కలిసికట్టుగా పనిచేద్దాం.. నామాని గెలిపిద్దాం..

Fri,March 22, 2019 11:27 PM

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా బరిలో దిగుతున్న నామా నాగేశ్వరరావును కలిసికట్టుగా పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మండలి విప్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పల్లా రాజేశ్వరరెడ్డి నివాసంలో ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ముఖ్యనేతలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణవ్యాప్తంగా 16 ఎంపీ స్థానాలను గెలిపించాలనే కృతనిశ్చయంతో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. ఈ ఎన్నికలు టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి, రాష్ట్రంలో అభివృద్ధి పథకాలను అడుగడుగునా అడ్డుకుంటున్న అభివృద్ధి నిరోధకులు కాంగ్రెస్, బీజేపీల మధ్య జరుగుతున్న పోరాటమన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లోటుపాటులను సరిదిద్దుకుని ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా టీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు, ఇతర ముఖ్యనేతలతో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్నారని, కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆరే పోటీ చేస్తున్నట్లుగా భావించి టీఆర్‌ఎస్ గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. పార్టీలో ఉన్న నాయకులు అందరికీ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని ఎవ్వరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ గ్రామస్థాయిలో బలమైన క్యాడెర్‌తో ఉందన్నారు. దీనిని సరైన పద్ధతిలో వినియోగించుకుని పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటు అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ బరపటి వాసుదేవరావు, మాజీ ఎమ్మెల్యేలు మదన్‌లాల్, జలగం వెంకటరావు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సత్తుపల్లి నియోజకవర్గ ఇంచార్జీ పిడమర్తి రవి, మధిర నియోజకవర్గ ఇంచార్జీ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తాతా మధు, నూకల నరేష్‌రెడ్డి, బొమ్మెర రామ్మూర్తి, పార్టీ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, తుళ్లూరి బ్రహ్మాయ్య తదితరులు పాల్గొన్నారు.

అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలు..
ఖమ్మం పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపించుకునేందుకు ప్రతీ అసెంబ్లీ స్థాయిలో ముఖ్యనేతలతో సమన్వయ కమిటీలు వేయనున్నారు. ఈ కమిటీలలో నియోజకవర్గ ఇంచార్జీలతో పాటు ప్రస్తుతం ఇతర పార్టీల నుంచి పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, ఇతర కీలక నాయకులతో సమన్వయ కమిటీని వేయాలని టీఆర్‌ఎస్ పార్టీ అధినాయకత్వం జిల్లా నేతలకు సూచించింది. ఈ క్రమంలోనే పాలేరు నియోజవకర్గంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, మద్దినేని స్వర్ణకుమారితో పాటు నియోజకవర్గంలో ముఖ్యనాయకులతో సమన్వయం కమిటీ ఏర్పాటు చేయనున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం నియోజకవర్గ ఇంచార్జీగా వ్యవహరిస్తున్న మాజీ ఎస్సీ కార్పొరేషన్ పిడమర్తి రవితో పాటు ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్న సండ్ర వెంకటవీరయ్య, మువ్వా విజయబాబు, మట్టా దయానంద్‌తో కలిపి ముఖ్య నాయకులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. అలాగే వైరా నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌తో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే రాములునాయక్‌తో పాటు ఇతర ముఖ్య నాయకులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. మధిర నియోజకవర్గ ఇంచార్జీ లింగాల కమల్‌రాజ్‌తో పాటు విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోమ్మెర రామ్మూర్తితో పాటు నియోజకవర్గంలోని ముఖ్యనేతలను సమన్వయ కమిటీలో నియమించనున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీ పని చేయనుంది. కొత్తగూడెం నియోజకవర్గంలో నియోజకవర్గ ఇంచార్జీగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావుతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇతర నియోజకవర్గస్థాయి నేతలతో సమన్వయ కమిటీ ప్రకటించనున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తాటీ వెంకటేశ్వర్లుతోపాటు ఆ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి పార్లమెంటు ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గెలుపునకు అవసరమైన ప్రణాళికలను రూపొందించేందుకు రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఈ కమిటీలు పని చేసేందుకు నిర్ణయించారు. ఏప్రిల్ మొదటి వారంలో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జిల్లాలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతారని, దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

25న నామా నాగేశ్వరరావు నామినేషన్..
ఖమ్మం పార్లమెంటు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు ఈ నెల 25వ తేదీన నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ర్యాలీతో పాటు బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఇప్పటికే పనిలో నిమగ్నమయ్యారు. నామినేషన్‌కు ముందుగానే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకులకు సూచించారు. 23న శనివారం ఖమ్మం అసెంబ్లీ పరిధిలో టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో పాటు టీఆర్‌ఎస్ పార్టీ కీలకమైన కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపునకు చేయాల్సిన పని విధానాన్ని వివరించనున్నారు. అలాగే 24వ తేదీన మిగతా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహించి ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపునకు కృషి చేయాల్సిన అవసరాన్ని తెలియజేయనున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని ముఖ్య నాయకులు, నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గస్థాయి సమావేశాలకు హాజరుకావాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే వారికి సూచించింది.

నామాకు బీ ఫాం అందజేసిన కేసీఆర్
ఖమ్మం నమస్తేతెలంగాణ: ఖమ్మం లోక్‌సభ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా నియమించబడిన నామా నాగేశ్వరరావుకు సీఎం కేసీఆర్ గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో పార్టీ బీఫాం అందచేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం లోక్‌సభ స్థానంలో నామా లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులందరూ ఐక్యంగా పనిచేసి పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు. పార్టీకి నష్టం వాటిల్లే చర్యలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్య, శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, తుళ్లూరి బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు.

16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయ దుందుభి మోగించడం ఖాయం..
- టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, 1969 తెలంగాణ ఉద్యమకారుడు జంజిరాల రాజేష్
మయూరిసెంటర్: పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 16 స్థానాల్లో విజయ దుందుభి మోగించడం ఖాయమని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, 1969 తెలంగాణ ఉద్యమకారుడు జంజిరాల రాజేష్ అన్నారు. శుక్రవారం ఖమ్మంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫెడరల్ ఫ్రంట్ ద్వారా దేశ రాజకీయాలను మార్చగల సత్తా ఒక్క సీఎం కేసీఆర్‌కే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధ్ది తీరును ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుని పాలన కొనసాగిస్తున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనకు ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు సైతం హర్షాతిరేఖాలు వ్యక్తం చేసిన సందర్భాలున్నాయని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు వరప్రదాయిని సీతారామ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి గోదావరి నదీజలాలను తెలంగాణ వాటా ప్రకారం 1350 టీఎంసీల నీటిని రైతాంగానికి అందించడం కోసం పనులు జరుగుతున్నాయన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఉద్యమకారులు, టీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

78
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles