నికలు జరిగే స్థానాల్లో అభ్యర్థుల జాబితాపై ఎమ్మెల్యేలు, శ్రేణులు దృష్టి సారించారు. ఎన్నికల్లో పలు అంశాలను పరిగణలోకి తీసుకొని విజయాన్ని సాధించే అభ్యర్థులను బరిలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. గత నాలుగు నెలల వ్యవధిలోనే వరుస ఎన్నికలు రావడం, గులాబీ జెండా అన్ని ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించడంతో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఈ ఎన్నికల్లో పాల్గొననున్నాయి. జిల్లాలో ఉన్న 21 జెడ్పీటీసీ స్థానాలకు, 220 ఎంపీటీసీ స్థానాలకు మూడు దఫాలుగా ఎన్నికలు జరగనుండటం, అంతే కాకుండా స్థానిక సంస్థల టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన కారుగుర్తు పైనే పోటీ చేసే అవకాశం ఉండటంతో టీఆర్‌ఎస్ పార్టీకి కలిసొచ్చే అంశం.

జిల్లా ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
స్థానిక సంస్థల ఎన్నికలలో గులాబీ జెండా ఎగురవేసేందుకు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ను సీఎం కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్‌చార్జిగా నియమించారు. జిల్లా లో ఉన్న నేతలందరినీ సమన్వ యం చేసుకుంటూ సీఎం తనకు అప్పగించిన పనిని విజయవంతం చేసేందుకు ఎమ్మెల్సీ తన కార్యాచరణను ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఉంటూనే జిల్లా ముఖ్యనేతలతో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలో టీఆర్‌ఎస్‌పార్టీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా పనిచేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అనే దానిపై ఆమె పలువురితో చర్చించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ముఖ్యనేతలు, టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ జిల్లాలోని ముఖ్యనేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా తొలి జడ్పీ పీఠంపై గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు సంసిద్దంగా ఉన్నాయి. ఎన్నికల ఇన్‌చార్జి జి ల్లాలో ఉన్న పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముం దుకు సాగితే గెలుపు నల్లేరుమీద నడకే కానుంది. జెడ్పీ పీఠం ఎస్టీ జనరల్ కావడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదు నియోజకవర్గాల్లో ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీంతో అభ్యర్థుల ఎంపిక కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని గెలుపు ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

94
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles