సర్పంచ్‌లకు పాలనపై పట్టు ఉండాలి

Tue,February 19, 2019 12:54 AM

-సర్పంచ్‌లకు ప్రారంభమైన శిక్షణ తరగతులు
-సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి సర్పంచ్‌ల శిక్షణ తరగతులకు హాజరైన జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు
-భద్రాచలం శిబిరంలో పాల్గొన్న డీపీవో ఆశాలత
చుంచుపల్లి : పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే సర్పంచ్‌లు అంకితభావంతో పనిచేయాలని జిల్లాజాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాల సర్పంచ్‌ల శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలులోకి వచ్చిందని, ఇందులో విధులు, విధివిధానాలు మారాయని, గతంతో పోలిస్తే కొత్త పాలన ప్రజల ముంగిట్లోకి రానుందని, అదే దశలో సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు పనిచేయాలన్నారు. ఈశిక్షణలో నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెడితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు సర్పంచ్‌లుగా ప్రజలు గెలిపించారని దీనిని సద్వియోగం చేసుకొని మంచి ఫలితాలను పొందాలన్నారు. అనంతరం శిక్షకులు సర్పంచ్‌లకు విధులు, విధానాలపై అవగాహన కల్పించారు.

విధులపై ప్రత్యేక దృష్టి సారించాలి..
పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీ చాలా కీలకమైందని, నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు ప్రజలకు నేరుగా సేవలు అందించడంలో పంచాయతీ ప్రధాన పాత్ర పోషిస్తుందని జేసీ అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను గ్రామాల్లో ఏర్పాటు చేస్తుందని, తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టానికి రూపకల్పన చేసి స్థానిక సంస్థలకు విశేష అధికారాలను అప్పజెప్పిందన్నారు. పంచాయతీల్లో సర్పంచ్‌లుగా గెలిచిన అ భ్యర్థులు అధికారాలు, విధులు, నిధుల వినియోగానికి సంబంధించిన చెక్‌పవర్, పంచాయతీల్లో గ్రామసభల నిర్వహణ, సామాజిక బాధ్యతగా చేయాల్సిన పనులు కొత్త చట్టంలో పొందుపర్చారని మాస్టర్ ట్రైనర్లు వివరించారు. ప్రతీ దాంట్లో కీలకమైన నిబంధనలు అమలు కానున్నాయని, కొత్త చట్టాన్ని అమలు చేసేందుకే పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసిందని వివరించారు. సర్పంచ్‌లకు విధులతో పాటు గతంలో లేని విధంగా తప్పని సరిగా పాటించాల్సిన విధులు ఉన్నాయని, ప్రతీ పంచాయతీలో రెవెన్యూ, వ్యవసాయ, రక్షిత, ఇంజినీరింగ్, ఎంఈవోకు బాధ్యతలు కేటాయించారన్నారు. గ్రామసభను సరిగా నిర్వహించకపోతే సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించే నిబంధనను చట్టంలో పొందుపర్చారని, ఏడాదికి ఆరు గ్రామసభలు, చివరి రెండు సభలు కేవలం మహిళలు, వృద్ధులతోనే నిర్వహించాలని సర్పంచ్‌లకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణ తరగతులు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. తొలిరోజు జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ జగత్‌కుమార్, డీఎఫ్‌వో రాంబాబు, డీపీవో ఆశాలత, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లికి సంబంధించిన సర్పంచ్‌లు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.

భద్రాచలం, నమస్తే తెలంగాణ : సర్పంచ్‌లు గ్రామాభివృద్ధిలో పాలు పంచుకోవాలని డీపీవో ఆశాలత పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచ్‌ల శిక్షణ శిబిరంలో డీపీవో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి పట్ల సర్పంచ్‌లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను తక్షణమే గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకురావాలన్నారు. రోడ్లపై చెత్తా చెదారం వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ నిధులను అభివృద్ధికి కేటాయింపులు చేసుకొని గ్రామ పురోగతికి అందరు సమైక్యంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అశ్వారావుపేట ఈవోఆర్‌డీ దేవరాజ్, దుమ్ముగూడెం, చర్ల మండలాలకు చెందిన సర్పంచ్ పాల్గొన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles