మహబూబాబాద్ పార్లమెంట్‌కు తొలి నామినేషన్

Thu,March 21, 2019 12:19 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మూడవ రోజు బుధవారం జిల్లా పరిధిలోని ఇల్లెందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి తొలి నామినేషన్ దాఖలైంది. కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ మండలం సీతంపేటకు చెందిన భూక్యా పార్వతి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాన్ని మహబూబాబాద్ ఎస్టీ రిజర్వుడ్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యకు అందజేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మూడు రోజులు అయినప్పటికీ తొలి నామినేషన్ జిల్లా నుంచే బోణీ అయిందని చెప్పవచ్చు. ఈనెల 25 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇంకా ఖరారు కాకపోవడంతో నామినేషన్ల జోరు ఊపందుకోలేదు. టీఆర్‌ఎస్ నుంచి అధిష్టానం ఎవరికి ఖరారు చేస్తే వారి అభ్యర్థిత్వం కోసం టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. టీడీపీ నుంచి ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, సీపీఎం నుంచి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు బి.వెంకట్ పేర్లు వినిపిస్తున్నాయి. సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా అభ్యర్థులను నిలబెడుతున్నాయి. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థి పోటీ చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. కాంగ్రెస్‌లో ఇంకా అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంది.

54
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles