అనుమానాస్పద స్థితిలో ప్రేమజంట సజీవదహనం

Tue,March 19, 2019 01:52 AM

కొత్తగూడెం క్రైం/చుంచుపల్లి : కడవరకు తోడుంటానని చెప్పి.. నా అనుకునే వారిని సైతం వదిలి నమ్మి వచ్చిన ఆ యువతికి.. నరకం చూపించి కాలయముడై దేహాన్ని దహించివేశాడు..! అనంతరం ఆత్మాహుతికి పాల్పడ్డాడు. చివరికి సహజీవనం చేస్తున్న ఆ జంట మంటల్లో సజీవదహనమైంది. ఈ హృదయవిదారక సంఘటన ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.అనుమానాస్పద స్థితిలో ప్రేమజంట సజీవద హనమైన సంఘటన చుంచుపల్లి మండలం రామాంజనేయకాలనీలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు, కాలనీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీకి చెందిన మాచర్ల వినోద్ (25) ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. వినోద్ రేడేళ్ల క్రితం చమన్‌బస్తీకి చెందిన తేజస్వీని (18) వెంటపడి ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ప్రేమ మొదలైంది. ఏడాది క్రితం తేజస్విని తల్లిదండ్రులను సైతం వదిలి వినోద్ వద్దకు వెళ్లింది. అప్పటి నుంచి రామాంజనేయకాలనీ సబ్‌స్టేషన్ సమీపంలో గల వినోద్ ఇంట్లోనే ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. అప్పటి నుంచి తేజస్వినిని తల్లిదండ్రులు చేరదీయకపోవడంతో నెల రోజుల క్రితం సదరు యువతి పుట్టింటికి వెళ్లి కుటుంబ సభ్యులతో గడిపి వెళ్లింది.

సోమవారం తెల్లవారుజామున వినోద్ నివసిస్తున్న ఇంటినుంచి మంటలు వస్తుండటాన్ని గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఇంట్లోని కిటికీలో నుంచి గదిలోకి చూడగా ఇద్దరూ కాలిపోయి శవమై ఉన్నట్లు కనిపించారు. ఈ విషయమై స్థానికులు, ఫైర్ సిబ్బంది చుంచుపల్లి పోలీసులకు సమాచారం అదించారు. కొత్తగూడెం డీఎస్పీ షేక్ మహమ్మద్ అలీ, సీఐ తాటిపాముల కరుణాకర్, ఎస్సై లొడిగ రవీందర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. వినోద్ వ్యవహార శైలి సైకోని తలపించే విధంగా ఉంటుందని, ఈ క్రమంలోనే వారిరువురి మధ్య గొడవ జరిగి తేజశ్వనికి నిప్పంటించి హతమార్చాడని, ఆపై వినోద్ సైతం మంటల్లో కాలిపోయి మృతి చెంది ఉంటాడని బాధితురాలి తండ్రి దేవదాస్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి సుమారు 12:30గంటల వరకు రోడ్డుమీద ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించాడని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో వినోద్‌పై పలు కేసులు సైతం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..? లేద ఇతరుల పనా..? లేక వినోద్ స్వయంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై రవీందర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

57
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles