ఈవీఎంలు, వీవీప్యాట్లపై అవగాహన కలిగి ఉండాలి

Mon,March 25, 2019 01:29 AM

భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది ఈవీఎం, వీవీప్యాట్ల వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ అన్నారు. ఆదివారం కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో, భధ్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పినపాక, భద్రాచలం నియోజకవర్గాల పీవోలు, ఏపీవోలకు, ఇల్లెందు గిరిజన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఫారం 12, ఫారం 12-ఏలను శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే కేంద్రాల్లో అందజేస్తున్నామన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి అదే నియోజకవర్గం పరిధిలో విధులు కేటాయించినైట్లెతే వారు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ (ఈడీసీ) తీసుకొని ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఫారం12ఏ లను అందజేయాలన్నారు. తమకు ఓటు ఉన్న పార్లమెంట్ స్థానం కాకుండా, మరొక పార్లమెంట్ స్థానంలో విధులు కేటాయించినైట్లెతే వారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఫారం నంబర్ 12 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

గత ఎన్నికల్లో ఈవీఎంకు వీవీప్యాట్ అనుసంధానం చేయడంలో అవగాహన లేకపోవడం వల్ల కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈవీఎంలకు వీవీప్యాట్‌లు అనుసంధానం చేయడంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని, సిబ్బంది ఈ విషయంలో పూర్తిగా అవగాహన పెంపొందించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓట్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారులు 17సీ ద్వారాను, రిజిష్టర్ ఆఫ్ ఓటర్స్ వివరాలను 17ఏ ద్వారాను అందజేయాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ఈడీసీ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్న ఓటరు వివరాలను కూడా నమోదు చేయాలన్నారు. విధులు కేటాయించబడిన సిబ్బంది అందరూ విధులకు హాజరయ్యారా లేదా అనే వివరాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ తరగతులకు హాజరుకాని వారిపై ఎన్నికల సంఘ నియమ నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేసే రోజున సిబ్బందికి చెక్‌లిస్టులు అందజేయాలన్నారు. ఆ చెక్‌లిస్టు ప్రకారం మెటీరియల్ తీసుకునేటప్పుడు పరిశీలన చేయడానికి సులభతరమవుతుందన్నారు. తొలిరోజు శిక్షణ కార్యక్రమానికి కొత్తగూడెంలో 547 మంది, అశ్వారావుపేటలో 462 మంది, ఇల్లెందులో 612 మంది, పినపాకలో 506 మంది, భద్రాచలంలో 441 మంది మొత్తం 2568 మంది శిక్షణకు హాజరయ్యారన్నారు. వారికి విధులు కేటాయించామన్నారు. పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి మాస్టర్ ట్రైనర్స్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడానికి కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమాలలో పినపాక, భధ్రాచలం, ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు వీపీ గౌతమ్, భవేష్‌మిశ్రా, శ్రీరాములు, స్వర్ణలత పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles