నేడే తొలి సమరం


Sun,January 20, 2019 11:59 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసిన తర్వాత తొలి గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్‌ల ఎన్నికల తొలి విడత పోలింగ్ సోమవారం జరగనుంది. జిల్లాలోని ఏడు మండలాల్లో ఎన్నికల్లో అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది అన్ని పంచాయతీల్లో వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం రెండుగంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. తొలుత వార్డు మెంబర్ల ఫలితాలు వెలువడుతాయి. అన్ని వార్డుల పోలింగ్ బూతుల్లో సర్పంచ్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను ఆయా పంచాయతీల రిటర్నింగ్ అధికారులు క్రోడీకరించి లెక్కించిన తర్వాత సర్పంచ్ ఎన్నిక ఫలితం వెలువడనుంది. తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారికి మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలు ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ప్రచారం సమాప్తమైనప్పటికీ ఆదివారం కూడా అంతర్గతంగా ఎవరికీవారు తమ వంతు ఓటర్ల ప్రసన్నం చేసుకునేందుకు చివరి ప్రయత్నాలను కొనసాగించారు.


జిల్లాలోని అశ్వాపురం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, పాల్వంచ, మణుగూరు, ములకలపల్లి మండలాల పరిధిలోని 150 సర్పంచ్ స్థానాలకు, 1181వార్డు మెంబర్ల స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 3971 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. 52 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, మరో 52మంది స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులు, 1687 మంది పోలింగ్ సిబ్బంది, 1868 మంది ఓపీఓలను పోలింగ్ ప్రక్రియలో విధులు నిర్వహించేందుకు నియమించారు. 174 సర్పంచ్ స్థానాల్లో 22మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం కాగా, రెండు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు. పాల్వంచ మండలంలోని సంగెం, నారాయణరావుపేట ఎస్సీ కాలనీ సర్పంచ్ స్థానాలకు ఏ ఒక్కరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు నిర్వహించడం లేదు. మొత్తం 24పోను మిగతా 150 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 450 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారి భవితవ్యం కొన్ని గంటల్లో తేలనుంది. మొత్తం 1534 వార్డు స్థానాలకు 321వార్డుల మెంబర్లకు ఏకగ్రీవంకాగా, 32వార్డు స్థానాలకు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. ఇవి మినహా 1181 వార్డులకు 2,815 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరి భవితవ్యం తేలిన తర్వాత వీరిలో నుంచి ఎవరో ఒకరు ఆయా పంచాయతీలకు ఉప సర్పంచ్‌లుగా ఎన్నిక కానున్నారు. మొత్తం మీద తొలి విడతలో 3,265 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే సమయాన్ని, వారి భవిష్యత్‌ను నిర్ధేశించే ఓటర్ల తీర్పు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వెల్లడి కానుంది. అన్ని గ్రామాల్లో గెలుపు ఓటములపై ఎవరికీవారు దీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ మద్దతు కోసం ఎక్కువ మంది అభ్యర్థులు చివరి క్షణం వరకు తమ వంతు ప్రయత్నాలు కొనసాగించారు. పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్న సమయంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేశారు. పూర్తి గిరిజన ప్రాంతమైన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో తండాలు, కోయగూడేలు, దళిత వాడల నుంచి ఎక్కువ మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికల ద్వారా పంచాయతీ పరిపాలనలో ప్రత్యక్ష భాగస్వాములు కానున్నారు.

వెంటనే ఫలితాలు - ఉప సర్పంచ్ ఎన్నిక
పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకు పూర్తికాగానే రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం ఆయా పోలింగ్ కేంద్రాల్లోనే ఏర్పాట్లు చేశారు. తొలుత వార్డు మెంబర్లకు పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. సర్పంచ్ అభ్యర్థులకు ఆయా వార్డుల్లో వచ్చిన ఓట్లను అన్ని వార్డుల నుంచి వచ్చిన ఓట్ల వివరాలతో లెక్కించి సర్పంచ్ అభ్యర్థిగా ఎవరు ఎక్కువ ఓట్లను పొందుతారో వారిని విజేతగా ప్రకటిస్తారు. వార్డు మెంబర్ల ఫలితాలన్నీ వచ్చిన తర్వాత ఆ గ్రామపంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎన్నికైన వార్డు మెంబర్లందరినీ సమావేశపరిచి ఉప సర్పంచ్ ఎన్నిక కోసం ప్రతిపాదనలను స్వీకరిస్తారు. ఉప సర్పంచ్‌గా నిల్చునే వార్డుమెంబర్‌కు ఒకరు ప్రతిపాధించాలి. మరో వార్డుమెంబర్ బలపరచాలి. పోటీలో ఉన్న ఉప సర్పంచ్ అభ్యర్థులను వార్డుమెంబర్లు చేతులెత్తే విధానంతో లేదా చిట్టీలపై పేర్లు రా సే ప్రక్రియతో ఎన్నుకుంటారు. ఎక్కడైనా ఉప సర్పం చ్ బరిలో ఉన్నవారికీ సమానంగా ఓట్లు వస్తే సర్పంచ్ ఓటును పరిగణలోకి తీసుకుంటారు. లేనిపక్షంలో సర్పంచ్‌గా గెలుపొందినవారితో నిమిత్తం లేకుండానే ఉప సర్పంచ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. టై అయితేనే సర్పంచ్ ఓటును కీలకంగా భావించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ నేడు తొలి విడత సర్పంచ్, వార్డుమెంబర్లు, ఉప సర్పంచ్‌ల ఫలితాలు వెల్లడవుతాయి. అన్నీ పంచాయతీల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు, వారిని బలపరుస్తున్నవారు ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠతతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా, మరికొందరు గెలుపు ఓటములు సహజమనే ఆలోచనతో ఉన్నారు.

ఒక్కొక్కరికి రెండు ఓట్లు ..
పంచాయతీ ఎన్నికల్లో ఒక్కొ ఓటరు రెండు ఓట్లు వేయనున్నారు. సర్పంచ్ అభ్యర్థికి, వార్డు స్థానానికి వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు కలిపి మొత్తం రెండు బ్యాలెట్ పత్రాలను వేర్వేరుగా తీసుకొని తమ అమూల్యమైన ఓటు ముద్రను గుర్తులపైన మాత్రమే వేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల పేర్లు కూడా ఉండవు. కేవలం గుర్తుల ఆధారంగానే సర్పంచ్, వార్డు మెంబర్ల జాతకాలను ఈ ఓటింగ్ ద్వారా ఓటర్లు తేల్చనున్నారు. 1,97,358 మంది ఓటర్లు రెండు ఓట్ల చొప్పున ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 97,228 మంది పురుషులు, 1,00,130 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆయా పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించి పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ సిబ్బందికి అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థుల ఏజెంట్లు ఓటర్ల జాబితాలను ఎప్పటికప్పుడు ఓటింగ్‌కు అనుగుణంగా పరిశీలించుకునేందుకు అవకాశం ఉంది.

115
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles