నేడే లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్

Mon,March 18, 2019 01:33 AM

-ఉదయం 10 గంటలకు విడుదల
-11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ
-25వ తేదీ వరకు గడువు.. 26న స్క్రూట్నీ.. 28న ఉపసంహరణ
ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఖమ్మం పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్‌ను నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, మహబూబాబాద్‌ల పార్లమెంట్ ఎన్నికలకు అక్కడి కలెక్టర్ సోమవారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ తరువాత 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ మధ్యలో ప్రభుత్వ సెలవుదినాలైన 21,23,24 తేదీలలో నామినేషన్ల స్వీకరణ ఉండదు. ఇక మిగిలింది 18,19,20,25 తేదీలలో మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తారు. కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో వివిధ రాజకీయ పక్షాల నాయకులు వేగవంతంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో, మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరిస్తారు. కనుక ఆ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. నామినేషన్లను అందించేందుకు గాను కేవలం ఐదుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు.

ఇంకా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరో నిర్ణయం కానందున తొలిరోజు నామినేషన్లు దాఖలు కాకపోవచ్చు అనే అభిప్రాయం నెలకొంది. 26న నామినేషన్ల స్క్రూట్నీ, 28న ఉపసంహరణ, ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్, మే 23న కౌటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈమేరకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 15 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 1798 పోలింగ్ కేంద్రాలను, 948 పోలింగ్ లోకేషన్లను ఏర్పాటు చేశారు.

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పటిష్టంగా అమలు పర్చేందుకుగాను వివిధ తనిఖీ బృందాలను నియమించారు. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు 33 బృందాలను, 21ఫ్లయింగ్ స్క్యాడ్, 22 స్టాటిస్టిక్ సర్వేలెన్స్ బృందాలు, 31 వీడియో సర్వేలెన్స్ బృందాలతో పాటు 162 మంది సెక్టార్ అధికారులను కేటాయించారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి 7 నియోజకవర్గాలు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. 7 నియోజకవర్గాలకు ఏడుగురు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. పార్లమెంట్ ఎన్నికలు పురస్కరించుకుని ఇప్పటికే ఈవీఎంల మొదటి విడత పరిశీలన పూర్తి చేశారు. 2227 బ్యాలెట్ యూనిట్లు, 1676 కంట్రోల్ యూనిట్లు, 1768 వీవీప్యాట్‌లను సిద్ధంగా ఉంచారు.

భద్రాద్రి జిల్లాలో ఏర్పాట్లు..
మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలను ప్రకటిస్తారు. పార్లమెంట్ ఎన్నికల కోసం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆధ్వర్యంలో అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు జిల్లాలో 995గా పోలింగ్ కేంద్రాలు అదనంగా 84 పెరగగా మొత్తం 1079పోలింగ్ కేంద్రాలు ఏర్పాడ్డాయి. ఓటర్ల సంఖ్య 9,15,872గా ఉంది. ఈ నెల 25న తాజా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.

11 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి ఉండాలి..
ఓటరు తన పోలింగ్ కేంద్రాల వివరాలను తెలుసుకునేందుకుగాను శాసనసభ ఎన్నికలలో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఫొటో ఓటరు స్లిప్ పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల కనుగుణంగా ఓటరు స్లిప్పులతో పాటు నిర్దేశించిన 11 రకాల గుర్తింపు ధ్రువీకరణ పత్రాలతో ఏదేనీ ఒక గుర్తింపు పత్రాన్ని ఓటరు తనతోపాటు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డు, బ్యాంక్, పోస్టాఫీస్ పాస్‌పుస్తకం, పాన్‌కార్డు, కార్మిక శాఖ వారిచే జారీ చేయబడిన స్మార్ట్ కార్డు ఆరోగ్య భీమాకార్డు ఉపాధిహామీ జాబ్‌కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీల అధికారిక గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు వీటిలో ఏదేని ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా ఓటరు చూపించాల్సి ఉంటుంది.

అభ్యర్థులు నేర చరిత్ర వివరాలను తెలపాలి..
లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్‌తో పాటు ఫారం-26 అఫిడవిట్‌లో అభ్యర్థి పెండింగ్ నేర చరిత్ర వివరాలను తప్పనిసరిగా సమర్పించాలి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు పత్యేకంగా బ్యాంకు ఖాతాను ప్రారంభించి ఖాతా నెంబరును నామినేషన్ ఫారంలో తెలియపర్చాలి.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్ ఫారం నెం.26లో సమర్పించిన అభ్యర్థి నేరచరిత్ర పెండింగ్ వివరాలను నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థి, రాష్ట్రస్థాయిలో అభ్యర్థికి సంబంధించిన రాజకీయ పార్టీ పోలింగ్ కంటే రెండు రోజుల ముందు వరకు కనీసం ముడుసార్లు సర్యులేషన్ కలిగిన పేపర్లో అదేవిధంగా స్థానిక కేబుల్ టెలీవిజన్‌లో ప్రచారం, ప్రసారం చేయలసి ఉంటుంది. నామినేషన్ పత్రంతోపాటు అభ్యర్థి ఫొటోలను కూడా తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. మొదటి ర్యాండమైజేషన్ పూర్తి అయిన ఈవీఎంలను నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రవాణా చేయడం జరుగుతుంది. నామినేషన్ల విత్‌డ్రాయల్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత రిటర్నింగ్ అధికారి స్థాయిలో రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియ ఉంటుంది. అట్టి ప్రక్రియను కూడా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే చేపడతారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు మోడల్ కోడ్‌ఆఫ్ కండక్ట్‌ను పాటించాల్సి ఉంటుంది.

63
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles