పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

Sun,March 24, 2019 12:22 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల పకడ్బందీ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల నోడల్ అధికారులతో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు ఓటర్ల తుది జాబితాను ప్రకటించి, ఆ జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు అందజేస్తామన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రం పరిధిలో దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, వయోవృద్ధుల వివరాలను ఓటర్ల జాబితాలో మార్కింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ఈవీఎం, వీవీప్యాట్‌లు భద్రపర్చేందుకు స్ట్రాంగ్‌రూం ఏర్పాటు చేసి ఆ జాబితాను అందజేయాలన్నారు. పోలింగ్ మెటీరియల్‌ను సకాలంలో పంపిణీ చేసేందుకు రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 160 పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నామని, వెబ్‌కాస్టింగ్ నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని వెబ్‌కాస్టింగ్ నిర్వహణ అధికారి పంచాయతీరాజ్ ఈఈకి సూచించారు. 400 పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేయనున్న సీసీ కెమేరాల వివరాలు తనకు అందజేయాలని పోలీసులకు కూడా సూచించారు. వెబ్‌కాస్టింగ్ నిర్వహించే పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయవద్దని పంచాయతీరాజ్ శాఖ అధికారికి సూచించారు.సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నామన్నారు. పోలింగ్ విధులు కేటాయించిన పోలీసు, అటవీశాఖ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్లు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీవో, పినపాక అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్, అశ్వారావుపేట రిటర్నింగ్ అధికారి, జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు, భధ్రాచలం రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ భవేష్‌మిశ్రా, కొత్తగూడెం రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో స్వర్ణలత, ఇల్లెందు రిటర్నింగ్ అధికారి, ఎస్‌డీసీ శ్రీరాములు, ట్రైనీ కలెక్టర్ ఇలా త్రిపాఠి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.

ఓటింగ్ యంత్రాలు కేటాయింపు
పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ముందస్తు ఏర్పాట్లతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఈవీఎంలు, వీవీప్యాట్‌లను అవసరమైన సంఖ్యలో అందుబాటులో ఉంచడం, సాంకేతిక సమస్యలు తలెత్తితే తక్షణం పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఎలాంటి జాప్యం లేకుండా ఈవీఎంలను పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు, వాహనాల సౌకర్యం, కౌంటింగ్‌కేంద్రాలకు బ్యాలెట్ బాక్సుల తరలింపుతో సహా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలు కొనసాగే విధంగా బాధ్యులను నియమించి సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు కేటాయిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ ప్రజాప్రతినిధులకు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం అఖిలపక్ష పార్టీల ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వచ్చే నెల 11వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కోసం ఈవీఎంల తరలింపుపై జిల్లాస్థాయిలో మార్కెట్‌యార్డు గోడౌన్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను నిక్షిప్తం చేశామని చెప్పారు. కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్‌లు వివరాలతో కూడిన ప్రతులను అన్ని రాజకీయ పక్షాలకు అందజేస్తామన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఎలక్షన్ డీటీ మస్తాన్‌రావు, టీఆర్‌ఎస్ నుంచి ఏమునూరి లక్ష్మీబాయి, కాంగ్రెస్ నుంచి ఐకి సత్యనారాయణ, బీజేపీ నుంచి నోముల రమేష్, పీ రవీందర్, సీపీఎం నుంచి బీ రమేష్ పాల్గొన్నారు.

కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తా..

ఖమ్మం ప్రధానప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఎన్నో పోరాటాలు, త్యాగాల సాక్షిగా సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా నిర్మిస్తున్న సీఎం కేసీఆర్ పాలనను మెచ్చి ఆయనతో కలిసి నడిచేందుకే టీఆర్‌ఎస్‌లో చేరానని, సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తానని, ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం ఖమ్మంలోని టీఆర్‌ఎస్ భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎంపీగా పని చేసిన సమయంలో ఖమ్మం జిల్లా సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశానని, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయాలకు అతీతంగా పనిచేశానన్నారు. బయ్యారం స్టీలుప్లాంట్, కొవ్వూరు రైల్వే లైన్‌ను తన హయాంలోనే సాధించుకున్నామన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి వల్లే తాను టీఆర్‌ఎస్‌లో చేరానని నామా స్పష్టం చేశారు. అందరి వారిగా ఉంటానని, మళ్లీ ఒకసారి అవకాశం ఇచ్చి తెలంగాణ అభివృద్ధిలో తనకు భాగస్వామ్యాన్ని కల్పించాలని నామా కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తానని ఒక నెల నా కోసం కష్టపడితే 5 ఏండ్లు ప్రజలందరిని కాపాడుకుంటానని, అందరికి అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌లో ఎలాంటి గ్రూపులు లేవని, అంతా కేసీఆర్ గ్రూపేనని, సీఎం డైరెక్షన్‌లోనే ముందుకు వెళ్తామన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, తెలంగాణ, ఖమ్మం జిల్లా అభివృద్ధిలో భాగస్వామిగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో అందరినీ కలుపుకుని ఐకమత్యంతో ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.

కేసీఆర్‌తోనే దేశ రాజకీయాలలో మార్పు..
తెలంగాణ బిడ్డగా 15వ లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మొదటిగా తానే ఓటు వేశానని, ఆనాడు టీఆర్‌ఎస్‌కు ఇద్దరే ఎంపీలు ఉన్నప్పటికీ వారు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో పోరాడారన్నారు. తాను కూడా లోక్‌సభలో తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని, తాను చేసిన కృషిని ఆనాడు సీఎం కేసీఆర్ దగ్గరుండి చూశారన్నారు. దేశ రాజకీయాలలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం ఉన్న రాజకీయ శక్తులకు ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన అవసరం దేశంలో ఉందని, అది కేసీఆర్ వలనే సాధ్యమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో కేసీఆర్‌కు ఉన్న విజన్‌తో ముందుకు వెళ్తే దేశం అగ్రగామిగా నిలుస్తారన్నారు. 16 ఎంపీ స్థానాలను గెలవడం ఖాయమని, ఖమ్మంలో మంచి మెజార్టీ సాధించుకోవాలన్నారు. తెలంగాణ రాకముందు సాగునీటి కోసం ఎంతో కష్టపడ్డామని, ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.

అత్యధిక మెజార్టీతో నామాను గెలిపించాలి..: ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్
సీఎం కేసీఆర్ ఆదేశాలకనుగుణంగా ఖమ్మం టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన చారిత్రత్మక అవసరం ఉందని, దానికి అనుగుణంగా కార్యకర్తలు కృషి చేయాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కేసీఆర్ నిర్ణయాన్ని పెద్దఎత్తున సమర్థిస్తున్నామని, ఖమ్మం ఎంపీ సీటు గెలిచి కేసీఆర్‌కు బహుమతిగా అందిస్తామన్నారు. రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌లో ముఖ్య నాయకులమందరం సమావేశమై ప్రచార పర్యటనలు, నియోజకవర్గాలస్థాయిలో సమావేశాలు, నామినేషన్ తదితర అంశాలను చర్చించడం జరిగిందన్నారు. ప్రతీ కార్యకర్త పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ప్రతి బూత్‌లో మెజార్టీ రావాలని, ఖమ్మం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ సాధిస్తామని పువ్వాడ అన్నారు. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, మిత్రులుండరని, ఎన్నికల వరకే రాజకీయాలని, శాసనసభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలలో వివిధ పార్టీ నుంచి గెలుపొందిన అనేక మంది ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతమైనవారని, ఉత్తర తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు వచ్చే మెజార్టీ కంటే ఖమ్మంలో అత్యధికంగా రావాలన్నారు. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తామన్నారు.

నామా గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి..:
- నూకల నరేష్‌రెడ్డి, తాతా మధు
పార్లమెంటు ఎన్నికల్లో నామా గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తామని టీఆర్‌ఎస్ ఖమ్మం లోక్‌సభ ఇంచార్జీ నూకల నరేష్‌రెడ్డి అన్నారు. జిల్లా రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ అన్ని విషయాలను అర్థం చేసుకుని, వివిధ సర్వేలు, ఓటర్ల మనోభావాలు, ఖమ్మం జిల్లా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నామా నాగేశ్వరరావును ఎంపిక చేశారన్నారు. గతంలో ఎంపీగా పని చేసిన నామా జిల్లా ప్రజలకు సుపరిచితుడేనని, సుదీర్ఘకాలం పాటు రాజకీయాలలో కొనసాగుతున్నారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. అన్ని విధాలుగా ఆలోచించి నామాను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారని, ఆయన ఘన విజయం సాధించేలా కృషి చేస్తామని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు అన్నారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ పాలనను మెచ్చి 89 సీట్లలో గెలిపించారని, ఖమ్మం జిల్లాలోనే ఫలితాలు భిన్నంగా వచ్చాయన్నారు. శాసనసభ ఎన్నికల అనంతరం ఖమ్మం జిల్లాలో మహాకూటమి తరుపున గెలిచిన అనేక మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. తద్వారా ఖమ్మం పార్లమెంటు పరిధిలో బలమైన పార్టీగా టీఆర్‌ఎస్ అవతరించిందన్నారు. రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్ అనేక ఘనవిజయాలు సాధిస్తుందన్నారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మాట్లాడుతూ.. నామాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన గెలుపు నల్లేరు మీద నడకేనన్నారు. ఖమ్మం నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, అన్ని నియోజకవర్గాల కంటే వైరా నియోజకవర్గం నుంచి అత్యధిక కృషి చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. దేశ రాజకీయాలలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పాలన, అభివృద్ధిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక మార్పు సాధించారని, ఈ నేపథ్యంలో 16 ఎంపీ స్థానాలను గెలుచుకోవడం అవసరమన్నారు. దేశ పరిపాలనా విధానంలో మార్పులు రావడానికి టీఆర్‌ఎస్ కారణమవుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఖమ్మం మేయర్ జీ. పాపాలాల్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆర్‌జేసీ కృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, కమర్తపు మురళీ, మధిర నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులు లింగాల కమల్‌రాజు, బొమ్మెర రామ్మూర్తి, టీఆర్‌ఎస్ మహిళా విభాగం నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, తుళ్లూరి బ్రహ్మయ్య, బెల్లం వేణుగోపాల్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, జలగం రామకృష్ణ, బిచ్చాల తిరుమలరావు, ఇంటూరి శేఖర్, తాళ్లూరి సృజన్ తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles