ఏకలవ్య పాఠశాలల మంజూరు

Tue,February 19, 2019 12:50 AM

-అభినందనీయం : ఎంపీ సీతారాంనాయక్
భద్రాచలం, నమస్తే తెలంగాణ/దుమ్ముగూడెం : మహబూబాబాద్ నియోజకవర్గంలో తొమ్మిది ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని నియోజకవర్గ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన లక్ష్మీనగరం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ కమిటీలో సభ్యునిగా ఉన్నానని, మోడల్ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గ పరిధిలోని జనాభా ప్రకారం 50శాతం ఉన్న మండలాల్లో ఈ రెసిడెన్షియల్ ఏకలవ్య పాఠశాలలను మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చర్ల, ఇల్లెందు నియోజకవర్గంలో ఇల్లెందు, టేకులపల్లి మండలాలకు, పినపాక నియోజకవర్గంలో గుండాల, పినపాక, మహబూబాబాద్ నియోజకవర్గంలో బయ్యారం, గూడూరు, ములుగు నియోజకవర్గంలో కొత్తగూడలలో ఏకవల్య పాఠశాలల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ కేజీ నుంచి పీజీ వరకు గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గాను ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తుండటంతో కేంద్రం కూడా వీటికి అనుమతులు ఇచ్చి నిధులు మంజూరు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. అదేవిధంగా ఒక్కో పాఠశాలకు 15 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయా మండలాల అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

ఏడాదికి 100 మంది పిల్లలు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతానికి అద్దె భవనాల్లో ఏకలవ్య పాఠశాలలను నిర్వహించేలా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. పర్ణశాలలోని కమ్యూనిటీ హాలు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పర్ణశాల ఎంతో పర్యాటకంగా అభివృద్ధి చెందిందని, ఇక్కడ ఔషధ మొక్కలతో పాటు జింకలు పెంచేలా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, దీనికి ఎంపీ నిధుల నుంచి రూ.20లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా గిరిజనులు నివసిస్తున్నారని, గిరిజనులు సాగుచేస్తున్న భూములకు జూన్ నాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోడు పట్టాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ బీ వాసుదేవరావు, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తెల్లం వెంకట్రావు, జడ్పీటీసీ అన్నెం సత్యాలు, ఎంపీపీ తెల్లం సీతమ్మ, ఎంపీడీవో బైరవ మల్లేశ్వరి, తహసీల్దార్ మంగీలాల్, టీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. భద్రాచలంలో జరిగిన సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు తిప్పన సిద్దులు, టీఆర్‌ఎస్ ఇల్లెందు నాయకులు జానీ తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles