గురుకులం ప్రగతి సోపానం


Mon,February 18, 2019 12:17 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: ఒకప్పుడు మన్యం నిరక్షరాస్యతకు చిరునామా.. వలస పాలకుల పాపాన ఏజెన్సీలో విద్య అధోగతిగా పాలైంది.. సరైన సౌకర్యాలు లేక గురుకులాలు, ప్రభుత్వ బడులు కునారిల్లేవి.. దీంతో గిరిజన బిడ్డలు మధ్యలోనే చదువు ఆపే పరిస్థితి ఉండేది.. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ సర్కార్ విద్యా ప్రమాణాలు పెంచేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నది.. చక్కటి పోషకాహారం, ప్రణాళికా బద్ధంగా విద్యాబోధన, ఇంటిని మరిపించేలా హాస్టళ్ల నిర్వహణ, ప్రతీ విద్యార్థి ప్రత్యేక శ్రద్ధ..తదితర విశేషాంశాలు తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నాయి.. దీంతో రాష్ట్రంలో గురుకులాలకు క్రేజ్ పెరిగింది..!


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యా ప్రగతే ధ్యేయంగా గురుకులాలను బలోపేతంగా చేస్తోంది. ఇందుకోసం కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తోంది. ఖమ్మం రీజియన్ పరిధిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీటీడబ్ల్యూఎస్ స్కూల్స్ 6, టీటీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాలలు6, టీటీడబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజీలు 6, కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ 1, అప్‌గ్రేడ్ జూనియర్ కాలేజీ 2, మినీ గురుకులం 1, ఏకలవ్య మో డల్ రెసిడెన్షియల్ స్కూల్స్ రెండు ఉన్నాయి. ఈ పాఠశాలలు, కళాశాలల్లో మొత్తం 6,552 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో 2,368 మంది బాలురు, 4,184 మంది బాలికలు ఉన్నారు. ఖమ్మం జిల్లా పరిధిలో టీటీడబ్ల్యూఆర్ స్కూల్స్ 3, స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (ప్రతిభా పాఠశాలలు)1, టీటీడబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజీ1 ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 6, 552 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో బాలురు 3,235మంది కాగా, బాలికలు 4709మంది. మొత్తం 26 గురుకులాల ద్వారా 7,986 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు. గత పాలకుల హయాంలో గిరిజన విద్య అత్యంత దయనీయంగా ఉండేది. టీఆర్‌ఎస్ సర్కార్ ఏర్పాటయ్యాక గిరి బిడ్డల్లో విద్యా ప్రమాణాలు మరింత పెరిగాయి. గతేడాది పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో గురుకులాల్లో 2017-18లో రాష్ట్ర వ్యాప్తంగా 79శాతం పరీక్షా ఫలితాలు రాగా, ఖమ్మం ఆర్‌సీ రీజియన్ 69. 77 శాతం ఉత్తీర్ణత సాధించింది. 10కి 10 జీపీఏ మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించారు. కార్పొరేట్ స్థాయి విద్యా ప్రమాణాలు గురుకులాల్లో నెలకొనడంతో క్రేజ్ మరింత పెరిగింది.

సకల సౌకర్యాలతో విద్యా బోధన..
గురుకులాల ఖమ్మం రీజియన్ పరిధిలో ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో అన్ని సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం కోట్లాది రూపాయల నిధులను వెచ్చించింది. పక్కా భవనాలతో కూడిన తరగతి గదులు, హాస్టళ్లను ఏర్పాటు చేసింది. ప్రత్యేక పోటీ పరీక్షల ద్వారా గురుకులాల్లో ఉపాధ్యాయ, అధ్యాపక పోస్ట్‌లను భర్తీ చేసింది. అధ్యాపకేతర పో స్ట్‌లు సైతం భర్తీకి నోచుకున్నాయి. ఖమ్మం రీజియన్ పరిధిలో 202 ఉపాధ్యాయులు,76 మంది నాన్‌టీచింగ్‌స్టాప్ రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. మిగతా పోస్ట్‌ల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులు, సిబ్బంది పనిచేస్తున్నారు.

ఇంటిని మరిపించేలా ఆహార మెనూ..
గురుకులాల్లో ఇంటిని మరిపించేలా ప్రభు త్వం మెనూ అమలు చేస్తోంది.నెలలో నాలుగు రోజులు చికెన్ బిర్యానీ, రెండు రోజులు మటన్ బిర్యానీ విద్యార్థులకు పెడుతున్నారు.ప్రతీ గురువారం పూరీ, ప్రతీ సోమవారం న్యూడిల్స్, ప్రతీ ఆదివారం చపా తీ అందజేస్తున్నారు. సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. హాస్టల్స్‌లో గతంలో విద్యార్థులు రక్తహీనతకు లో నై అనారోగ్యం పాలయ్యేవారు.అందుతున్న పో షకాహారంతో ఆ సమస్యలకు పరిష్కారం దొరికింది.
షోషణ భేష్.. అన్నీ ఉచితం..
ప్రతీ బాలికకు ప్రభుత్వం నెలకు రూ.75, ప్రతీ బాలుడికి నెలకు రూ.50 చొప్పున కాస్మోటిక్స్ నగదు ఇస్తున్నది. అంతేకాకుండా విద్యార్థులకు కార్పెట్లు, బెడ్‌షీట్లు అన్నీ ఉచితంగా అందజేస్తున్నది. నైట్ డ్రస్‌లు, ట్రాక్‌షూట్, బూట్లు పంపిణీ చే సింది. విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేసింది. ప్రతీ విద్యార్థికి 25 లాంగ్ నోట్‌బుక్‌లు ఇచ్చింది. 3 నుంచి 7 తరగతి చదువుతున్న చిన్నారులకు నెలకు ఆహారానికి గాను రూ.950, 8 నుంచి 10 వరకు విద్యార్థులకు రూ.1100, ఇంటర్ ఆపైన విద్యార్థులకు రూ.1500 ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది.

సర్కార్ బడుల్లో సంక్షేమ ఫలాలు..
గురుకులాల్లో ప్రభుత్వం సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో విద్యార్థుల్లో విద్యా ప్రగతి సాధ్యమవుతోంది. పాఠశాలలు, కళాశాలల్లో కార్పొరేట్ స్థాయిని మరిపించేలా విద్యాబోధన జరుగుతోంది. మరోవైపు ఆట పాటలపై విద్యార్థులను ఉల్లాస పరుస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు విద్యనభ్యసిస్తుండటంతో వారిలో వ్యక్తి నైపుణ్యం పెంపొందుతుంది. గతంలో గురుకులాలో చదివిన విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల ద్వారా గిరిజన విద్యా ప్రగతికి పూనుకున్న నేపథ్యంలో ఏజెన్సీ పల్లెల్లో విద్యా అవకాశాలు పెంపొంది గిరి బిడ్డలు ఉన్నతమైన రంగాల్లో స్థిరపడుతున్నారు.

151
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles