నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు

Fri,March 22, 2019 03:51 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన పోలింగ్ శుక్రవారం నాడు జరగనుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో గత కొన్ని రోజులుగా అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్న పూల రవీందర్‌కు అన్ని వర్గాల వారు తమ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన్ను బలపరుస్తున్న వారు ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికలు కూడా ఎవరికి వారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఎన్నికల పోలింగ్‌కు జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం, భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయాల ప్రాంగణాల్లో బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ సామగ్రిని ఎన్నికల సిబ్బందికి అందజేసి ప్రత్యేకంగా సమకూర్చిన వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ భవేష్‌మిశ్రా, కొత్తగూడెం ఆర్డీవో కనకం స్వర్ణలత ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. జిల్లాలోని 23 మండలాల్లో పోలింగ్ కేంద్రాలను ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బంది ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.

పోలింగ్‌కు సర్వం సిద్ధం: కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ
పాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ తెలిపారు. జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు కొత్తగూడెం ఆర్డీవో స్వర్ణలత, భద్రాచలం సబ్ కలెక్టర్ భవేష్‌మిశ్రా రెవెన్యూ అధికారులతో గురువారం ఎన్నికల సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేయించారు. ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు అందజేసి, పోలింగ్ సామగ్రి తీసుకెళ్లేందుకు అవసరమైన వాహనాలను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో 23 మండలాల్లో 23 పోలింగ్ కేంద్రాలను ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 2,043 మంది ఓటర్లు ఉండగా వారిలో కొత్తగూడెం డివిజన్‌లోని 15 మండలాల్లో 1,322 మంది ఓటర్లు, భద్రాచలం డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల్లో 721 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

పోలింగ్ ప్రక్రియను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తొమ్మిది మంది సెక్టోరియల్ అధికారులను నియమించామన్నారు. ఈ సెక్టోరియల్ అధికారుల పర్యవేక్షణలో 26 మంది పీవోలు, 26 మంది ఏపీవోలు, 33 మంది ఇతర పోలింగ్ అధికారులతో పాటు 26 మంది మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల విధులను నిర్వహించనున్నారని వివరించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించనున్నట్లు కలెక్టర్ విశదీకరించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, ఎలాంటి సమస్యలు తలెత్తినా తక్షణమే తమకు సమాచారం ఇస్తే పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

61
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles