శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు కసరత్తు


Tue,February 19, 2019 12:49 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ ఫిబ్రవరి 18 : శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6 నుంచి 20వ తేదీ వరకు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో జరగనున్నాయి. దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి తాళ్లూరి రమేష్‌బాబు ఈ మేరకు అధికారికంగా సోమవారం ప్రకటించారు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్14న శ్రీస్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం, ఏప్రిల్15న శ్రీస్వామివారి పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఏప్రిల్6న చైత్రశుద్ద పాఢ్యమి వికారి నామ సంవత్సరాది ఉగాది పండుగ నూతన పంచాంగశ్రవణం, ఆస్థానం, తిరువీధిసేవలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్10న ఉత్సవ అంకురారోపణం, మండప వాస్తు హోమం, ఏప్రిల్11న గరుడ పట లేఖణం, గరుడ పట అదివాసం, ఏప్రిల్12న అగ్నిముఖం, అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, దేవతావాహణం, ఏప్రిల్13న ఎదుర్కోలు ఉత్సవం, గరుడ సేవ, ఏప్రిల్14న శ్రీసీతారాముల తిరుకళ్యాణ మహోత్సవం, ఏప్రిల్15న మహా పట్టాభిషేకోత్సవం, ఏప్రిల్16న సదశ్యం, ఏప్రిల్20న చక్ర తీర్ధం, పూర్ణాహుతి, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశ రాధనలు, శ్రీ పుష్పయాగం, ఉత్సవ సమాప్తి జరుగును.శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల షెడ్యుల్ విడుదలైన నేపథ్యంలో ఇక ఉత్సవాల విజయవంతంపై దేవస్థానం దృష్టి సారించింది. దేవస్థానం ఈవో తాళ్లూరి రమేష్‌బాబు ఆలయ అధికారులు, సిబ్బందితో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కసరత్తులు జరుపుతున్నారు. పెయింటింగ్, విద్యుత్ సౌకర్యం, కళ్యాణ మండపం ఏర్పాట్లు, తలంబ్రాల కౌంటర్లు, చలువ పందిళ్ల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, గోదావరి తీరం వద్ద ఏర్పాట్లు మొత్తం 20 తాత్కాలిక పనులకు సంబంధించి అంచనాలను తయారు చేశారు. వీటిని ఆమోదం కొరకు దేవాదాయశాఖ కమీషనర్‌కు పంపించి అనుమతులు పొందారు. ఈ ఏడాది శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు రూ.84లక్షల 87వేలతో వివిధ తాత్కాలిక పనులను చేపట్టనున్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి సకాలంలో పనులు పూర్తి చేయుటకు ప్రయత్నిస్తున్నట్లు ఈవో తెలిపారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles